Papaya: బొప్పాయి తింటే గర్భస్రావం నిజమేనా? గర్భిణీలు ఆ పండును ఎంత మోతాదులో తినాలి?
ఎన్నో పోషకాలు అందించే బొప్పాయిని గర్భిణీలు తినకూడదని ఎందుకు చెప్తారు? అందులో నిజమెంత?
సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో దొరుకుతుంది బొప్పాయి. దీన్ని తినడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయి. గర్భధారణ సమయంలో పోషకాహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఏది తినకూడదు? అనే వాటి మీద చాలా అపోహలు ఉన్నాయి. అందుకే అన్ని రకాల పండ్లు తీసుకోమని చెప్తారు. కానీ బొప్పాయి మాత్రం తినొద్దని పెద్దలు చెబుతారు. అది తినడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అం టుంటారు. అయితే బొప్పాయి తింటే నిజంగానే గర్భస్రావం అవుతుందా? వైద్య నిపుణులు ఏమని చెప్తున్నారు.
పచ్చి బొప్పాయి కంటే పండు బొప్పాయి మేలు
బొప్పాయిలో సమృద్ధిగా పోషకాలు, ఖనిజాలు, విటమిన్స్, నీరు ఉన్నాయి. కానీ పచ్చి లేదా పండు బొప్పాయిలో రబ్బరు పాలు, పాపిన్ అనే రసాయన పదార్థాలు ఉంటాయి. గర్భం ధరించిన వాళ్ళు పచ్చి బొప్పాయి తీసుకుంటే అది శిశువు చుట్టూ ఉన్న పొరలను బలహీన పరుస్తుంది. దాని వల్ల గర్భస్రావం జరగడం నెలలు నిండకుండానే ప్రసవించడం వంటి ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందుకే గర్భధారణ సమయంలో పచ్చి బొప్పాయిని నివారించడమే ఉత్తమం.
ఇందులో ఉండే రబ్బరు పాల వల్ల అలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంది. అప్పుడప్పుడు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉందని మరో పోషకారహార నిపుణురాలు హెచ్చరిస్తున్నారు. పండిన బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. గర్భధారణ సమయంలో అవసరమైన పోషకాలను అందిస్తుంది. పచ్చి బొప్పాయిలో అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల గర్భాశయంపై ఒత్తిడి పడి గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని ఆమె చెప్పుకొచ్చారు. పండిన బొప్పాయిలో ఫోలేట్, ఫైబర్, కొలిన్, విటమిన్స్ ఎ, బి, సి ఉంటాయి. ఇందులో ఉండే బీటా కెరొటిన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్స్ గర్భిణీలకు చాలా అవసరం. అయితే ముందస్తు జాగ్రత్తగా మొదటి మూడు నెలలు పండిన బొప్పాయి కూడా తీసుకోకపోవడం ఉత్తమమని అంటున్నారు.
పండిన బొప్పాయి ప్రయోజనాలు
పండిన బొప్పాయిలో పొటాషియం ఉంటుంది. ఇది శిశువు నరాల అభివృద్ధికి సహాయపడుతుంది. జీర్ణక్రియని మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణగా నిలుస్తుంది. గర్భధారణ సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడేందుకు సహాయపడి ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచేందుకు సహకరిస్తుంది. తల్లికి పాల ఉత్పత్తిని కూడా పెంచేందుకు దోహదపడుతుంది. పండిన బొప్పాయి తినడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ నుంచి కూడా బయటపడొచ్చు.
ఎంత మోతాదులో తీసుకోవాలి?
గర్భిణీ స్త్రీలు పండిన బొప్పాయిని ఒక కప్పు(100 గ్రాములు) వారానికి రెండు లేదా మూడు సార్లు తినొచ్చు. కానీ నిద్రవేళకి ముందు మాత్రం తీసుకోకూడదు దాని వల్ల అజీర్ణ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. పండిన బొప్పయిని డెలివరీ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్స్, ఖనిజాలు పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రోత్సహిస్తాయి.
Also read: పండంటి బిడ్డ కోసం ప్రెగ్నెన్సీకి ముందు కచ్చితంగా చేయించుకోవాల్సిన టెస్టులు ఇవే