Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!
డయాబెటిస్‌కు ఇప్పటివరకు మందు లేదు. కేవలం నివారణ, జాగ్రత్తలతో మాత్రమే కాస్త కంట్రోల్ చేయగలం. ఎంత జాగ్రత్తగా ఉంటే.. అన్నేళ్లు బతికేందుకు అవకాశం ఉంటుంది. అయితే, తాజా ప్రయోగం ఆశలు చిగురింపజేస్తోంది.
అదేంటీ.. మన పొట్ట డయాబెటిస్ నుంచి మనల్ని ఎలా కాపాడుతుందని అనుకుంటున్నారా? అసలు, పొట్టకు.. డయాబెటిస్‌కు ఏమిటి సంబంధం అని తెగ ఆలోచించేస్తున్నారా? లేదా మనం తినేవన్నీ పొట్టలోకే వెళ్తాయి కదా... తిండిని కట్టడి చేయడం ద్వారా డయాబెటిస్ నుంచి బయటపడొచ్చనే లాజిక్‌తోనే అలా చెబుతున్నామని అనుకుంటున్నారా? వాటిలో ఏ ఒక్కటీ కాదు. తాజాగా నిర్వహించిన ఓ క్లినికల్ స్టడీలో బయటపడ్డ ఆసక్తికర విషయం ఇది. అదేంటో తెలిస్తే.. డయాబెటిస్ బాధితుల మదిలో వేయి వీణలు ఒక్కసారే మోగుతాయి.
పొట్ట రక్త కణాలతో ఇన్సులిన్?
పొట్ట నుంచి సేకరించే రక్త కణాలను ప్రవహించే ఇన్సులిన్ కణాలుగా మార్చవచ్చని ఈ స్టడీలో తేలింది. ఇది డయాబెటిస్ సమస్యకు ఒక పరిష్కారాన్ని సూచిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. న్యూయార్క్‌కు చెందిన వెయిల్ కార్నెల్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధన ప్రకారం.. మానవ ఉదర భాగం నుంచి సేకరించిన కణజాలాన్ని అత్యంత ప్రభావంత ప్రాసెస్‌లో రీప్రోగ్రామింగ్ చేయొచ్చని తెలిపారు. వాటితో ప్యాంక్రియాటిక్ ఇన్సులిన్‌ను పోలి ఉండే కణాల ప్రవాహాన్ని (వీటినే బేటా సెల్స్ అని కూడా అంటారు) సృష్టించవచ్చని పేర్కొన్నారు. డయాబెటిస్ కలిగిన ఎలుకలపై జరిపిన ప్రయోగంలో.. ఈ కణాలకు చెందిన చిన్న సమూహాల మార్పిడి మధుమేహం వ్యాధి సంకేతాలను తిప్పికొట్టినట్లు వెల్లడించారు. ఈ వివరాలన్నీ ఇటీవలే నేచర్ సెల్ బయాలజీ అనే జర్నల్‌లో ప్రచురించారు.
ఈ పరిశోధనలో పాల్గొన్న వెయిల్ కార్నెల్ మెడిసిన్‌కు చెందిన థెరాప్యూటిక్ ఆర్గన్ రీజనరేషన్ విభాగం సభ్యుడు ప్రొఫెసర్ డాక్టర్ జాయ్ జౌ మాట్లాడుతూ.. ‘‘రోగికి సంబంధించిన సొంత కణాలతోనే టైప్-1, టైప్-2 డయాబెటిస్ బాధితులకు చికిత్స అందించవచ్చని చెప్పేందుకు ఈ కాన్సెప్ట్ స్టడీ ఆధారం’’ అని వెల్లడించారు. డాక్టర్ జాయ్ జౌ సుమారు 15 ఏళ్లుగా ఈ అధ్యయానంలో నిమగ్నమై ఉన్నారు. తాజా ఫలితాలతో ఆయన దాదాపు విజయం సాధించినట్లు చెబుతున్నారు. అయితే, పూర్తిగా దీన్ని అమల్లోకి తేవాలంటే మరిన్ని ప్రయోగాలు అవసరమని చెబుతున్నారు.
2016లో ఓ ఎలుకపై చేసిన ప్రయోగంలో జాయ్, ఆయన టీమ్.. ఎలుక కడుపులోని గ్యాస్ట్రిక్ స్టెమ్ సెల్స్ ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తికి ప్రయత్నించారు. కడుపు స్వయంగా హార్మోన్ కణాల ప్రవాహాన్ని తయారు చేసుకుంటుందని అందుకే వాటిని ఈ ప్రయోగానికి ఎంపిక చేసుకున్నామని ఆయన వెల్లడించారు. అనంతరం జరిపిన పరిశోధనల్లో జాయ్ టీమ్.. మానవ శరీరంలోని గ్యాస్ట్రిక్ స్టెమ్ సెల్స్‌ను బెటా తరహా కణాలుగా మార్చారు. ఆ కణాలను ఆర్గనాయిడ్స్ అనే చిన్న క్లస్టర్స్‌లో పెంచారు. అవి గ్లూకోజ్ ప్రభావానికి గురికాగానే ఇన్సులిన్‌ను విడుదల చేసినట్లు తెలుసుకున్నారు. వీటిని పూర్తిగా క్లినికల్ యూజ్‌లోకి తీసుకొచ్చేందుకు లాబ్‌లో మరికొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని జాయ్ వెల్లడించారు. ఇదే కనుక సక్సెస్ అయితే తప్పకుండా డయాబెటిస్ బాధితులు హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు.
Also Read: షాకింగ్ స్టడీ - మైక్రోప్లాస్టిక్ వల్ల పిల్లలు పుట్టడం కష్టమేనట!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.