Nani: శరీరాన్ని టార్చర్ చేయకూడదు - నాని ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనట
Nani Fitness: నేచురల్ స్టార్ నాని ఎక్కువగా జిమ్‌లకు వెళ్లడం, వర్కవుట్స్ చేయడం, వెయిట్ లిఫ్టింగ్ చేయడం ప్రేక్షకులు ఎప్పుడూ చూడలేదు. అయినా తను ఫిట్‌గా ఉండడానికి కారణమేంటో తాజాగా బయటపెట్టాడు.
Hi Nanna : ఈరోజుల్లో సినిమా బాగుందని హీరోలే ముందుకొచ్చి ప్రేక్షకులకు చెప్పాలి. ప్రమోషన్స్‌లో పాల్గొనాలి. అప్పుడే ప్రేక్షకుల్లో సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది. అందుకే నేచురల్ స్టార్ నాని కూడా తన సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎప్పుడూ యాక్టివ్ ఉంటాడు. ఇక తాజాగా తన అప్‌కమింగ్ మూవీ ‘హాయ్ నాన్న’ను ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లడానికి నాని కష్టపడుతున్నాడు. వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీగా ఉంటున్నాడు. ఇక తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో నాని.. తన ఫిట్‌నెస్ గురించి, డైటింగ్ ప్లాన్స్ గురించి బయటపెట్టాడు. అసలు నాని అంత ఫిట్‌గా ఎలా ఉంటాడు అని ఆశ్చర్యపోయేవారికి సమాధానమిచ్చాడు.
కేవలం కార్డియో..
‘హాయ్ నాన్న’లో తన పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు అని నాని అడగగా.. కొంచెం బరువు తగ్గాను అని చెప్పాడు. అయితే తను ఎక్కువగా జిమ్ చేయడం, బరువులు ఎత్తడంలాంటివి ఎప్పుడూ ప్రేక్షకులు చూడలేదని, ఫిట్‌గా ఉండడానికి ఏం చేస్తుంటారు అని తనకు ప్రశ్న ఎదురయ్యింది. దానికి సమాధానంగా కార్డియో వల్లే ఫిట్‌గా ఉన్నానని సింపుల్‌గా చెప్పేశాడు నాని. శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండడానికి ఏం చేస్తుంటారు అని అడగగా.. ‘‘నేను ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాను. అది చాలా ముఖ్యం. ఇంట్లోనే ఉంటూ.. లేవకుండా, పనిచేయకుండా ఉంటే అది కచ్చితంగా బరువు పెరగడానికి కారణమవుతుంది’’ అని తన వర్క్ వల్లే ఫిట్‌గా ఉన్నానని బయటపెట్టాడు నాని.
అదే సెట్ అవుతుంది..
‘‘నేను ఏదైనా తినేస్తాను. నేను అంత స్టేట్‌మెంట్ ఇచ్చేంత ప్రొఫెషనల్ కాదు. కానీ నాకు తెలిసినవాళ్లలో నేను చూసింది ఏంటంటే తగ్గాలని, ఆ డైట్ అని, ఈ డైట్ అని, అది తినడం మానేసి, ఇది తినడం మానేసిన వాళ్లు కొంతకాలం తర్వాత బరువు పెరిగిపోతారు. ఎందుకంటే శరీరాన్ని వాళ్లు టార్చర్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి మనం ఏం తింటామో దానికే మన శరీరం సెట్ అవుతుంది. ఎవరైనా వచ్చి మీరు అది తింటారా మంచిది కాదు అంటే అది వాళ్లకి మంచిది కాదేమో. మన చిన్నప్పటి నుంచి మనం ఏదైతే తినడానికి అలవాటు పడతామో అదే మనకు మంచిది. చిన్నప్పటి నుంచి ఇడ్లీ, నెయ్యి లాంటివి తినడం ఇష్టమయితే అది అలాగే ఉండాలి. మన బాడీని మనం ఒకలాంటి ఫుడ్‌తో ట్రెయిన్ చేసుంటాం’’ అంటూ తన తినే అలవాట్ల గురించి చెప్పుకొచ్చాడు నాని.
కంట్రోల్‌లో ఉంటే చాలు..
‘‘ఇంట్లో అమ్మ వండే పిండివంటలు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటే తినొచ్చు. అలా అని ఏదీ అమితంగా తినకూడదు. ఇన్నిరోజులు ఇంట్లో భోజనం చేసి ఒకేరోజు సడెన్‌గా సాలడ్ అంటే బాడీ తట్టుకోలేదు. బాడీ రెడీగా ఉండదు కూడా. ఇది నాకు అర్థమయ్యింది. ఒకవేళ ఎవరైనా తప్పుగా తీసుకుంటే సారీ. ఏదైనా, ఏమైనా తినొచ్చు కానీ కంట్రోల్‌లో ఉంటే చాలు’’ అంటూ సలహా ఇచ్చాడు నాని. ఇక నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హాయ్ నాన్న’ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో నానికి జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా.. చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రను కియారా పోషించింది. ఇప్పటికే ఈ మూవీ మీద మేకర్స్ అంతా కాన్ఫిడెంట్‌గా ఉండగా.. విడుదలయిన టీజర్, ట్రైలర్స్ చూస్తుంటే ఇది ఒక ఫీల్ గుడ్ చిత్రమని తెలుస్తోంది.
Also Read: మీనాక్షీ చౌదరి, ఊర్వశి రౌటేలా - బాలకృష్ణతో గ్లామర్ గాళ్స్ ఇద్దరూ...