(Source: ECI/ABP News/ABP Majha)
International Day Of Action For Women's Health: అమ్మా.. ఆరోగ్యం జాగ్రత్త - ఈ రోజు ఉమెన్ హెల్త్ డే, ఇంతకీ ఇది ఎందుకు పటిస్తున్నారు? దీని చరిత్ర ఏమిటో తెలుసా?
International Day Of Action For Women's Health: మే 28న మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం జరుపుకుంటారు. మహిళల్లో పునరుత్పత్తి ఆరోగ్యం, ఇతర సమస్యలపై అవగాహన కల్పించడం లక్ష్యం.
International Day Of Action For Women's Health: ఏటా మే 28వ తేదీన మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవంగా జరుపుకుంటారు. మహిళలకు సంతోషకరమైన జీవితం గడిపే హక్కు ఉంది. కానీ నేటి మహిళలు అనేక వివక్షలకు గురవుతున్నారు. ముఖ్యంగా నేటి మహిళలు ఇంటి పనులే కాకుండా ఆఫీసు పనిని కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. కానీ చాలాసార్లు వారు ఇల్లు, ఆఫీసు బాధ్యతలను నిర్వర్తిస్తూ తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. ఇక్కడి నుంచే వారికి అనేక అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. వయసు పెరిగే కొద్దీ రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.
అయినా కూడా ఇంటి బాధ్యతలు, ఆఫీసు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ.. తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ఈ క్రమంలో తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతేకాదు ఇంటా, బయట వివక్షకు గురవుతున్నారు. అలాంటి మహిళల కోసం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం జరుపుకుంటారు. మహిళలు తమ గొంతును ప్రపంచానికి చాటి చెప్పాలని తమ కోసం తాము నిలబడే విధంగా వారు హక్కులను పొందాలని కోరుకుంటారు. మరి మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం రోజు గుర్తించుకోవాల్సిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.
తేదీ:
ప్రతి సంవత్సరం, మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం మే 28న నిర్వహిస్తారు. ఈ ఏడాది మంగళవారం వస్తుంది. అంటే మే 28న నిర్వహిస్తున్నారు.
చరిత్ర:
మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం 1987లో కోస్టారికాలో జరిగిన మహిళల సమావేశంలో, లాటిన్ అమెరికన్, కరేబియన్ ఉమెన్స్ హెల్త్ నెట్‌వర్క్ (LACWHN) ప్రతిఏడాది మే 28ని మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది. ఇది లాటిన్ అమెరికా అంతటా ప్రచారం చేశారు. పునరుత్పత్తి హక్కుల కోసం మహిళల గ్లోబల్ నెట్‌వర్క్ (WGNRR) ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని ప్రచారం చేసింది. ఈ రోజు మహిళల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం, అబార్షన్ హక్కులు, హెచ్‌ఐవి/ఎయిడ్స్ , పేదరికం, లైంగిక స్వయంప్రతిపత్తి, గర్భనిరోధకాల వినియోగంపై అవగాహన కల్పించడం, చర్చించడం వంటి అంశాలపై దృష్టి సారించింది.
లక్ష్యం:
ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రధాన లక్ష్యం స్త్రీలలో లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం, హక్కుల గురించి అవగాహన కల్పించడం. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా అనేక వ్యాధుల నుంచి తనను తాను రక్షించుకోవచ్చు.
ప్రాముఖ్యత:
ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొన్ని ఘటనలు, ప్రచారాల గురించి తెలుసుకుంటూ మనల్ని మనం అవగాహన చేసుకోవడం, తమ గొంతును ప్రపంచానికి వినిపించేలా చేయడం, వారి హక్కులను పొందడం వంటివి ఈరోజు ప్రాముఖ్యత. మహిళలకు తమ జీవితం సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం కూడా ప్రజలు, ప్రభుత్వం, విధాన నిర్ణేతలు కలిసి మహిళల దుస్థితిని అర్థం చేసుకోవాలని, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించే సంస్కరణలను అమలు చేయాలని కోరుతుంది.
Also Read : లవ్ మ్యారేజ్ చేసుకున్నవారే ఎక్కువగా విడిపోతున్నారట.. డివోర్స్ కేసులలో వీరిదే పై చేయి