కాలర్ బోన్‌లో నొప్పి ప్రాణాలకు ప్రమాదమా?
కాలర్ బోన్ నొప్పి గా ఉన్న వారిలో కడుపులో అల్సర్ ఉండే ఆస్కారం ఉందని పరిశోధనలు తెలుపుతున్నాయి. అదెలా అనుకుంటున్నారా? ఇదిగో ఇలా...
కొంచెం నమ్మశక్యంగా లేకున్నా కాలరో బోన్ నొప్పిగా ఉంటే మీ కడుపులో సమస్య ఉందని అర్థం. కాలర్ బోన్ సన్నగా పొడవుగా ఉండే ఎముక. ఛాతికి పైన, మెడకు దిగువన ఉంటుంది. ఛాతి ఎముకకు అనుసంధానంగా ఉంటూ భుజానికి కలిపి ఉంటుంది.
భుజం, కాలర్ బోన్ నొప్పిగా అనిపిస్తోందంటే అది కడుపులో బినైన్ అల్సర్ వల్ల కావచ్చని వర్జీనియా మెడికల్ సెంటర్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇదే విషయం గురించి అధ్యయనం చేసిన మరో రీసెర్చ్ టీమ్ కూడా అదే చెప్పింది. తాము చూసిన ఒక గ్యాస్ట్రిక్ అల్సర్ పేషెంట్ చాలా రోజుల నుంచి భుజం నొప్పితో బాధపడుతున్నాడని వెల్లడించింది.
కడుపులో అల్సర్ ఉన్నపుడు సాధారణంగా పొట్ట మధ్యలో మంట లేదా నొప్పి వస్తుంది. ఇది మాత్రమే కాకుండా మరి కొన్ని లక్షణాలు కూడా ఉండొచ్చు
- అజీర్తి
- గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్
- ఆకలి లేకపోవడం
- కడుపులో తిప్పుతున్న భావన, వికారం
- బరువు తగ్గిపోవడం
కొవ్వు ఎక్కవగా కలిగిన హెవీ ఫూడ్ తీసుకున్నపుడు కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కడుపులో అల్సర్ అంత సామాన్యమైన సమస్య కాదు. ఇవి ఒక్కోసారి తీవ్రంగా ఉండి ప్రాణాంతకం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్సర్ ఉన్న భాగం నుంచి రక్త స్రావం జరగడం, అల్సర్ ఉన్న చోట జీర్ణ వ్యవస్థ లోపలి లైనింగ్ చెదిరిపోయి తెరచుకోవడం వంటి సమస్యలు కూడా రావచ్చు. చాలా సార్లు జీర్ణవ్యవస్థలో ఏర్పడిన అల్సర్ ఆహార కదలికలను అడ్డుకుంటుంది. మల విసర్జనలో జిగటగా లేదా ముదురు రంగులో ఉండడం, షార్ప్ గా నొప్పి రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరం. రక్తపు వాంతులు అవుతుంటే మాత్ర వెంటనే పరీక్షలు చేయించుకోవల్సిన అత్యవసర పరిస్థితి ఉందని గుర్తించాలి.
కాలర్ బోన్ నొప్పికి ఇంకా చాలా కారణాలున్నాయి
అకారణంగా కాలర్ బోన్ నొప్పి వస్తే కడుపులో అల్సర్ అని అనుమానించాలి. కానీ కాలర్ బోన్ నొప్పి కి చాలా ఇతర కారణాలు కూడా ఉంటాయి.
- పడుకునే భంగిమ సరిగా లేనపుడు కాలర్ బోన్ మీద భుజం మీద ఒత్తిడి పెరిగినొప్పి రావచ్చు
- గుండె చుట్టు ఆవరించి ఉండే ఒక సన్నని పొరను పెరీకార్డియం అంటారు. ఇది గుండె పనితీరు మెరుగ్గా ఉండేందుకు అవసరం. ఈ పొరలో వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా కాలర్ బోన్ లో నొప్పి రావచ్చు.
- కదిలించేందుకు ప్రయత్నించినపుడు కాలర్ బోన్ లో నొప్పి వస్తుంటే అది అంతకంతకూ పెరుగుతూ పోతే కాలర్ బోన్ లో పగుళ్ల వల్ల కావచ్చు. నొప్పి తోపాటు వాపు, కదిలించడంలో ఇబ్బంది ఉంటుంది.
- కాలర్ బోన్ సాధారణంగా ఉండే చోటు నుంచి కాస్త కదిలినా కూడా పరిసరాల్లోని రక్తనాళాల మీద ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది. ఇలాంటి సందర్బాల్లో నొప్పి కాలర్ బోన్ లో మొదలై అది చేతికి వ్యాపిస్తుంది.
- కాలర్ బోన్ భుజం కలిసే చోట ఉండే కీలును అక్రోమియో క్లావిక్యులార్ జాయింట్ అంటారు. ఇది గాయపడినపుడు కూడా నొప్పి వస్తుంది.
- అన్ని కీళ్లు, ఎముకల్లో వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కూడా కాలర్ బోన్ నొప్పి రావచ్చు.
- చాలా అరుదుగా న్యూరోబ్లాస్టోమా అనే క్యాన్సర్ వల్ల కూడా నొప్పి రావచ్చు. ఇది పిల్లల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్.
- చాలా అరుదుగా ఎముకల్లో కనిపించే ఇన్ఫెక్షన్ ఆస్టియోమైలైటిస్. దీని వల్ల కూడా కాలర్ బోన్ లో నొప్పి రావచ్చు. ఈ సమస్య ఎక్కువగా పొడవైన ఎముకల్లోనే వస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.