Potato Milk: ‘ఆలు’తో పాలు, బంగాళా దుంపలను ఇలా కూడా వాడేయొచ్చా? పిచ్చి ముదిరితే ఇంతేనేమో!
ఆలు గడ్డల పాలు ఎప్పుడైనా తాగారా? అయితే, దీని గురించి మీరు తప్పకుండా తెలుసుకోవల్సిందే.
పాలు ఆరోగ్యానికి మంచివనే సంగతి మనకు తెలిసిందే. కానీ, భవిష్యత్తులో ఏ పాలు తాగితే మంచిదనే ప్రశ్నలు వెలువడే అవకాశాలు లేకపోలేదు. ఇన్నాళ్లు మనం రకరకాల పశువుల పాల గురించే మాట్లాడుకున్నాం. మేక నుంచి గాడిద వరకు అన్ని రకాల పాల గురించి తెలుసుకున్నాం. కానీ, ఇటీవల పశువులు ఇచ్చే పాలతో సంబంధం లేకుండా కొత్త రకం ‘పాలు’ వస్తున్నాయి. ఇందుకు కారణం.. పశువుల నుంచి పిండే పాలను తాగడాన్ని ఇప్పుడు కొందరు పాపంగా భావిస్తున్నారు. ఎందుకంటే.. ఇప్పుడు మన ప్రపంచంలో శాఖాహారులు, మాంసాహారులే కాదు.. ‘వేగన్’లు కూడా ఉన్నారు. వీరు కూడా శాఖాహారుల టైపే. కానీ, వీరు మాంసం మాత్రమే కాదు, పశువుల నుంచి వచ్చే ఏ ఉత్పత్తిని ముట్టరు. అందుకే వీరి కోసం సోయాబీన్ పాలను అందుబాటులోకి తెచ్చారు. కేవలం వీరు కాయగూరలు, ఆకుకూరలు మాత్రమే ఆరగిస్తారు. వీరిని ఇంప్రెస్ చేసేందుకు తాజాగా బంగాళా దుంపలతో సైతం పాలను తయారు చేయడం మొదలుపెట్టారు. దీన్ని ఎనర్జీ డ్రింక్ పేరుతో మార్కెట్లో కూడా అమ్మేస్తున్నారు.
బంగాళాదుంపతో తయారు చేసే కూర, వేపుళ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ రుచిగానే ఉంటాయి. కానీ, వాటితో పాలు తయారు చేస్తున్నారనే విషయమే కాస్త జీర్ణించుకోవడం కష్టమే. అయితే, అన్ని పాల తరహాలోనే బంగాళాదుంప పాలు కూడా చాలా టేస్టీగా ఉంటుందని, బోలెడన్ని పోషకాలు లభిస్తాయని తయారీ దారులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ పాలను ఇంట్లో కూడా తయారు చేసుకుని తాగేయొచ్చట.
ఇప్పుడు పాల తయారీ కోసం పెంచుతున్న మొక్కలు కంటే తక్కువ స్థలంలోనే ఆలు గడ్డలను పెంచవచ్చని చెబుతున్నారు. అంతేకాదు దీని తయారీ కూడా చాలా సులభమని, ఖర్చు కూడా తక్కువేనని చెబుతున్నారు. కాబట్టి.. భవిష్యత్తును శాసించేంది ఆలు పాలేనని అంటున్నారు. అయితే, పాలకు ఉండే ప్రత్యేకత పాలకు ఉంటుంది. ఈ ఆలు పాలు.. సహజమైన పాల తరహాలో పెరుగు కాలేవు. కేవలం తాగడానికి మాత్రమే ఉపయోగపడోంది. అందుకే, దీని తయారీ దారులు కూడా దీన్ని పాలకు ప్రత్యామ్నాయం అని చెప్పడం లేదు. దీన్ని ఎనర్జీ డ్రింక్‌గా మాత్రమే పేర్కొంటున్నారు. అయితే, ఇది పాల తరహాలో భలే క్రీమీగా ఉంటుందంటూ ఊరిస్తున్నారు.
ఇటీవలే యూకే మార్కెట్లోకి అడుగు పెట్టిన DUG (డ్యూగ్) అనే సంస్థ బంగాళ దుంపల పాలను కమర్షియల్ చేసింది. ఈ పాలను ప్రత్యేకంగా టెట్రా ప్యాకెట్లలో పెట్టి మరీ అమ్మేస్తోంది. ఈ ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. స్వీడన్‌కు చెందిన ఈ సంస్థ భవిష్యత్తులో ఈ సంస్థ చైనా, అమెరికా దేశాల్లో తమ బిజినెస్‌ను విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది.
ఈ పొటాటో మిల్క్‌ను మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బోలెడన్ని రెసిపీలు అందుబాటులో ఉన్నాయి. ముందుగా మీరు ఆలు గడ్డలను బాగా ఉడికించాలి. ఆ తర్వాత ఆ నీటిలోనే బాగా నుజ్జులా మారేవరకు కలపాలి. ఆ తర్వాత ఆ గుజ్జు వడపోయాలి. ఆ మిశ్రమంలో మరింత నీరు పోసి.. కాస్త పలచగా మార్చండి. ఆ తర్వాత అందులో కాస్త ఉప్పు వేసుకుని తాగేయండి. అయితే, DUG సంస్థ తయారు చేసే పొటాటో మిల్క్‌లో మాత్రం.. మాల్టోడెక్స్ట్రిన్, బఠానీ ప్రోటీన్, షికోరి ఫైబర్, రాప్‌సీడ్ ఆయిల్, ఫ్రక్టోజ్, సుక్రోజ్, ఎసిడిటీ రెగ్యులేటర్, కాల్షియం కార్బోనేట్, సన్‌ఫ్లవర్ లెసిథిన్ (ఎమల్సిఫైయర్), మరికొన్ని విటమిన్స్ కలుపుతారు. దానివల్ల అది శరీరానికి మాంచి ఎనర్జీ ఇస్తుందట. అందుకే, దాన్ని ఆ సంస్థ ఎనర్జీ డ్రింక్ అని చెబుతోంది. ఇది తాగితే శరీరానికి విటమిన్-డి, విటమిన్-బి12, కాల్షియం లభిస్తాయని ఆ సంస్థ చెబుతోంది. అయితే, ఈ పొటాటో మిల్క్ వల్ల శరీరానికి కలిగే మేలు గురించైతే ఏ పరిశోధకులు ఇప్పటివరకు చెప్పలేదు. కాబట్టి.. ఇలాంటివి తీసుకొనే ముందు వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం.