Panduru Mango: ఇందిరకు ఇష్టమైన "పండూరు వారి మామిడి"; గోదావరి తీర ప్రాంతాల్లో పెరిగే అరుదైన రకం
Panduru Mango:ఇందిరా గాంధి కి ఇష్టమైన గోదావరి జిల్లాల మామిడి "పండూరు వారి మామిడి" పండు. కేవలం రాజులు, జమీందార్ల ఇళ్లల్లో మాత్రమే పండుతుంది.

Panduru Mango: మామిడిపండును ఇష్టపడని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. భారతదేశపు జాతీయ పండు అది. ప్రపంచవ్యాప్తంగా 1500పైగా వెరైటీలతో మామిడి పండ్ల సాగు జరుగుతోంది. అయితే వీటిలో కొన్ని రకాలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతాయి. అలాంటి వాటిలో ఒకటి "పండూరు వారి మామిడి ". సాధారణంగా "పండూరి మామిడి" అని పిలుచుకునే ఈ రకం మామిడిపండు అత్యంత తీయనైన మాంగోస్ లో ఒకటి అంటారు. గోదావరి జిల్లాలకు ప్రత్యేకమైన ఈ పండు ఇప్పుడు ప్రాంతాల్లోనూ పాపులర్ అవుతోంది.
జమీందార్ల ఇళ్లలో పెరిగిన పండు ఇది
పండూరి మామిడి ఎక్కడ పుట్టింది అనేది చెప్పలేం కానీ ప్రస్తుత ఖమ్మం, వరంగల్ లాంటి తెలంగాణ ప్రాంతాల్లో గోదావరి నది పరిసరాల్లో పుట్టి అక్కడ నుంచి గోదావరి జిల్లాల ప్రాంతాలకు పాకిందని చెబుతారు. పూర్వకాలంలో ఈ రకం చెట్లను కేవలం జమీందారులు రాజులు మాత్రమే వారి తోటల్లో పెంచేవారట. సామాన్యులకు ఈ రకం మొక్కను దొరకనిచ్చే వారు కాదు. అందుకే కొన్నేళ్ల వరకు ఈ పండు గురించి బయట వారికి పెద్దగా తెలిసేది కాదు. స్వతంత్రం వచ్చాక ఈ పండు గోదావరి జిల్లాల్లో పాపులర్ కావడం మొదలు పెట్టింది. ఉండ్రాజవరం తణుకు ప్రాంతాల రైతులు, రాజకీయ నాయకుల ద్వారా దీని గురించి ఇందిరాగాంధీకి తెలియడంతో చాలా ఇష్టంగా ఈ పండ్లు ప్రతి సీజన్లోనూ ఢిల్లీకి తెప్పించుకునేవాళ్లు. ఉండ్రాజవరంలోని రైతులు చెబుతున్నారు. తర్వాత కాలంలో ఎక్కువ కాలం నిలువ ఉండే 'బంగినపల్లి', మార్కెటింగ్ పరంగా పాపులర్ అయిన 'రసాలు'కు ఎక్కువగా ప్రాచుర్యం లభించడంతో 'పండూరి మామిడి' గురించి పెద్దగా బయట వాళ్ళకు తెలిసేది కాదు . కానీ ఈమధ్య ఈ రకం మామిడిపండు టేస్ట్ గురించి బయట వాళ్లకి తెలియడం, గోదావరి జిల్లాల నుంచి ఉద్యోగాలు చదువుల రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళ ద్వారా "పండూరి మామిడి" పాపులర్ కావడంతో ఇతర ప్రాంతాల్లోనూ ఈ రకం మామిడిపండును సాగు చేస్తున్నారు.

"పండూరి మామిడి " ప్రత్యేక ఏమిటి?
మామిడి పండు తీపిని 'బ్రిక్స్' లో కొలుస్తారు. బాగా పండిన బంగినపల్లి మామిడిపండు తీపి 22-25 మధ్యలో ఉంటుంది. పండూరు మామిడి తీపి ఏకంగా 30పైనే ఉంటుంది. అత్యంత తీయగా ఉండే ఈ రకం మామిడి చూడడానికి చిన్నగా ఉంటుంది. చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా కాసే పండూరి మామిడి బయట నుంచి చూస్తే ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. కానీ కోస్తే లోపల గోల్డెన్ ఎల్లో రంగులో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. లోపల జ్యూస్ రంగు పరంగా ఒక్క 'కేసరి 'రకం మామిడి మాత్రమే దీనికంటే ఎక్కువ ఆరంజ్ కలర్ లో ఉంటుంది. పండూరి మామిడి కాయ బయట మార్కెట్ లో దొరకడం కష్టం. చిన్నగా ఉంటే ఒక్క కాయ 40 రూపాయల వరకు పలుకుతుంది. కేజీ 200 వరకు అమ్ముతున్నారు. చాలావరకు పళ్ళు తోట వద్దనే అమ్ముడైపోతాయి. కానీ కచ్చితంగా ఒక్కసారైనా రుచి చూడాల్సిన మామిడి ఇది. అయితే తీపి మోతాదు మరీ ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ వంటి సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండడం మంచిది.























