Carrot Walnut Burfi : న్యూ ఇయర్ కోసం క్యారెట్ వాల్నట్ బర్ఫీ.. ఇంట్లోనే సింపుల్‌గా చేసేయొచ్చు
Carrot Walnut Burfi Recipe : క్యారెట్ హల్వా తిని ఉంటారు.. కాజు బర్ఫీ తిని ఉంటారు. కానీ క్యారెట్ బర్ఫీని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే మరొక్కసారి తినకుండా ఉండగలుగుతారా?
New Year Special Sweet Recipe : న్యూ ఇయర్ సమయంలో లేదా పండుగల సమయంలో మీరు టేస్టీ స్వీట్స్ ట్రై చేయాలనుకుంటే మీరు ఇంట్లోనే టేస్టీ టేస్టీ క్యారెట్ వాల్నట్ బర్ఫీ చేసేయొచ్చు. పైగా ఇంట్లోనే తయారు చేసుకునే స్వీట్లకు డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. మీ క్రేజ్కూడా బంధువుల్లో కాస్త పెరుగుతుంది. అయితే దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
క్యారెట్లు - 500 గ్రాములు
పాలు - 1 కప్పు
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
కుంకుమ పువ్వు - కొంచెం
వాల్నట్స్ - ముప్పావు కప్పు
పాల పొడి - పావు కప్పు
ఏలకులు - 4
ఎండు కొబ్బరి - 2 టేబుల్ స్పూన్స్
పంచదార - పావు కప్పు
వాల్నట్స్ - పావు కప్పు (గార్నిష్ కోసం తరిగిపెట్టుకోవాలి)
తయారీ విధానం..
ముందుగా క్యారెట్లను బాగా కడిగి వాటిపై తొక్కను తీసేయండి. అనంతరం వాటిని ముక్కలుగా కట్ చేయండి. ఇప్పుడు వాటిని ఓ గిన్నెలోకి తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్స్ క్రీమ్ మిల్క్‌లో ఉడకబెట్టండి. దీనిలో అంతకుమించి పాలు వేయకండి. ఇప్పుడు మీరు వాటిని మెత్తగా తురుముకోవచ్చు. ఇప్పుడు 8x8 కేక్ టిన్ను బటర్ పేపర్‌తో కవర్ చేయండి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై మందపాటి అడుగున కడాయి లేదా పాన్ పెట్టండి. దానిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. అది వేడి అయ్యాక క్యారెట్ తురుము వేసి.. బాగా కలపండి. క్యారెట్ తేమను కోల్పోయే వరకు మూతపెట్టి.. మీడియం మంట మీద ఉడికించండి. ఇప్పుడు దానిలో మిగిలిన పాలు, కుంకుమపువ్వు వేసి బాగా కలపండి. పాలు మొత్తాన్ని క్యారెట్లు పీల్చుకునేవరకు మూతపెట్టి తక్కువ మంటపై ఉడికించండి.
క్యారెట్ ఉడుకుతున్నప్పుడు వాల్నట్స్, పాలపొడి, యాలకులు, కొబ్బరి పొడిని కలిపి మిక్సీ చేయండి. క్యారెట్ పాలు పీల్చుకున్న తర్వాత క్యారెట్లు నీటిని వదిలేయకుండా చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర నీరంతా ఆరిపోయే వరకు తక్కవ మీడియం మంట మీద ఉడికించాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న వాల్నట్ పొడి మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యివేసి.. మిశ్రమం కలిసి చిక్కబడే వరకు మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా దానిలో తరిగిన వాల్నట్లను వేసి బాగా కలపాలి.
రెడీ అయిన క్యారెట్ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కేక్ టిన్‌లో వేయాలి. దానిని సమానంగా పరచాలి. దానిని రెండు నుంచి మూడు గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి. అనంతరం దానిని తీసి బర్ఫీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. గార్నిష్ చేసి దీనిని హాయిగా లాగించేయవచ్చు. మీ పిల్లలు క్యారెట్స్ తినట్లేదు.. బయట ఫుడ్ వద్దు అనుకున్నప్పుడు ఇంటిల్లీపాదికి మీరు వీటిని స్వయంగా చేసి తినిపించవచ్చు. కాస్త ఓపిక ఉంటే చాలు.. టేస్టీ టేస్టీ స్వీట్‌ని మీరు తయారు చేయగలుగుతారు.
Also Read : టేస్టీ టేస్టీ గులాబ్ ఖీర్.. ఇది పూర్తిగా షుగర్ ఫ్రీ రెసిపీ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.