ఎవరండీ, బీరు ఆరోగ్యానికి మంచిది కాదన్నది? పరిశోధకులు ఏం చెప్పారో చూడండి
మీరు బీరు ప్రియులా.. ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారేమో. అయితే, మరీ సంతోషపడాల్సిన విషయం లేదు. ఎందుకంటే..
మధుప్రియులకు గుడ్ న్యూస్. బీరు తాగే అలవాటున్న మిమ్మల్ని ఇకపై ఎవరైనా మిమ్మల్ని తాగుబోతు, మందుబాబు అని పిలిస్తే.. ఇలా చెప్పండి. మీరు తాగుతోంది మందుకాదని, ఆరోగ్యాన్ని పెంచే టానిక్ అని చెప్పండి. అలాగని, అదే పనిగా తాగేస్తూ బానిస మాత్రం కాకండి. ఆరోగ్యం మాట ఎలా ఉన్నా.. ప్రాణాలే పోతాయ్. ఏదైనా మితంగా తీసుకుంటేనే మంచిది. పరిశోధకులు అదే అంటున్నారు. బీరు మంచే చేస్తుంది. కానీ.. ఒక మొతాదు వరకు తాగితేనే.
బీరులో పేగులకు ప్రయోజనం చేసే బ్యాక్టీరియా ఉంటుందట. అది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందట. పెరుగు వంటి ప్రోబయోటిక్ పానీయాల తరహాలోనే బీరు మేలు చేస్తుందని అంటున్నారు. బీరులో పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయని, అవి కడుపుకు మేలు చేస్తాయని పరిశోధకులు వెల్లడించారు. చైనాలోని డాలియన్ మెడికల్ యూనివర్శిటీ జరిపిన అధ్యయనం ప్రకారం.. “బీర్‌ను మితంగా తీసుకున్నప్పుడు, అందులో ఉండే ఫినాల్స్, ఇతర పోషకాలు విచ్ఛిన్నమవుతాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, ఇమ్యునోమోడ్యులేటరీ ఎఫెక్ట్‌లను అమలు చేస్తాయి.
ఇటీవల బెల్జియం, పోర్చుగల్, రొమేనియా, స్పెయిన్‌లోని పరిశోధకులు బీరు.. పేగులకు కలింగే ప్రయోజనాల గురించి వివరించారు. అయితే, తగిన మోతాదులో తీసుకొనేవారికే ఇలాంటి ప్రయోజనం చేకూరుతుందని, అదే పనిగా బాటిళ్ల మీద బాటిళ్లు ఎత్తేసే మందు బాబులకు కూడా అది పనిచేయదని అంటున్నారు. కాబట్టి, బీరు తాగండి.. కానీ, అలవాటుగా కాకుండా అప్పుడప్పుడు తాగుతూ.. దాని నుంచి వచ్చే ప్రయోజనాలను పొందండి. బీరులో ఉండే బయోయాక్టివ్‌లు గుండె జబ్బులతో సహా రక్త ప్రసరణ, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
బరువు కూడా తగ్గొచ్చా?
కొన్ని నియమాలు పాటిస్తే.. బీరు తాగుతూ బరుతు తగ్గొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రొటీన్ తీసుకున్నపుడు కడుపు నిండుగా ఉన్న భావన కలిగి తక్కువ తింటామని, ఫలితంగా అదనపు క్యాలరీలు శరీరంలో చేరవనేది నిపుణుల వాదన. ఇటీవల నిర్వహించిన మూడింట రెండు వంతుల మంది ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారమే ఎంచుకున్నారు. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నారు.
అందువల్ల ఆల్కహాల్‌తో కలిపి 1749 క్యాలరీలు మాత్రమే శరీరంలో చేరాయి. నిజానికి వారు ఉన్న బరువును అలాగే కొనసాగించేందుకు అవసరమయ్యే క్యాలరీల కంటే దాదాపు 577 కేలరీలు తక్కువ. సాసేజ్ రోల్స్, క్రిస్ప్స, బిస్కట్ల వంటి రుచికి బావుండి, ప్రొటీన్ తక్కువ, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు ఆల్కహాల్ తో పాటు తీసుకున్నవారి శరీరాల్లో సగటున 3051 క్యాలరీలు చేరాయి. అది వారికి అవసరమైన దానికంటే దాదాపు 813 క్యాలరీలు ఎక్కువ.
ఆల్కహాల్ వినియోగించే వారు ఎలాంటి ఆహారం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రొటీన్ రిచ్ ఫూడ్ తీసుకున్నపుడు వినియోగించే క్యాలరీలు ఎంత తక్కువ అవుతున్నాయి. వంటి వివరాలు తెలుసుకోవడానికి ఈ అధ్యయనం నిర్వహించామని యూనివర్సిటి ఆఫ్ సిడ్నీ కి చెందిన డాక్టర్ అమందా గ్రెచ్ ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఆల్కహాల్ ఎనర్జీ బూస్టింగ్ డ్రింక్ అనడంలో ఏం సందేహం లేదు. కానీ దీని వల్ల బరువు పెరుగుతారు అనడానికి పక్కా రుజువులు లేవనేది ఆమె అభిప్రాయం.
ఈ అధ్యయనం వారి ఆహార అలవాట్లను పరిగణనలోకి తీసుకొని నిర్వహించారు. 9341 మంది వ్యక్తులకు సంబంధించిన డాటాను ఆస్ట్రేలియన్ నేషనల్ న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ సర్వే వారు ఈ అధ్యయనానికి ఎంచుకున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పెరిగే ఆకలిని చల్లార్చుకోవడానికి మంచి ప్రొటీన్ కలిగిన ఆహారాన్ని ఎంచుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం దాదాపు ఉండదని డాక్టర్ గ్రెచ్ అంటున్నారు.
ఇక బీరు ప్రియులు బరువు పెరుగుతామని భయపడకుండా బీరు లాగించవచ్చన్న మాట. అయితే బీరుకు తోడుగా మంచింగ్‌కు.. శాకాహారులైతే ఏ పన్నీరు ముక్కలో, లేదా పల్లీలో, జీడిపప్పులో తినెయ్యాలని, మాంసాహారులైతే చికెన్ కబాబులో, చేప ముక్కలో తినాలని గుర్తుంచుకోండి. బీరుతో బిర్యానీ లాగిస్తే మాత్రం ప్రమాదమే మరి. బీరు బిర్యాని వద్దు, బీరుతో పన్నీరే ముద్దు. ఏమంటారు మరి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.