Jharkhand: విజయ్ సేతుపతిని మించిపోయాడు.. ఇద్దరితో ప్రేమ, పెళ్లి, ఇదో వెరైటీ లవ్ స్టోరీ!
అప్పటికే అతడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. సహజీవనం చేస్తూ బిడ్డను కూడా కన్నాడు. అదే సమయంలో మరో యువతి ప్రేమలో పడ్డాడు.
మీరు విజయ్ సేతుపతి, సమంత, నయన తార నటించిన ‘కణ్మణి, రాంబో, ఖతీజా’ సినిమా చూశారా? అయితే, మీకు ఈ ఘటన గురించి మరీ వివరించి చెప్పక్కర్లేదు. కానీ, ఆ సినిమా చూడనివారికి మాత్రం ఇది తెలియాల్సిందే. ఆ సినిమాలో విజయ్ సేతుపతి సమంత, నయన్‌లను ఒకేసారి ప్రేమిస్తాడు. ఇద్దరిలో ఒకరినే పెళ్లి చేసుకోవాలని చెబితే.. అలా కుదరదని అంటాడు. అయితే, సినిమా క్లైమాక్స్‌లో మాత్రం ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడనేది మాత్రం చూపించలేదు. కానీ, జార్ఘండ్‌కు చెందిన ఓ యువకుడు మాత్రం.. ‘కణ్మణి, రాంబో ఖతీజా’ సినిమాకు క్లైమాక్స్ సెట్ చేసేశాడు. తాను ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు.
లోహార్‌దాకా జిల్లాకు చెందిన సందీప్ ఒరాన్ అనే యువకుడు కుసుమ లక్రా, స్వాతి కుమారీలను ప్రేమించాడు. అయితే, ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోడానికే సాధ్యమవుతుందని పెద్దలు చెప్పడంతో సందీప్ చాలా ఆలోచించాడు. వాళ్లిద్దరూ ఒక్కరు లేకున్నా తన జీవితం అసంపూర్ణమని పెద్దలకు చెప్పేశాడు. ఇద్దరిలో ఎవరి ముఖ్యమో తేల్చుకోలేకపోతున్నానని, ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులకు షాకిచ్చాడు.
అతడి సంగతి సరే, మరి ఆ ఇద్దరమ్మాయిలూ ఇందుకు అంగీకరిస్తారా? అనే సందేహం నెలకొంది. చిత్రం ఏమిటంటే.. ఆ ఇద్దరు తమ ప్రేమికుడిని పెళ్లి చేసుకోడానికి అంగీకారం తెలిపారు. తమ ఇద్దరినీ పెళ్లి చేసుకున్నా ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు. దీంతో ప్రియుడు ఎగిరి గంతేశాడు. దీంతో ముగ్గురు కుటుంబ సభ్యులు ఒక్కటై పెళ్లిని ఖాయం చేసుకున్నారు. ఇటీవలే లోహర్‌దగాలోని బంద గ్రామంలో ముగ్గురికి పెళ్లి చేశారు.
అయితే, భారతీయ చట్టాల ప్రకారం.. ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరిని పెళ్లి చేసుకోవడం నేరం. అయితే, గ్రామ పంచాయతీ ఇందుకు అనుమతి ఇవ్వడంతో అతడు ఈ గండం నుంచి బయటపడ్డాడు. పైగా, ఆ అమ్మాయిల కుటుంబ సభ్యులు కూడా ఇష్టపూర్వకంగానే అతడితో పెళ్లికి అంగీకరించడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరిగిపోయింది.
వీళ్లది చిత్రమైన ప్రేమ: సందీప్ ముందుగా కుసుమ్‌ను ప్రేమించాడు. మూడేళ్లపాటు ఆమెతో సహజీవనం చేశాడు. వారికి ఒక బిడ్డ కూడా పుట్టింది. ఏడాది తర్వాత సందీప్ ఓ ఇటుకల బట్టీలో పనిచేయడం కోసం పశ్చిమ బెంగాల్ వెళ్లాడు. అక్కడ సందీప్‌తోపాటు పనిచేయడానికి వచ్చిన స్వాతి కుమారితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారి మధ్య ప్రేమ కొనసాగింది.
సందీప్ పదే పదే స్వాతిని కలవడాన్ని చూసి గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. సందీప్ ఇద్దరితో సంబంధం పెట్టుకున్నాడని, ఇలా పెళ్లి కాకుండా సంసారాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని సూచించారు. అయితే, సందీప్ తాను ఇద్దరినీ వదలి ఉండలేనని చెప్పేశాడు. కుసుమ్, స్వాతీలు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. చివరికి ముగ్గురికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు.
Also read: రైల్వే మటన్ కర్రీ, స్వాతంత్య్రానికి పూర్వం రైళ్లలో ఇదే ఫేమస్
Also read: ఊరగాయలు ఈనాటివి కావు, గత వందల ఏళ్లుగా తింటూనే ఉన్నాం, అప్పట్లో ఇవి ఔషధాలు