Potato Chips: చిప్స్ అధికంగా తినేవారిలో సంతాన సమస్యలు
చిప్స్‌ని పిల్లలే కాదు, పెద్ద వాళ్లు కూడా ఇష్టంగా తింటారు. కానీ వాటిని అధికంగా తింటే మాత్రం సమస్యలు తప్పవు.
బంగాళాదుంప చిప్స్ ఇప్పుడు పిల్లల హాట్ ఫేవరేట్. పిల్లలే కాదు యువత కూడా తెగ తింటున్నారు ఈ స్నాక్స్‌ని. ఎన్ని రోజులైనా పాడవ్వకపోవడం వీటి స్పెషాలిటీ. అందుకే ప్యాకెట్లకు ప్యాకెట్లు కొని ఇంట్లో పెట్టేసుకుంటారు. కానీ వీటిని రోజూ తినేవారిలో దీర్ఘకాలికంగా కొన్ని ఆరోగ్య సమస్యలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నాయి అధ్యయనాలు.
బీపీ పెరుగుతుంది
రోజూ చిప్స్ తినేవారిలో బీపీ వచ్చే అవకాశం అధికం. చిప్స్ ఎక్కువ కాలం పాడవ్వకుండా ఉంచేందుకు ఉప్పును అధికంగా కలుపుతారు. క్రిస్పీగా ఉంచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అమెరికాకు చెందిన మాయో క్లినిక్ ప్రకారం ఈ చిప్స్ నిశ్శబ్ధంగా రక్తపోటును పెంచుతాయి. గుండె సంబంధ వ్యాధులను, స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని కూడా రెట్టింపు చేస్తాయి. దీర్ఘకాలంలో మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. చిత్తవైకల్యం వచ్చే అవకాశం ఉంది. బాగా ప్రాసెస్ చేసిన ఆహారం కిందకి వస్తుంది చిప్స్, కాబట్టి అధిక మొత్తంలో లవణాలు ఉంటాయి. దీనివల్ల శరీరంలో సోడియం స్థాయిలు స్థిరంగా ఉండవు.
క్యాన్సర్
చిప్స్ అధికంగా తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అమెరికన్ క్యాన్సర్ అసోసియేషన్ ప్రకారం చిప్స్ వంటి అతిగా శుద్ది చేసిన ఆహారంలో అక్రిలమైడ్ అనే కార్సినెజెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇది సైలెంట్‌గా క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. కాబట్టి చిప్స్ తినడం చాలా వరకు తగ్గించుకోవాలి.
గుండె పై ప్రభావం
చిప్స్‌లో శాచురేటెడ్ కొవ్వులు, సోడియం, క్యాన్సర్ కారకాలు అధికంగా నిండి ఉంటాయి. ఇవి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం ఇందులో ఉండే అక్రిలమైడ్లు గుండె సంబంధిత వ్యాధులతో పాటూ స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెంచుతాయి.
సంతాన సమస్యలు
చిప్స్ అధికంగా తినేవారిలో టీనేజీ పిల్లలు, యువత అధిక సంఖ్యలో ఉన్నారు. చిప్స్‌లో ఉండే కొన్ని రకాల కొవ్వులు పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భం దాల్చడం కష్టమైపోతుంది. చిప్స్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల మహిళల్లో సంతాన లేమి సమస్య రావచ్చు. కాబట్టి చిప్స్‌ను పూర్తిగా మానివేయడం ఉత్తమం.
మానసిక సమస్యలు
చిప్స్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. వాటివల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం పెరుగుతుంది. చిప్స్ నిశ్శబ్ధంగా మీ మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. కోపం త్వరగా రావడం, యాంగ్జయిటీ వంటి సమస్యలను పెంచుతుంది.
Also read: పిల్లలకు నచ్చేలా ఎగ్ పరాటా, చేయడం చాలా సులువు
Also read: సిగరెట్లు మానకపోతే చూపు పోయే ప్రమాదం, కళ్లను కాపాడుకోండిలా