Kidney Problems : ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
Warning Signs of Kidney Diseases : మూత్రపిండాల్లో సమస్య ఉంటే అవి పూర్తిగా దెబ్బతినేవరకు సమస్యలు అంతగా బయటకి తెలియవు. కానీ కిడ్నీలు కరాబ్ అవుతున్నప్పుడు శరీరం కొన్ని సంకేతాలు ఇస్తోంది అట. అవేంటంటే..

- ఉదయం ముఖం, కళ్ల చుట్టూ వాపు కిడ్నీ సమస్యకు సంకేతం.
- మూత్రంలో నురుగు, చర్మం దురద, అలసట ముఖ్య లక్షణాలు.
- నోటి దుర్వాసన, ఏకాగ్రత తగ్గడం కిడ్నీ పనితీరును సూచిస్తాయి.
- డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు కిడ్నీ పరీక్షలు చేయించాలి.
Kidney Diseases Warning Signs : మన శరీరంలో కిడ్నీలు చేసే పని చాలా కీలకం. రక్తంలోని వ్యర్థాలను బయటకు పంపడంతో పాటు శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటం, రక్తపోటును నియంత్రించడం వంటి పనులు చేస్తాయి. అయితే కిడ్నీ సమస్యలు మొదట్లో పెద్దగా లక్షణాలు చూపించవు. కానీ నెమ్మదిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆ సమయంలో శరీరం కొన్ని సంకేతాలు చూపిస్తుంది.
ఉదయం ముఖం ఉబ్బడం నుంచి మూత్రంలో మార్పులు కనిపించడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం వంటి కొన్ని లక్షణాలు కిడ్నీ పనితీరులో సమస్యకు సంకేతం కావొచ్చు. ముఖ్యంగా డయాబెటిస్, అధిక రక్తపోటుతో బాధపడేవారిలో కిడ్నీ సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మరి ఆ లక్షణాలు ఏంటి.. ఏ సమయంలో కిడ్నీ టెస్ట్‌లు చేయించుకోవాలో చూసేద్దాం.
Also Read : కిడ్నీ వ్యాధులు పురుషుల్లో ఎక్కువా? మహిళల్లో ఎక్కువా? ఎవరికి ప్రమాదం? నెఫ్రాలజిస్ట్ ఏం చెబుతున్నారంటే?
ముఖం, కళ్ల చుట్టూ వాపు
ఉదయం నిద్రలేవగానే ముఖం ఉబ్బినట్లు లేదా కళ్ల చుట్టూ వాపు కనిపిస్తోందా? కొన్నిసార్లు కిడ్నీలు శరీరంలోని అదనపు ద్రవాలను సరిగా బయటకు పంపలేకపోవడం వల్ల ఇలా జరగవచ్చు. పాదాలు, చీలమండల వద్ద కూడా తరచూ వాపు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
మూత్రంలో నురుగు
మూత్రం పోసేటప్పుడు కొద్దిగా బుడగలు రావడం ఎప్పుడూ సమస్యకు సంకేతం కాదు. కానీ ప్రతిసారీ లేదా తరచూ ఎక్కువ నురుగు కనిపిస్తుంటే, మూత్రంలో ప్రొటీన్ లీక్ అవుతుందనే సంకేతం కావచ్చు. ఆరోగ్యకరమైన కిడ్నీలు సాధారణంగా ఎక్కువ మొత్తంలో ప్రొటీన్‌ను మూత్రం ద్వారా బయటకు వెళ్లకుండా అడ్డుకుంటాయి.
Also Read : నగరవాసుల్లో పెరుగుతోన్న కిడ్నీ క్యాన్సర్ కేసులు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తోన్న ఆంకాలజిస్ట్
చర్మం పొడిబారడం
చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకున్నా తరచూ తీవ్రమైన దురద, పొడిబారడం ఉంటే దానికి అనేక కారణాలు ఉండొచ్చు. కిడ్నీ పనితీరు బాగా తగ్గినప్పుడు శరీరంలో వ్యర్థ పదార్థాలు, ఖనిజాల అసమతుల్యత పెరగడం వల్ల కూడా దురద వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమస్య నిరంతరం కొనసాగితే కారణం తెలుసుకోవడం ముఖ్యమని చెప్తున్నారు వైద్యులు.
అలసటగా ఉండటం, ఏకాగ్రత తగ్గడం
రాత్రి ఫుల్‌గా నిద్ర పోయినా.. రోజంతా నీరసంగా అనిపించడం లేదా పనిపై దృష్టి పెట్టలేకపోవడం కూడా కొన్ని సందర్భాల్లో కిడ్నీ సమస్యలతో సంబంధం కలిగి ఉండొచ్చు. కిడ్నీ పనితీరు తగ్గడం వల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉండటంతో అలసట, బలహీనత మరింత పెరగవచ్చు.
నోటి దుర్వాసన
ఉదయం నిద్రలేవగానే నోటి నుంచి దుర్వాసన రావడం సాధారణంగా నోటి పరిశుభ్రత లేదా ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. అయితే దుర్వాసన నిరంతరం ఉండటం, ముఖ్యంగా అమ్మోనియా వంటి వాసన రావడం కిడ్నీ పనితీరు బాగా దెబ్బతిన్న సందర్భాల్లో కనిపిస్తుంది.
కిడ్నీ వ్యాధులకు కారణాలు..
మన శరీరంలోని రెండు కిడ్నీలు రక్తంలోని వ్యర్థాలు, అదనపు ద్రవాలను తొలగించే పనితో పాటు రక్తపోటు నియంత్రణ, ఖనిజాల సమతుల్యత వంటి కీలక విధులను నిర్వహిస్తాయి. డయాబెటిస్, అధిక రక్తపోటు కిడ్నీలకు నష్టం కలిగించే ప్రధాన ప్రమాద కారకాల్లో ఉన్నాయి. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు, జన్యుపరమైన కారణాలు కూడా కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని పెంచవచ్చు. కాబట్టి శరీరం ఇచ్చే లక్షణాలు విస్మరించకుండా.. వైద్య సహాయం తీసుకోవడం మంచిది.
Also Read : కిడ్నీ వ్యాధులను ముందుగా గుర్తించే టెస్ట్ ఇదే.. కేవలం 300 రూపాయలతో తెలుసుకోవచ్చు అంటోన్న వైద్యులు
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























