Pregnancy Complications : మహిళల్లో పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఇవే.. ఆ తప్పులు అస్సలు చేయొద్దంటోన్న నిపుణులు
regnancy Planning : మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో చాలా మంది మహిళలు సహజంగా గర్భం దాల్చలేకపోతున్నారు. దీనికి కారణాలు ఏంటో.. ఎలాంటి పరిష్కరాలు ఉన్నాయో చూసేద్దాం.

Infertility Causes in Women : నేటి కాలంలో తల్లి అవ్వడం ఎంత అందమైన కలనో.. చాలామందికి అది అంతే సవాలుగా మారుతోంది. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన రొటీన్ మహిళల్లో గర్భసమస్యలను పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారతదేశంలో ప్రతి 6 జంటలలో 1 జంట వైద్య సహాయం లేకుండా పేరెంట్స్ కాలేకపోతున్నారట. కాబట్టి మహిళల్లో పిల్లలు పుట్టడానికి ఇబ్బంది కలిగించే సమస్యలు ఏంటో.. ఎలాంటి తప్పులు వారిపై మరింత ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం.
గర్భధారణకు కారణాలు
మహిళలు గర్భం దాల్చలేకపోవడానికి జీవసంబంధమైన, జీవనశైలికి సంబంధించిన సమస్యలు కూడా కారణమవుతాయి. దీని కారణంగా చాలాసార్లు సహజంగా గర్భం దాల్చలేరు. ఇందులో సాధారణ కారణం ఏమిటంటే.. నెలసరి రెగ్యులర్‌గా రాకపోవడం. లేదా అండాశయంలో ఆటంకం ఏర్పడటం. దీనితో పాటు PCOD, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సమస్య కూడా మహిళల సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి.
ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయినా.. గర్భాశయం నిర్మాణంలో లోపం ఉంటే లేదా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వంటి సమస్యలు ఉంటే.. మహిళలు గర్భం దాల్చడం కష్టమవుతుంది. కొన్నిసార్లు వయస్సు పెరగడం, నిరంతర ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి కూడా ఈ సమస్యను పెంచుతాయి. అయితే ఈ కారణాలను గుర్తిస్తే.. సరైన పరీక్షలు, చికిత్స ప్రారంభిస్తే సహజ గర్భధారణకు అవకాశం ఉంటుంది.
పురుషులు కూడా కారణమే
మహిళ గర్భవతి కాలేకపోతే.. తప్పు ఆమెదేనని ఇప్పటికీ సమాజంలో ఒక అపోహ ఉంది. వాస్తవానికి.. భారతదేశంలో దాదాపు 40 శాతం కేసుల్లో పురుషులలో సంతానలేమి కారణంగా జంటలు తల్లిదండ్రులు కాలేకపోతున్నారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. తక్కువ స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యత లోపం వంటివి పురుషులలో సంతానలేమికి ప్రధాన కారణాలు.
టెస్ట్ చేయించుకోవాల్సిందే
భార్యభర్తలు ఏడాది ప్రయత్నించిన తర్వాత కూడా గర్భం దాల్చలేకపోతే.. ఆ మహిళ వయస్సు 35 సంవత్సరాలు అయితే ఆమె తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. అలాగే మహిళ భాగస్వామికి స్పెర్మ్ పరీక్ష చేస్తారు. ఎందుకంటే పురుషుల సంతానోత్పత్తి స్థితిని విస్మరించడం సరికాదు. ఆ తర్వాత మహిళకు హార్మోన్ల పరీక్షలు, అల్ట్రాసౌండ్ చేస్తారు. దీనివల్ల ఆమె ఎందుకు గర్భం దాల్చలేకపోతుందో తెలుసుకోవచ్చు.
ఆటంకం కలిగించే అలవాట్లు
మహిళలు కొన్ని సందర్బాల్లో ఎటువంటి వైద్య సమస్యలు లేకుండా కూడా గర్భం దాల్చలేరు. దీనికి కారణం వారి దైనందిన అలవాట్లు కావచ్చు. ఆలస్యంగా నిద్రపోవడం, నిరంతరం ఒత్తిడికి గురికావడం, ఫాస్ట్ ఫుడ్ తినడం, ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు లేదా చాలా తక్కువ బరువు ఉండటం కూడా శరీర హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇవి అండాశయంపై ప్రభావం చూపి.. గర్భధారణలో ఇబ్బంది కలిగిస్తాయి.
ధూమపానం, మద్యం సేవించే మహిళల సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుంది. కొంతమంది మహిళలు వైద్యుల సలహా లేకుండా ఎక్కువ కాలం పెయిన్ కిల్లర్స్ లేదా హార్మోన్ల మందులు వాడుతుంటారు. ఇది భవిష్యత్తులో గర్భం దాల్చడానికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి, మీరు గర్భం దాల్చాలని ఆలోచిస్తున్నట్లయితే.. మొదట మీ జీవనశైలిని రీసెట్ చేసుకోవాలి.
గుర్తించుకోవాల్సిన విషయాలు
ఒక మహిళ త్వరగా లేదా సరైన సమయంలో గర్భం దాల్చాలనుకుంటే.. ఆమె తన పీరియడ్ సైకిల్ గురించి తెలుసుకోవాలి. దాని ప్రకారం శారీరక సంబంధం కలిగి ఉండాలి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, ఇతర ప్రినేటల్ విటమిన్లు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇవి మహిళల్లో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయి.
IVFకి వెళ్లొచ్చు
కొన్ని సందర్భాల్లో మహిళ అండాలలో లేదా ఫెలోపియన్ ట్యూబ్స్‌లో తీవ్రమైన సమస్యలు ఉంటే.. వైద్యులు IVFని సిఫార్సు చేస్తారు. ఈ ప్రాసెస్‌లో మహిళ అండం, పురుషుడి స్పెర్మ్‌ను శరీరం వెలుపల కలిపి పిండాన్ని తయారు చేస్తారు. తరువాత దానిని మహిళ గర్భాశయంలోకి అమరుస్తారు. అయితే ఈ ప్రక్రియ సహజ గర్భధారణకు భిన్నంగా ఉంటుంది.
గర్భం దాల్చడంలో ఇబ్బంది ఈ రోజుల్లో ఒక సాధారణ సమస్యగా మారింది. కానీ సకాలంలో సరైన సమాచారం, పరీక్షలు చేయించడం చికిత్స తీసుకోవడంతో దీనిని అధిగమించవచ్చు. దీని కోసం ప్రతి మహిళ, పురుషుడు ఇద్దరూ సమాన బాధ్యత తీసుకోవాలి. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వైద్యుల సహాయం తీసుకోవాలి.






















