Relationships: నా భార్య నా తల్లిదండ్రుల ముందు అలా ప్రవర్తిస్తోంది, వారు లేనప్పుడు మరోలా ఉంటోంది, ఆమెను మార్చడం ఎలా?
తన తల్లిదండ్రులను తనకు దూరం చేసిన భార్యను మార్చుకోవడం ఎలా అని అడుగుతున్నా ఒక భర్త ఆవేదన ఇది.
ప్రశ్న: మా పెళ్లిని మా తల్లిదండ్రులే దగ్గరుండి చేశారు. కానీ నా భార్యకు మొదటి నుంచి నా తల్లిదండ్రులతో కలిసి జీవించడం ఇష్టం ఉండేది కాదు. గొడవలు అవుతున్న కారణంగా మేము విడిగా ఉంటున్నాము. కానీ నా తల్లిదండ్రులు పాత, చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. మేము పెద్ద ఇంట్లో నివసిస్తున్నాము. వారు అలా చిన్న ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. వారిని నాతో పాటు ఉంచుకోవాలని నా ఆశ. కానీ నా భార్య అందుకు సహకరించడం లేదు. నా తల్లిదండ్రులు అప్పుడప్పుడు ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు ఆమె మంచి కోడలు, పరిపూర్ణమైన కోడలులాగా నటిస్తోంది. వారు లేనప్పుడు వారి గురించి చాలా అసహ్యంగా తిడుతుంది. నాకు ఇది ఏ మాత్రం నచ్చడం లేదు. ఆమెను మార్చి నా తల్లిదండ్రులను ఇంటికి తెచ్చుకోవడం ఎలా?
జవాబు: ఎన్నో కుటుంబాలలో కనిపిస్తున్న సమస్యల్లో ఇది ప్రధానమైనది. మన దేశం ఒక సాంప్రదాయ సమాజం. పాశ్చాత్య సంస్కృతిలో పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉండరు. కానీ మన దేశంలో తల్లిదండ్రులతో కలిసి కొడుకు జీవించాల్సిన పద్ధతి ఉంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు చెప్పింది. తల్లిదండ్రులని పట్టించుకోని కొడుకు కోడళ్లకు శిక్షలు వేసిన సందర్భాలూ ఉన్నాయి. చదువుకున్న మీ భార్య ఆ మాత్రం ఎందుకు అర్థం చేసుకోవడం లేదో తెలియడం లేదు. తల్లిదండ్రులు, భార్య మధ్య నలిగిపోతున్న వ్యక్తిగా మీ కష్టం, బాధ అర్థం అవుతోంది. మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని పెద్ద చదువులు చదివించారు. ఇప్పుడు మీకు లభించిన ఉన్నత జీవితం వారు పెట్టిన భిక్ష. ఆ విషయాన్ని మీ భార్యకు చెప్పండి. ఆమె మీ తల్లిదండ్రులు లేనప్పుడు వారిని తిట్టడం, వెక్కిరించడం అనేవి మంచి పద్ధతి కాదని, మీ పిల్లలు కూడా పెద్దయ్యాక అలాగే చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించండి.
కొడుకుగా మీకు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. మీ పిల్లల్ని, భార్యని ఎంత శ్రద్ధగా చూసుకుంటారో వారిని కూడా అంతే శ్రద్ధగా చూడాలని చట్టం చెబుతోంది. వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి కఠిన శిక్షలు విధిస్తారో ఆమెకు చెప్పండి. మీ తల్లిదండ్రులు మంచివారు కనుక ఏమీ మాట్లాడకుండా ఆ చిన్న ఇంట్లోనే సర్దుకుపోతున్నారు. ఒక్కసారి వారు చట్టం తలుపు తడితే మీరు, మీ భార్యా కచ్చితంగా వారి బాగోగులు చూడాల్సిన అవసరం పడుతుంది. ఆ విషయాన్ని ఆమెకు వివరించండి. ఆమె తన తల్లిదండ్రులకు ఎంత విలువ ఇస్తుందో, మీ తల్లిదండ్రులకు మీరు అంతే విలువ ఇస్తారని వివరించండి.
మీ తల్లిదండ్రులు మీ ఇంటికి వస్తే ఆమెకు ఎలాంటి సమస్యలు వస్తాయని ఆమె భావిస్తుందో చర్చించండి. అలాంటి సమస్యలు ఏవీ రాకుండా చూసుకుంటానని భరోసా ఇవ్వండి. వారు వచ్చాక ఎక్కువ పనులు ఆమె మీద పడకుండా ఏర్పాట్లు చేస్తానని చెప్పండి. మీ పిల్లలకు కూడా తాతా-నానమ్మలతో ఉండడం వల్ల ఆరోగ్యకరమైన ఇంట్లో జీవించినట్టు ఉంటుంది. న్యూట్రల్ ఫ్యామిలీ కన్నా ఉమ్మడి కుటుంబంలో పెరిగే పిల్లలు ఎక్కువ ఓపికను, బాధ్యతలను మోసే లక్షణాన్ని చిన్నప్పుడు నుంచే తెచ్చుకుంటారు. ఆ విషయాన్ని ఆమెకు వివరించండి. మీ పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లాక మిమ్మల్ని ఒక ఇంట్లో వదిలేస్తే ఎలా ఉంటుందో ఆమెను అడగండి. ఏది ఏమైనా మీరు మీ తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మీరు ముందడుగు వేసి ఆమెతో మాట్లాడి వారిని ఇంటికి తెచ్చుకోవాలి.
Also read: మటన్ హలీం ఇలా ఇంట్లోనే వండుకోండి, చేయడం పెద్ద కష్టమేమీ కాదు