(Source: ECI | ABP NEWS)
Planetary Health Diet : ప్లానెటరీ హెల్తీ డైట్తో ఆరోగ్యానికి, పర్యావరణానికి కలిగే లాభాలివే.. మాంసాహారం తగ్గించకపోతే జరిగే నష్టం అదే
Climate Friendly Food Habits : ప్రపంచవ్యాప్తంగా మొక్కల ఆధారిత ఆహారం తీసుకుంటే రోజుకు 40,000 మరణాలు ఆపవచ్చని చెప్తోంది తాజా నివేదిక. మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు దానిలో మెన్షన్ చేశారు. అవేంటంటే..

Planetary Healthy Diet : ప్రపంచవ్యాప్తంగా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యం, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే ఓ కొత్త, ఆశ్చర్యకరమైన నివేదిక వెలుగులోకి వచ్చింది. దానిలో ప్రధానంగా ఓ అంశం హైలెట్ అయింది. అదేంటంటే.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మొక్కల ఆధారితమైన ప్లానెటరీ హెల్తీ డైట్ తీసుకుంటే.. ప్రతిరోజూ దాదాపు 40,000 మంది ప్రజలను అకాల మరణాల నుంచి తప్పించవచ్చని నివేదికలో పేర్కొన్నారు. అంటే మాంసాహార ఆహారాన్ని పరిమితం చేయాలనే అంశాన్ని ఇది హైలెట్ చేస్తుంది. ఇది ఆరోగ్యంతో పాటు, పర్యావరణ పరిరక్షణపై మంచి ప్రభావం ఇస్తుందట.
ఈ నివేదిక ప్రకారం.. ప్రజలు ప్లానెటరీ హెల్తీ డైట్ (Plant-Based Diet Benefits) తీసుకుంటే 2050 నాటికి.. ఆహార వ్యవస్థ వల్ల కలిగే వాతావరణ నష్టాన్ని సగానికి తగ్గించవచ్చట. అంతేకాకుండా ఆహార ఉత్పత్తి వల్ల వన్యప్రాణులు అడవుల విధ్వంసానికి అతిపెద్ద కారణం అవుతున్నాయట. అలాగే నీరు కూడా ఎక్కువగా కలుషితం అవుతుందట. అందుకే ప్లానెటరీ డైట్పై అవగాహన కల్పించేలా చేస్తుంది ఈ తాజా నివేదిక.
ప్లానెటరీ హెల్త్ డైట్ అంటే ఏమిటి?
ప్లానెటరీ హెల్త్ డైట్ ప్రధానంగా కూరగాయలు, పండ్లు, గింజలు, పప్పులు, తృణధాన్యాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ నివేదిక ప్రకారం.. ప్లానెటరీ హెల్తీ డైట్లో భాగంగా మాంసం, గుడ్లు లేదా పాలు వంటి కొన్ని జంతువుల ఉత్పత్తులను కూడా చేర్చుకోవచ్చు. ఆరోగ్యకరమైన, రుచికరమైన, అనేక రకాల ఆహారాలను తీసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఈ ఆహారాలు ఆరోగ్యానికి, పర్యావరణానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయని చెప్తున్నారు.
ఎక్కువ మాంసాహారం ప్రమాదమా?
ఈ నివేదికలో ఎక్కువ మొత్తంలో మాంసాహార ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరమని తేలింది. అదే సమయంలో అమెరికా, కెనడాలో ప్రజలు ప్లానెటరీ హెల్త్ డైట్ సిఫారసు చేసిన దానికంటే ఏడు రెట్లు ఎక్కువ రెడ్ మీట్ తింటారని నివేదిక పేర్కొంది. యూరప్, లాటిన్ అమెరికాలో ఇది ఐదు రెట్లు ఉండగా.. చైనాలో ఇది నాలుగు రెట్లు ఎక్కువ ఉందట. అదేవిధంగా ఆఫ్రికా వంటి కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఎక్కువగా పిండి పదార్థాలు కలిగిన ఆహారం తీసుకుంటున్నారట. ఈ పరిస్థితుల్లో చికెన్, పాల ఉత్పత్తులు, గుడ్లు తీసుకోవడం వారికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు.
ప్రపంచంలోని ధనవంతులు తమ ఆహార ఉత్పత్తి వల్ల పర్యావరణ నష్టంలో ఎక్కువ భాగాన్ని ఉత్పత్తి చేస్తున్నారని కూడా నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన 30 శాతం మంది వారు ఫాలో అయ్యే ఆహార వ్యవస్థ వల్ల పర్యావరణ నష్టంలో 70 శాతం కంటే ఎక్కువ భాగాన్ని ఉత్పత్తి చేస్తున్నారట. అదే సమయంలో 2.8 బిలియన్ల మంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవట్లేదట. 1 బిలియన్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారట. దీనితో పాటు దాదాపు 1 బిలియన్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారని నివేదిక చెప్తోంది.
ప్లానెటరీ హెల్త్ డైట్ వల్ల కలిగే ప్రయోజనాలు
ఆరోగ్యంకానీ ఆహారం ఎక్కువ ధరతోనూ.. ఆరోగ్యకరమైన ఆహారం చౌకగాను ఉండాలని నివేదిక సూచించింది. అదే సమయంలో, అనారోగ్యకరమైన ఆహారానికి సంబంధించిన ప్రకటనలను నియంత్రించాలని.. అలాగే వాటిపై హెచ్చరిక లేబుల్స్ కూడా ఉంచాలని సూచించింది. దీనితో పాటు వ్యవసాయ సబ్సిడీలను ఆరోగ్యకరమైన, స్థిరమైన ఆహారం వైపు మళ్లించాలని సూచించింది. ఇలా చేయడం వల్ల ప్రజలకు పోషకమైన ఆహారం సులభంగా అందుతుందని తెలిపింది.
ప్లానెటరీ హెల్త్ డైట్ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు, స్ట్రోక్, మధుమేహం, క్యాన్సర్, న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ డైట్ తీసుకోవడం ద్వారా ఏటా 15 మిలియన్ల మంది అకాల మరణాలను నివారించవచ్చని చెప్తున్నారు. అదే సమయంలో ఆహారాన్ని మార్చడంతో పాటు.. ఆహార వ్యర్థాలను తగ్గిస్తే.. పర్యావరణానికి మేలు జరుగుతుందని చెప్తున్నారు.






















