(Source: ECI/ABP News/ABP Majha)
Diabetes: నిద్ర పెంచినా తగ్గించినా సమస్యే, డయాబెటిస్ వచ్చే ఛాన్స్
ఆహారం, నిద్ర... ఈ రెండే శరీరానికి చాలా ముఖ్యమైన క్రియలు. వీటిల్లో తేడా వస్తే సమస్య తప్పదు.
మధుమేహం, హైబీపీ ఈ రెండూ వయసుతో పాటు శరీరంపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ముప్పై అయిదేళ్లు దాటితే చాలు మధుమేహం ఎప్పుడైనా దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. దాని బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలి. ఆ అలవాట్లలో మంచి ఆహారంతో పాటూ కంటినిండా నిద్రను కూడా చేర్చుకోవాలి. నిద్ర వేళలు తగ్గించకూడదు, అలాగని పెంచేయకూడదు. ఎనిమిది గంటల పాటూ నిద్రపోతే చాలు. పదిగంటలు దాటి పడుకున్నా, ఏడుగంటల కన్నా తక్కువ నిద్రపోయినా కూడా శరీరంలో కనపించని సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా మధుమేహం, నిద్ర మధ్య విడదీయలేని బంధం ఉంది. ఒక్క రోజు సరిగా నిద్రపోకపోయినా రక్తంలో గ్లూకోజు స్థాయిలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
హార్మోన్ల పనితీరుపై ప్రభావం
నిద్ర సరిగా పట్టకపోతే గ్లూకోజ్ నియంత్రించే హార్మోన్లపై ప్రభావం పడుతుంది. కొన్ని రోజుల పాటూ ఇలాగే కొనసాగితే మధుమేహం వచ్చే అవకాశం పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇన్సులిన్ మనం గాఢనిద్రలో ఉన్నప్పుడు అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఒకవేళ సరిగా నిద్రపట్టకపోతే ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి అవ్వదు. దీనివల్ల గ్లూకోజు స్థాయిలు రక్తంలో అధికంగా పెరిగిపోతాయి. నిద్రలేకపోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత సమస్య కూడా మొదలవుతుంది. ఇలా వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారడం మధుమేహం వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. ఎందుకంటే ఇన్సులిన్ నిరోధకత తలెత్తితే కణాలు గ్లూకోజు స్వీకరించలేవు. కణాలు గ్లూకోజును స్వీకరించేలా చేయాలంటే ఇన్సులిన్ చాలా అవసరం. కణాలు స్వీకరించకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజు స్థాయిలు పెరిగిపోతాయి. ఫలితంగా మధుమేహం వ్యాధి శరీరంలోకి ఎంట్రీ ఇస్తుంది.
నిద్ర పట్టకపోవడం వల్ల ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తి కూడా పెరిగిపోతుంది. దీని వల్ల మానసిక సమస్యలు, తలనొప్పి మొదలవుతుంది. నిద్రలేమి వల్ల ఆకలి కూడా తగ్గిపోతుంది. దానికి కారణం లెఫ్టిన్ అనే హార్మోన్లు. నిద్ర సరిగా పట్టకపోతే వీటి స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో సరిగా తినక పోషకాహారలోపం తలెత్తవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే నిద్రలేమి వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి.
మద్యపానం, పొగతాగడం వంటివి కూడా సుఖమైన నిద్రను దూరం చేస్తాయి. వాటి వల్ల మధుమేహం వచ్చే అవకాశం కూడా పెరిగిపోతుంది. రాత్రి పూట నిద్ర పట్టే ఆహారాలను తినాలి. నూనెలో వేయించిన పదార్థాలు, మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలి.
సంఖ్య పెరిగిపోతోంది...
ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రతి ఏటా ఈ సంఖ్య పెరిగిపోతోంది. ఒక్క మనదేశంలోనే ఏడున్నర కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహ వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. పాతికేళ్లలోపు వారు కూడా మధుమేహం బారిన పడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
Also read: వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఆరోగ్య శాఖ సూచనలు
Also read: ప్రపంచంలో తొలి ఫాస్ట్‌ఫుడ్ సమోసానే, మనదేశానికి ఎలా వచ్చిందంటే