Rasgullas: రసగుల్లాల కోసం వందలాది రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు, ఏందయ్యా ఇది?
ఇదెక్కడి విడ్డూరం, రసగుల్లా వల్ల వందలాది రైళ్లను రద్దు చేశారా? ఇంతకీ అక్కడ ఏం జరిగింది?
రసగుల్లా, ఈ పేరు వినగానే నోరూరుతుంది కదూ. ఈ బెంగాలీ స్వీట్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే, ఈ రసుగుల్లాకు రైళ్లు ఆపేసే పవర్ కూడా ఉందనే సంగతి మీకు తెలుసా? ఒకటి కాదు రెండు కాదు, వందలాది రైళ్లు ఈ స్వీట్ వల్ల రద్దయ్యాయి. అధికారులు మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు కూడా. భారత్ బంద్ సమయంలోనో, తుఫాన్లు, వరదల సమయంలోనే ఇలా జరుగుతుంది. కానీ, రసగుల్లాకు అంత సీన్ ఉందా అనేగా మీ సందేహం? అయితే మీరు బీహార్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి తెలుసుకోవాల్సిందే.
బీహార్ అనేగానే మీకు అర్థమైపోయే ఉంటుంది. అక్కడ ఏమైనా జరగొచ్చు. బరహియా ప్రాంతంలోని లక్షిసరాయి ప్రాంతం రసగుల్లాలకు బాగా ఫేమస్. ఈ పట్టణంలో సుమారు 200 పైగా రసగుల్లా దుకాణాలు ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు సమీప నగరాలు, పట్టణాలు, గ్రామల నుంచి వందలాది మంది తరలివస్తుంటారు. అక్కడ రైలు దిగే ప్రతి ఒక్కరూ ఈ రసగుల్లాలను కొనుగోలు చేసుకుని ఇంటికి వెళ్తారు. అయితే, కరోనా వైరస్ వల్ల అన్ని బిజినెస్‌ల తరహాలోనే రసగుల్లాల బిజినెస్‌కు కూడా బాగా పడిపోయింది.
కరోనా వైరస్ వల్ల చాలా రైళ్లను స్పెషల్ ట్రైన్స్‌గా నడుపుతున్నారు. ఒకప్పుడు బరహియా ప్రాంతం మీద నుంచి వెళ్లే ప్రతి రైలు ఆ స్టేషన్‌లో ఆగేది. దీంతో రసగుల్లా వ్యాపారం కూడా బాగానే సాగేది. కరోనా తర్వాత చాలా రైళ్లను ఆ స్టేషన్‌లో ఆపడం లేదు. దీని ప్రభావం రసగుల్లా వ్యాపారంపై బాగా పడింది. ఈ నేపథ్యంలో రసగుల్లా వ్యాపారులు ఇటీవల రైల్వే ట్రాక్‌లపై టెంట్లు వేశారు. సుమారు 40 గంటల సేపు అక్కడే కూర్చున్నారు.
బరాహియా రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే బరహియా మీదుగా వెళ్లే కనీసం 10 ఎక్స్‌ప్రెస్ రైళ్లను స్టేషన్‌లో ఆపాలని డిమాండ్ చేశారు. కనీసం గంట సేపు రైళ్లను ఆపినట్లయితే ప్రయాణికులు తమ వద్దకు వచ్చి రసగుల్లాలు కొనుగోలు చేసుకుని వెళ్తారని పేర్కొన్నారు. వ్యాపారుల రైల్ రోకో వల్ల అధికారులు ఢిల్లీ, హౌర మధ్య నడిచే వందలాది రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. వ్యాపారుల డిమాండ్‌కు అధికారులు దిగివచ్చారు. అటుగా వచ్చే రైళ్లను కనీసం 60 నిమిషాలు నిలిపేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వ్యాపారులు ఆందోళన విరమించారు. ‘రసగుల్లా’ వల్ల ఇన్ని రైళ్లకు ఆటంకం ఏర్పడుతుందని ఏ రోజైనా ఊహించారా?
Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!
Also Read: పొట్టివాళ్లు గట్టోళ్లా? ఎత్తు పెరిగితే ‘అంగ స్తంభన’ సమస్యలు? తాజా స్టడీలో షాకింగ్ ఫలితాలు