Mutton Recipe: మటన్ రోస్ట్ ఇలా చేశారంటే ఒక్క ముక్క కూడా మిగలదు
నాన్‌వెజ్ ప్రియులకు మటన్ రెసిపీలు అంటే ఎంతో ప్రీతి. మటన్ వేపుడు, చికెన్ వేపుడు ఏదైనా సరే ఒక్క ముక్క కూడా మిగలనివ్వరు.
మటన్ కర్రీ, మటన్ బిర్యానీ, మటన్ వేపుడు... ఎక్కువగా మటన్‌తో చేసే వంటకాలు ఇవే. ఎప్పుడూ ఇవే తింటే బోర్ కొట్టేస్తుంది. ఒకసారి ఇక్కడ చెప్పినట్టు మటన్ రోస్ట్ తయారు చేసి చూడండి. ఇది మటన్ వేపుడులాగే కనిపిస్తుంది, కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకుని తిన్నారంటే, మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేలా ఉంటుంది ఇది. బిర్యానికి జతగా చాలా బాగుంటుంది, స్నాక్స్ లా కూడా దీన్ని తినేయొచ్చు. దీన్ని చేయడం కూడా చాలా సులువు.
కావాల్సిన పదార్థాలు
మటన్ - అరకిలో
ఉల్లిపాయ - ఒకటి
టమోటో - ఒకటి
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి - ఐదు రెబ్బలు
మిరియాల పొడి - అర టీ స్పూన్
కారం - అర టీ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
ధనియాల పొడి - అర టీ స్పూన్
గరం మసాలా - అర టీ స్పూన్
కరివేపాకులు - రెండు రెమ్మలు
నూనె - సరిపడా
తయారీ ఇలా
1. మటన్‌ను శుభ్రంగా కడిగి పసుపు, మిరియాల పొడి వేసి, ఒక గ్లాసు నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించాలి.
2. అరగంట పాటు ఉడికిస్తే మెత్తగా ఉడుకుతుంది.
3. తర్వాత కుక్కర్లోని మటన్ ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి.
4. స్టవ్ పై కళాయి పెట్టి, నూనె వేయాలి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను బాగా వేయించాలి.
5. అందులో కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టును, కరివేపాకును వేసి వేయించాలి.
6. అవి వేగాక ధనియాల పొడి, ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసి వేయించాలి.
7. ఐదు నిమిషాల తర్వాత తరిగిన టమోటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
8. టమోటో మెత్తగా నీళ్లలా మారి, మళ్ళీ చిక్కగా ఇగురులా మారుతుంది.
9. ఆ సమయంలో ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్‌ను వేయాలి.
10. బాగా కలిపి మూత పెట్టాలి. చిన్న మంటపై స్టవ్ పెట్టాలి. అలా 20 నిమిషాలు వేయిస్తే చాలు మటన్ రోస్ట్ రెడీ అయిపోతుంది.
మటన్ తో చేసే వంటకాలు వారానికి ఒక్కసారి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. లేదా మితంగా వారంలో రెండుసార్లు తిన్నా మేలే. దీని పోషకాలు అధికం. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటూ మన శరీరానికి అవసరమైన బి విటమిన్లు, అమినో ఆమ్లాలు, కాల్షియం, జింక్, సెలీనియం, పొటాషియం, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. గర్భిణీలు మటన్ తినడం వల్ల పుట్టే బిడ్డలకు ఈ పోషకాలన్నీ అందుతాయి. అలాగే ఆ బిడ్డల్లో న్యూరల్ ట్యూబ్ సమస్యలు రావు. మహిళలు మటన్ తినడం వల్ల రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పిని తట్టుకోగలరు. ఇందులో ఉండే కాల్షియం వల్ల ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి. చర్మం కూడా ఎంతో మెరుపును సంతరించుకుంటుంది.
మటన్ తినడం వల్ల సొరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలు రావు. అయితే మటన్ చాలా మితంగా తినాలి. అధికంగా తింటే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగిపోతుంది. దీని వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెండు రోజులకు వందగ్రాములకు మించి తినకూడదు. డయాబెటిస్ ఉన్న వారు కూడా మటన్ తక్కువగా తినాలి.
Also read: మగవారూ జాగ్రత్త, లేటు వయసులో పిల్లల్ని కంటున్నారా? ఆ సమస్యలు పెరిగిపోతాయి