Ramzan And Haleem: రంజాన్ నెలలోనే హలీమ్‌ను తింటారు, ఎందుకు?
రంజాన్ నెల ప్రారంభమైందంటే హలీమ్ డేస్ వచ్చేసినట్టే.
ముస్లిం సోదరులకు అతి పెద్ద పండుగ రంజాన్ (Ramzan). ఈ రంజాన్ నెల మొదలైందంటే వారంతా ఉపవాస దీక్షలో ఉంటారు. వాడుక భాషలో అందరూ రంజాన్ అని పిలుస్తారు, కానీ దీని ‘రమదాన్’. ఇది ఒక నెల పేరు. ఈ పండుగనే ‘ఈద్ ఉల్ ఫిత్ర’ అని కూడా పిలుస్తారు. పవిత్ర దైవ గ్రంథమైన ఖురాన్ లో రమదాన్ నెలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో ముస్లిం సోదరులు చాలా భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు, దానధర్మాలు చేస్తుంటారు. ఇస్లామీయులు చాంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు. చాంద్రమాన క్యాలెండర్లో రమదాన్ అనేది తొమ్మిదవ నెల. ఇది ఇస్లామీయులకు అత్యంత పవిత్రమైనది. దీనికి కారణం వారు దైవంగా కొలిచే ‘ఖురాన్ గ్రంథం’ ఈ మాసంలోనే పుట్టిందని చెబుతారు. అందుకే ఈ మాసాన్ని ప్రతి ఏడాది చాలా పవిత్రంగా చూస్తారు. ఈనెల ముగిసే వరకు ఉపవాసం ఉంటారు. ఆ ఉపవాసాన్ని ‘రోజా’ అని పిలుస్తారు. ఈ నెలలో వారు తినే ఆహారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన ఆహారంలో భాగమే హలీమ్.
హలీమ్ ఎందుకు తింటారు?
రంజాన్ నెల మొదలవడంతోనే హలీమ్ డేస్ కూడా మొదలైపోతాయి. ముస్లింల కోసం ఎంతోమంది హలీమ్‌ను సిద్ధం చేస్తారు. రంజాన్ నెలలోని హలీమ్ రెడీ అవ్వడానికి కారణం ఏమిటి? దీనికి ఉపవాసానికి చాలా సంబంధం ఉంది. ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని గంటల పాటు నీరు కూడా ముట్టుకోరు ముస్లిం సోదరులు. అలాంటి వారికి శరీరానికి శక్తినిచ్చే ఆహారం అవసరం. హలీం తింటే ఒక పూట సంపూర్ణమైన భోజనం తిన్నట్టే. అందుకే హలీమ్‌ను ఉపవాస దీక్షలో ఉన్నవారు తినడానికి ఇష్టపడతారు. సుదీర్ఘ ఉపవాసం తర్వాత సత్వర శక్తినిచ్చే ఆహారం ఇది.
ఒక కప్పు హలీం తింటే ఒక పూట భోజనం చేసినట్టే అని చెప్పుకుంటారు. దీనిని తింటే రోజంతా శక్తిని అందిస్తుంది. ఇఫ్తార్ విందులో కచ్చితంగా హలీం ఉంటుంది. దీన్ని తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. 100 గ్రాముల హలీంలో ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్లు, ఐరన్, క్యాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఏ, డైటరీ, ఫైబర్, సోడియం, షుగర్ అన్నీ సమపాళ్లలో మన శరీరానికి సరిపడా ఉంటాయి. అందుకే దీన్ని తినడం వల్ల ఉపవాసాన్ని విజయవంతంగా ముగించవచ్చు. దీనిలో తాజా మాంసం, డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, పప్పు ధాన్యాలు, గోధుమ రవ్వ వంటివన్నీ వాడతారు. ఇవన్నీ కూడా మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించేవి.
మధ్యాహ్నం అయ్యే సరికి అన్నం, పప్పు, చారు, కూర, పెరుగులతో ఒక సంపూర్ణ ఆహారాన్ని ఎలా ముగిస్తామో అలా ఒక కప్పు హలీమ్‌ను తిన్నా కూడా అలాంటి సంపూర్ణ ఆహారాన్ని తిన్న ఫీలింగ్ వస్తుంది. శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. అందుకే రంజాన్ మాసంలోనే హలీం అధికంగా దొరుకుతుంది. కేవలం ముస్లిం సోదరులకే కాదు సాధారణ ప్రజలకు కూడా ఇప్పుడు హలీం చాలా ఫేవరెట్ వంటకం అయిపోయింది. ఇతర మతస్తులు కూడా రంజాన్ నెల ఎప్పుడు మొదలవుతుందా అని హలీం కోసం ఎదురుచూసే రోజులు వచ్చాయి. హలీంలోనూ...చికెన్ హలీం, మటన్ హలీం, వెజిటబుల్ హలీం రెడీ అవుతున్నాయి. వీటిలో మటన్ హలీం అధిక రుచిగా ఉంటుంది. దీనికి అభిమానులు ఎక్కువ.
Also read: ఈ సమస్యలు ఉన్నవారు సాయంత్రం టీ తాగే అలవాటును వదులుకోవాల్సిందే