తిన్న వెంటనే పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుందా? ఇలా చేశారంటే రిలీఫ్ గా ఉంటుంది
పొట్ట నిండుగా ఉంటే నిద్రపట్టదు, చాలా అసౌకర్యంగా ఉంటుంది. మీరు ఈ ఇబ్బంది ఎదుర్కొంటుంటే ఈ టిప్స్ పాటించండి.
భోజనం చేసిన వెంటనే పొట్ట నిండుగా, ఉబ్బరంగా అనిపిస్తుంది. నాన్ వెజ్ తిన్నప్పుడు ఇటువంటి ఫీలింగ్ ఎక్కువ మందికి ఎదురవుతుంది. అతిగా తినడం, సరిగా నమలకపోవడం, ఆహారంతో పాటు సోడాలు తాగడం, తిన్న వెంటనే పడుకోవడం వంటి అనేక కారణాలు దీని వెనుక ఉన్నాయి. మీకు తిన్న వెంటనే పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుందా? అయితే ఇలా చేయండి ఆ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు. మీ గట్ హెల్త్ కూడా బాగుటుంది.
10 నిమిషాల నడక
భోజనం చేసిన తర్వాత కాసేపు నడక అలవాటు చేసుకోండి. కనీసం 10 నిమిషాల పాటు నడవటం వల్ల పొట్ట తేలిక పడుతుంది. నడిచేందుకు బయటకే వెళ్లాల్సిన పని లేదు ఇంట్లోనే టైమ్ పెట్టుకుని గదుల్లో నడిచినా సరిపోతుంది. కాసేపు వేగంగా తర్వాట నెమ్మదిగా అడుగులు వేయాలి. ఇది బ్లడ్ షుగర్ ని నీయంత్రించడంలో సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల ఆహారం వేగంగా జీర్ణం అవుతుంది.
సరిగా నమలడం
తినే సమయంలో టీవీ లేదా ఫోన్ చూస్తూ ఉంటే ఆహారాన్ని సరిగా నమలరు. అప్పుడు కడుపుపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. దీని వల్ల కూడా కడుపునొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతాయి. తినేటప్పుడు ఆహార ఎన్ని సార్లు నములుతున్నారో గమనించాలి. నెమ్మదిగా తినాలి. కనీసం 32 సార్లు నమలడానికి ప్రయత్నించాలి.
సోంపు గింజలు
భోజనం పూర్తి చేసిన తర్వాత రెస్టారెంట్లో సోంపు గింజలు ఇస్తూ ఉండటానికి వెనుక ఒక కారణం ఉంది. ఇవి మౌత్ ఫ్రెషనర్ గా పనిచేయడమే కాకుండా జీర్ణక్రియ ప్రక్రియని పెంచుతాయి. సోంపు గింజల్లో ఉండే నూనెలు కడుపులో జీర్ణ ఎంజైమ్ ల్ ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి.. జీర్ణాశయాంతర పేగులకు ఉపశమనం కలిగిస్తాయి.
జీలకర్ర టీ
ప్రతిసారి ఉబ్బరంతో బాధపడే వాళ్ళకి జీలకర్ర చక్కని ఎంపిక. పిత్త అసమతుల్యతని తగ్గించడంలో జీలకర్ర టీ సహాయపడుతుంది. ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకుని ఒక కప్పు నీటిలో 5 నిమిషాల పాటు ఉడకబెట్టడం ద్వారా ఇది తయారు చేసుకోవచ్చు. టీని వడకట్టి వేడిగా ఉన్నప్పుడే తాగాలి. ఉబ్బరం సమస్యకు కారణమైన గ్యాస్ ని నియంత్రించడంలో జీలకర్ర టీ సహాయపడుతుంది.
సోడా తాగొద్దు
కొంతమందికి భోజనంతో పాటు కూల్ డ్రింక్స్, పంచదార సోడాలు తాగడం అలవాటు. కానీ ఇవి కడుపుని గాలితో ఎక్కువగా నింపేస్తాయి. దాని వల్ల కడుపునొప్పి వస్తుంది. సోడాల్లో కార్బన్ డయాక్సైడ్ ఉన్నందువల్ల అందులోని బుడగలు కడుపులో గ్యాస్ రూపంలో చేరతాయి. ఫలితంగా కడుపు ఉబ్బరం వస్తుంది.
తక్కువ తినాలి
ఇష్టమైన ఆహారం కనిపిస్తే కంట్రోల్ చేసుకోవడం సాధ్యం కాదు. ఫలితంగా అతిగా లాగించేస్తారు. అది తీవ్ర ఇబ్బందులని తెచ్చి పెడుతుంది. అందుకే తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 80 శాతం మాత్రమే తినాలి. 20 శాతం పొట్ట ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే పొట్ట మీద భారం తగ్గుతుంది. పొట్ట ఉబ్బరం సమస్యకి ఇది శాశ్వతమైన పరిష్కారం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.