Karnataka: మసాలా ఆడుతుంటే పవర్ కట్, గ్రైండర్‌తో ఎలక్ట్రిసిటీ ఆఫీస్‌లో తిష్ట వేసిన రైతు - రోజూ అదే పని!
పూర్తి స్థాయిలో తన ఇంటికి విద్యుత్ సరఫరా చేయడం లేదనే కారణంతో ఓ రైతు ఏకంగా అక్కడికి వెళ్లి మసాలాలను గ్రైండ్ చేసుకుంటున్నాడు.
కూరలోకి మసాలా సిద్ధం చేయడానికి గ్రైండర్‌లో అన్నీ వేశారు. సరిగ్గా మసాలా ఆడటానికి స్విచ్ ఆన్ చేయగానే కరెంట్ పోయింది. గంట.. రెండు గంటలు.. మూడు గంటలు.. దాటేసినా పవర్ రాలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మసాలా అవసరం లేని కూర చేసుకుంటారు. లేదా రోలులోనే రుబ్బేసుకుంటారు. కానీ, కర్ణాటకాకు చెందిన ఓ రైతు అలా చేయలేదు. ‘‘ఇంట్లో పవర్ పోతేనేం.. ఎలక్ట్రిసిటీ ఆఫీసులు ఉంటుంది కదా..’’ అని అనుకుంటూ.. గ్రైండర్‌తో సహా అక్కడికి వెళ్లాడు. వంటకు కావల్సిన మసాలాను ఆడేసుకోవడమే కాకుండా.. తన ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టుకున్నాడు. అయితే, ఇది ఒక్కసారి కాదు. పవర్ కట్ చేసిన ప్రతిసారి అతను ఎలక్ట్రిసిటీ ఆఫీసులో తిష్ట వేస్తున్నాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయంగా మారింది.
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని మంగోటే గ్రామానికి చెందిన ఎం.హనుమంతప్ప అనే రైతు మసాలా రుబ్బుకోవడానికి, తన ఇంట్లోని ఫోన్లను ఛార్జింగ్ చేయడానికి ప్రతిరోజూ సమీపంలోని మంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ లిమిటెడ్ (మెస్కామ్)కి వెళ్తున్నాడు. సుమారు 10 నెలల నుంచి అతడు ఇదే పనిచేస్తున్నారు. అయితే, అధికారులు కూడా అతడికి అడ్డు చెప్పకపోవడం విశేషం.
హనుమంతప్ప కుటుంబానికి రోజుకు 3-4 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతుంది. ఇరుగుపొరుగువారికి విద్యుత్ సరఫరా సక్రమంగా ఉన్నా.. తనకు మాత్రమే ఎందుకు ఉండటంలేదని అధికారులను చాలాసార్లు ప్రశ్నించాడు. చివరికి ఎమ్మెల్యేకు విన్నవించినా ఫలితం లేకపోయింది. ఓ రోజు హనుమంతప్ప మెస్కామ్ సీనియర్ అధికారికి ఫోన్ చేసి.. ‘‘ఇంట్లో మసాలాలను ఎలా నూరుకోవాలి? వంట ఎలా చేయాలి? ఫోన్లు ఎలా ఛార్జ్ చేసుకోవాలి. ప్రతి రోజూ నేను నా పొరుగింటికి వెళ్లలేను’’ అని అన్నాడు. దీంతో ఆయన మెస్కామ్ ఆఫీస్‌కు వెళ్లి మసాలాలు రుబ్బుకో అని సెటైర్ వేశాడు. అయితే, హనుమంతప్ప మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. అధికారి చెప్పినట్లే గ్రైండర్ పట్టుకుని మెస్కామ్ ఆఫీస్‌కు వెళ్లాడు.
ఈ వార్త దావనంలా వ్యాపించడంతో అధికారులు దిగి వచ్చారు. హనుమంతప్ప విద్యుత్ లైన్‌ను మార్చేందుకు ముందుకొచ్చారు. అతని ఇంటికి నెల రోజుల్లో విద్యుత్ కనెక్షన్ వస్తుందని తెలిపారు. అయితే, హనుమంతప్ప మెస్కామ్ కార్యాలయానికి వెళ్లిన విషయం వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. రైతు తన వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతించినందుకు దాదాపు 10 మంది జూనియర్ సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. దీంతో హనుమంతప్ప మసాలా గ్రైండింగ్ కోసం మెస్కామ్ కార్యాలయానికి వెళ్లడం లేదు. ఇప్పటికీ అతని ఇంటికి పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా కాలేదు.
Also Read: రసగుల్లాల కోసం వందలాది రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు, ఏందయ్యా ఇది?
Also Read: సాధారణ తలనొప్పికి, మైగ్రేన్‌కు మధ్య తేడాను ఈ లక్షణాలతో గుర్తించండి