Sun Stroke: వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ తాగించవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
వేసవిలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఎండలో వీలైనంత వరకు బయటకు వెళ్లకపోవడం మంచిదంటున్నారు. ఒకవేళ వెళ్తే ఎండ మీద పడకుండా చూసుకోవాలంటున్నారు.
Sun Stroke Symptoms and Treatment: రోజు రోజుకు ఎండలు ముదురడంతో పలువురు వడదెబ్బ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వడదెబ్బ తగిలితే చేయాల్సిన ప్రథమ చికిత్స ఏంటి? శరీరం డీహైడ్రేషన్ కు గురైందనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి? వేసవిలో ఎలాంటి కూరగాయలు, పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది? అనే విషయాలను ‘ఏబీపీ దేశం’కు వివరించారు డాక్టర్ శ్రీనివాస్. ఇంతకీ ఆయన వడదెబ్బ గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం..
వడదెబ్బ అంటే ఏంటి?
మనిషి శరీర సాధారణ ఉష్ణోగ్రత 97.8 డిగ్రీలు ఉంటుంది. ఇది సడెన్ గా 104 డిగ్రీలకు పెరగడాన్ని వడదెబ్బ లేదంటే సన్ స్ట్రోక్ అంటారు. వడదెబ్బ తగలగానే మనిషి వెంటనే అస్వస్థతకు గురవుతారు. కిందపడిపోవడంతో పాటు తీవ్ర తలనొప్పి, కాళ్లు చేతులు అడకపోవడం, కడుపు నొప్పి, దమ్ము ఏర్పడుతాయి. చివరకు అపస్మారక స్థితిలోకి చేరుకుంటారు.
వడదెబ్బ తగిలితే ఏం చేయాలి?
వడదెబ్బ తగిలితే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లాలి. లేకపోతే, వెంటనే వడదెబ్బ తగిలిని వ్యక్తిని ఎండలో నుంచి నీడకు తీసుసుకెళ్లాలి. ఫ్యాన్ లేదంటే కూలర్ దగ్గర ఉంచాలి. మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత బాడీని తొలుత తడిగుడ్డతో, ఆ తర్వాత పొడి గుడ్డతో తుడవాలి. అనంతరం నీళ్లు తాగించాలి.
ఓఆర్ఎస్ నీళ్లు తాగిస్తే మంచికాదా?
వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు తాగించాలని చాలా మంది అనుకుంటారు. కానీ, అది చాలా తప్పు. ఓఆర్ఎస్ లో సోడియం, పొటాషియం, మెగ్నీషియం లవణాలు ఉంటాయి. ఈ లవణాలు బాడీలో నీటి సాంద్రత తగ్గినప్పుడు అవి రివర్స్ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కిడ్నీలను డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది. ముందుగా అందుబాటులో ఉన్న నీటిని తాగించాలి.
వడదెబ్బను ఎలా నివారించాలి?
ప్రతి అరగంటకు ఓసారి కాస్త నీళ్లు తాగాలి. బయటకు వెళ్లే సమయంలో ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. వడదెబ్బ తగలదు.
డీ హైడ్రేషన్ ను ఎలా గుర్తించాలి?
ప్రతి గంటకు కిడ్నీలు 30 నుంచి 40 మిల్లీ లీటర్ల యూరిన్ ను ఉత్పత్తి చేస్తాయి. యూరిన్ తెల్లగా ఉండి ఎక్కువగా వస్తే డీహైడ్రేషన్ లేనట్టు గుర్తించాలి. అలా కాకుండా పసుపు పచ్చగా ఉండి, తక్కువగా వస్తే బాడీ డీ హైడ్రేషన్ కు గురైనట్టు గుర్తించాలి.
వేసవిలో ఏం తింటే ఆరోగ్యానికి మంచిది?
వేసవిలో ఎక్కువగా పుచ్చకాయలు తినాలి. దీనిలో 75 శాతం నీరు, 20 శాతం పీచు పదార్థం, 10 శాతం గ్లూకోజ్ ఉంటుంది. దోసకాయలు, టమాటలు, ఆరెంజెస్ లాంటి నీటిసాంద్రత ఎక్కువ ఉన్న పండ్లు కూరగాయలు తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలి.