Diabetes: భోజనం చేశాక ఇలా చేస్తే చాలు, మధుమేహం అదుపులో ఉండడం ఖాయం
భోజనం చేశాక నడిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఆరోగ్యకరమైన జీవనశైలిలో నడకది ప్రధాన పాత్ర. వ్యాయామం చేయలేని వారికి నడక ఎంతో మేలు చేస్తుంది. చాలామంది ఉదయాన నడిచేందుకు ఇష్టపడతారు. రోజు గంట నడిస్తే చాలు ఆరోగ్యంగా ఉంటారు అని చెబుతారు వైద్యులు. అయితే భోజనం చేశాక ఒక పది నిమిషాలు నడపడం వల్ల మధుమేహం అదుపులో ఉంచుకోవచ్చని, ఇంకా అనేక ఆరోగ్యాలు కలుగుతాయని వివరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
భోజనం చేశాక బద్ధకంగా అనిపిస్తుంది. కాసేపు నిద్ర పోవాలనిపిస్తుంది. చాలామంది మధ్యాహ్న భోజనం చేసి ఒక గంట సేపు కునుకేస్తారు. ఇది ఆరోగ్యానికి చెడే చేస్తుంది. భోజనం చేసాక కనీసం 10 నిమిషాలు నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వరకు తగ్గుతాయి. టైప్2 మధుమేహం వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. భోజనం తర్వాత ఆహారంలో ఉన్న గ్లూకోజు రక్త ప్రవాహంలోకి ఒకేసారి విడుదలవుతుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో పెరుగుదల ఏర్పడుతుంది. దీనివల్ల మధుమేహం అధికమయ్యే అవకాశం ఉంది. అయితే భోజనం చేశాక నడవడం వల్ల ఇలా జరిగే అవకాశం తగ్గుతుంది.
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి రోజుకు 11 నిమిషాలు చురుగ్గా నడిస్తే చాలు. వారానికి 75 నిమిషాల నడక వల్ల ముందస్తు మరణ ప్రమాదాన్ని 23% తగ్గిస్తుందని ఆ అధ్యయనం చెబుతుంది. అలాగే హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని 17% తగ్గించుకోవచ్చని, క్యాన్సర్ ప్రమాదాన్ని ఏడు శాతం తగ్గించుకోవచ్చని వివరిస్తుంది.
భోజనం తర్వాత పది నిమిషాలు నడవడం వల్ల శరీరంలో సెరటోనిన్ విడుదల అవుతుంది. ఇది మంచి నిద్రకు, ఆకలిని నియంత్రించడానికి, సానుకూల మనస్తత్వాన్ని పెంచడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.
ఎన్నో ప్రయోజనాలు
భోజనం చేశాక పది నిమిషాలు నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలా నడిస్తే కీళ్లు బలోపేతం అవుతాయి. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. జీవక్రియ మెరుగుపడుతుంది. మానసిక పరిస్థితి బాగుంటుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది .కండరాలు, ఎముకలు మొదలైనవి బలోపేతం అవుతాయి. డోపమైన్, ఆక్సిటోసిన్, సెరెటోనిన్, ఎండార్ఫిన్ వంటి సంతోషకరమైన హార్మోన్లు విడుదల అవుతాయి. పేగు ఆరోగ్యానికి పోస్ట్ మీల్ వాకింగ్ ఎంతో మంచిది. భోజనం చేశాక ఓ పది నిమిషాలు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. డయాబెటిస్ ఉన్న వారు ఇలా చేస్తే మధుమేహం అదుపులో ఉంటుంది. డయాబెటిస్ లేని వారు వాకింగ్ చేస్తే భవిష్యత్తులో ఆ రోగం వచ్చే అవకాశం తగ్గుతుంది.
Also read: మగవారికి రొమ్ములు పెరిగితే దానికి కారణం ఈ తీవ్రమైన సమస్య కావచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.