Kajal: శిశువుల కంటికి కాటుక పెట్టడం సురక్షితమేనా?
చాలామంది చంటి పిల్లలకు కాటుక పెట్టడం చేస్తుంటారు. ఇది ఎంతవరకు సేఫ్
కాటుక, కాజల్, సుర్మా ఇవన్నీ కూడా కళ్ళకు పెట్టే ఒక సౌందర్య ఉత్పత్తి. సాంప్రదాయ భారతీయ సంస్కృతిలో ఇది చాలా ముఖ్యమైనది. చెడు దృష్టి నుండి బిడ్డలను కాపాడుకోవడం కోసం ఇలా కాటుకను పెడుతూ ఉంటారు. మరి కొందరు శిశువుల కళ్ళు పెద్దవిగా, అందంగా కనిపించాలని కాటుకను ఉపయోగిస్తారు. కుటుంబంలోని పెద్దలు రోజుల వయసున్న శిశువుకు కూడా దాన్ని పెట్టాలని పట్టుబడతారు. దీన్ని శిశువుల కంటి దిగువ భాగంలో పెడతారు. అలాగే చెవి వెనక దిష్టి తగలకుండా పెట్టేవారు ఉన్నారు. చెంపల పైన, నుదిటి పైనా కూడా ఎంతోమంది ఈ కాటుకను పెడుతూ ఉంటారు. అయితే ఇలా నవజాత శిశువులకు కాటుకను పెట్టడం సురక్షితమేనా కాదా అన్నది తెలుసుకుందాం.
కాటుక ఉపయోగించడం వల్ల శిశువులకు మేలు జరుగుతుందని చాలా కుటుంబాల్లోని పెద్దలు విశ్వసిస్తున్నారు. కానీ వైద్యులు మాత్రం ఆ విషయంతో ఏకీభవించడం లేదు. ఎందుకంటే కాటుక తయారీలో సీసం ఉండే అవకాశం ఉంది. దీనివల్ల పిల్లల కళ్ళలో దురద, చికాకు వంటివి వస్తాయి. అలాగే ఇన్ఫెక్షన్లు కూడా కలిగే అవకాశం ఉంది. దుకాణాలలో కొనుగోలు చేసే కాటుకలలో చాలా వరకు సీసంతో నిండి ఉంటాయి. ఇవి పిల్లలకు పెట్టడం మంచిది కాదు. ఇంట్లో తయారు చేసే కాటుకలను వాడేవారు కూడా ఉన్నారు. కానీ ఇవి కూడా మంచిదే అని చెప్పే శాస్త్రీయ అధ్యయనాలు లేవు. కాటుక ఎలా తయారు చేసినా అందులో కార్బన్ ఉండే అవకాశం ఉంది. బయట దొరికే కాటుకలు అధికంగా బొగ్గుతో తయారుచేసినవే ఉంటాయి. బొగ్గు, కొబ్బరి నూనె ఉపయోగించి వాటిని తయారు చేస్తూ ఉంటారు. అలాంటి కాటుకను పిల్లలకు పెట్టడం మంచిది కాదు.
చేతులు శుభ్రంగా లేకుండా చిన్నపిల్లల కళ్ళకు కాటుక పెట్టడం వల్ల చేతులకు ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు కళ్ళల్లో చేరే అవకాశం ఉంది. కాబట్టి కళ్ళకు కాటుక పెట్టకపోవడమే మంచిది. దిష్టి తగలకుండా పిల్లలకి కాటుక పెట్టాలనుకుంటే చెవుల వెనక, అరికాలి మీద, నుదుటిమీద పెట్టడం ఉత్తమం. శిశువుకు స్నానం చేసేటప్పుడు ఆ కాటుకను తడిగుడ్డతో మెత్తగా మృదువుగా తుడవాలి. లేకుంటే అది చర్మపు కణాల్లో ఇంకిపోయే అవకాశం ఉంది. కాబట్టి కాటుకను తుడవకుండా ఎక్కువ కాలం పాటు వదిలేయకూడదు. శిశువుల చర్మం, మన చర్మం కన్నా చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలకు వాడే ఉత్పత్తులన్నింటినీ సురక్షితమో కాదు నిర్ణయించుకున్నాకే వాడడం ఉత్తమం.
Also read: గోళ్లు పెళుసుగా మారి విరిగిపోతున్నాయా? అయితే మీకు ఈ పోషకాల లోపం ఉన్నట్టే
Also read: డైట్ కోక్‌లో క్యాన్సర్ కారక పదార్థం, హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.