Womens Health: మహిళల్లో అరిగిపోతున్న కీళ్లు, వారిలోనే ఈ సమస్య ఎక్కువ ఎందుకు?
కీళ్లు అరిగిపోయే సమస్య మహిళల్లో అధికం.
ఆర్థరైటిస్... ఇదొక కీళ్లవ్యాధి. ముఖ్యంగా పురుషుల్లో కంటే మహిళల్లోనే అధికంగా వస్తున్నట్లు చెబుతున్నారు వైద్యులు. నలభై ఏళ్లు దాటిన మహిళల్లో ఎక్కువగా ఇది వస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ దశలో ఉన్నవారికి ఈ ఆర్థరైటిస్ ఇబ్బంది పెడుతోంది. ఇది వచ్చిందంటే ఒక పట్టాన వదలదు. ఎంతో ఇబ్బంది పెడుతుంది. తట్టుకోలేనంత నొప్పి వస్తుంది. నడవలేరు. కూర్చొని లేవలేరు. కీళ్లు పట్టేస్తాయి. ఇది అధికంగా మహిళల్లోనే రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
మహిళల్లో ఇది వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే వారి హార్మోన్లలో అధికంగా మార్పులు జరుగుతాయి. గర్భం ధరించినప్పుడు, మెనోపాజ్ దశలో కూడా హార్మోన్లలో మార్పులు ఎక్కువగా ఉంటాయి. దానివల్లే పురుషులతో పోలిస్తే మహిళల్లో అధికంగా ఈ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. శరీర బరువు కూడా వీరు అధికంగా పెరుగుతారు. వ్యాయామం తక్కువగా చేస్తారు. అందుకే ఈ కీళ్లనొప్పులు మహిళల్ని టార్గెట్ చేస్తున్నాయి. కాబట్టి ముందు నుంచే ఈ కీళ్ల జబ్బుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. తాజా ఆహారాన్ని తినాలి. హార్మోన్లలో అసమతుల్యత రాకుండా చూసుకోవాలి.
ఆర్థరైటిస్‌లో కాస్త తీవ్రమైనది... రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే రోగనిరోధక కణాలు తమ సొంత శరీర కణజాలాల పైనే దాడి చేసినప్పుడు ఈ వ్యాధులు వస్తాయి. పురుషుల కంటే ఈ ఆటోఇమ్యూన్ వ్యాధులు స్త్రీలలోనే అధికంగా కనిపిస్తుంది. అందుకే మహిళలు ఆహారపరంగానూ, వ్యాయామ పరంగాను చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారంలో కొన్ని రకాల మార్పులు కచ్చితంగా తీసుకోవాలి. మహిళలు ఎంత బలంగా ఉంటే ఆ కుటుంబమంతా అంత బలంగా ఉంటుంది. అందుకే వారు మంచి ఆహారాన్ని తీసుకోవాలి.
మహిళల రోజువారీ ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు తీసుకోవాలి. టమోటాలు రోజువారీ ఆహారంలో ఉండాలి. ఇందులో ఉండే లైకోపీన్ బ్రెస్ట్ క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పాలకూరను కూడా తినాలి. ఆస్తమా, అధికరక్తపోటు వంటివి రాకుండా అడ్డుకుంటాయి. డైటరీ ఫుడ్ ఓట్స్. దీన్ని రోజూ తింటే ఆహారం జీర్ణం సులభంగా అవుతుంది. అవిసెగింజలతో కొన్ని రకాల ఆహార పదార్థాలు చేసుకుని తినాలి. ఆకుకూరలు, గుడ్లు, మాంసం వంటివి రోజువారీ మెనూలో ఉండాలి.
Also read: నా భార్య నా కంటే పెంపుడు కుక్క పైనే ఎక్కువ ప్రేమ చూపిస్తోంది, తట్టుకోలేకపోతున్నా
Also read: కాళ్లు, చేతులలో ఈ లక్షణాలు కనిపిస్తే మీకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నట్టే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.