Food Poisoning: ఫుడ్ పాయిజనింగ్‌ను ఎలా గుర్తించాలి? జాన్వీ కపూర్ పరిస్థితి మీకు రాకూడదంటే ఏం చెయ్యాలి? లక్షణాలు, నివారణ మార్గాలివే!
మన ఇరుగు పొరుగు వారి నుంచి తరచుగా వినిపించే మాట ఫుడ్ పాయిజనింగ్. ఇంతకీ ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? దాని నుంచి ఎలా ఉపశమనం పొందాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
What is Food Poisoning: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం ‘ఉలజ్’ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న ఆమె, తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కు గురైంది. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించారు. చెన్నైకి వెళ్లిన జాన్వీ కపూర్, ముంబైకి తిరిగి వస్తుండగా, విమానాశ్రయంలో ఫుడ్ తీసుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత జాన్వీ ఫుడ్ పాయిజనింగ్ కు గురైంది. వైద్యుల సూచనతో హాస్పిటల్ లో చేరింది. చికిత్స తర్వాత జాన్వీ పరిస్థితి మెరుగుపడటంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్ కాబోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇంతకీ ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏంటి?
ఫుడ్ పాయిజనింగ్ అనేది కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ఏర్పడుతుంది. కలుషిత పానీయాలు తీసుకోవడం వల్ల కూడా ఫుడ్ పాయిజనింగ్ కలుగుతుంది. చాలా సందర్భాల్లో ఫుడ్ పాయిజనింగ్ అనేది అంత ముప్పు కాదు. సాధారణంగా ట్రీట్మెంట్ లేకుండానే సమస్య పరిష్కారం అవుతుంది. కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంది. ఫుడ్ పాయిజనింగ్ ప్రభావం ఒక రోజు నుంచి వారం రోజుల వరకు పడుతుంది. ఫుడ్ పాయిజనింగ్ ఏర్పడినప్పుడు వికారం, వాంతులు, విరేచనాలు ఏర్పడుతాయి. ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం అంటూ ప్రత్యేకంగా ఉండదు. సరిగా ఉడకని ఫుడ్ తీసుకోవడంతో పాటు ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు శరీరంలోకి చేరడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలతో పాటు రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారిలో ఫుడ్ పాయిజనింగ్ ఏర్పడుతుంది.
ఫుడ్ పాయిజనింగ్ కు కారణాలు
ఫుడ్ పాయిజనింగ్ అనేది పలు రకాల వ్యాధికారక కారక క్రిముల వల్ల ఏర్పడుతుంది.
బాక్టీరియా: సాల్మోనెల్లా, ఇ.కోలి, లిస్టేరియా లాంటి క్రిములు ఆహారాన్ని విషంగా మార్చి ఫుడ్ ఫాయిజనింగ్ కు కారణం అవుతాయి.
వైరస్‌లు: నోరోవైరస్, హెపటైటిస్ A కూడా ఫుడ్ పాయిజనింగ్‌కి కారణం అవుతాయి.
పరాన్నజీవులు: గియార్డియా, టోక్సో ప్లాస్మా లాంటి పరాన్నజీవులు కూడా ఆహారాన్ని కలుషితం చేసి ఫుడ్ పాయిజనింగ్ కు కారణం అవుతాయి.
టాక్సిన్స్: కొన్ని ఆహారాలలో స్టెఫిలోకాకస్ ఆరియస్, బాసిల్లస్ సెరియస్ నుంచి వచ్చే టాక్సిన్స్ కారణంగా ఫుడ్ పాయిజనింగ్ ఏర్పడుతుంది.
ఫుడ్ పాయిజనింగ్ కు లక్షణాలు
1. వికారం, వాంతులు
2. అతిసారం
3. కడుపులో నొప్పి
4. జ్వరం
5. అలసట, బలహీనత
6. తలనొప్పి
ఫుడ్ పాయిజనింగ్ కు హోం రెమెడీస్
హైడ్రేటెడ్ గా ఉండాలి: వాంతులు, విరేచనాలతో కలిగే డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. తాగు నీరులో చక్కెర, ఉప్పు కలిగి తాగాలి. ఓఆర్ఎస్ లు తాగడం వల్ల హైడ్రేటెడ్ గా మారవచ్చు. కొబ్బరి నీళ్లు, దాల్చిన చెక్క పొడి కలిపిన నీరు తాగాలి.
విశ్రాంతి: ఫుడ్ పాయిజనింగ్ నుంచి బయటపడేందుకు వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలి.
BRAT డైట్: BRAT డైట్ (అరటిపండ్లు, అన్నం, యాపిల్‌సాస్, టోస్ట్) డైట్ తీసుకోవాలి. ఫుడ్ పాయిజన్ నుంచి ఈజీగా బయటపడేలా చేస్తుంది.
అల్లం: అల్లం టీ, లేదంటే అల్లం కషాయం కడుపును కూల్ చేస్తుంది. గోరు వెచ్చని నీటిలో అల్లం కషాయం, తేనె కలిపి తాగడం వల్ల వికారం, వాంతుల నుంచి కాపాడుకోవచ్చు.
యాపిల్ సైడర్ వెనిగర్: ఆపిల్ జ్యూస్ నుంచి తయారు చేసే ఆపిల్ సైడర్ వెనిగర్ ద్రావణం ఆల్కలీన్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. యాపిల్ సైడర్ వెనిగర్ బ్యాక్టీరియాను చంపి, పొట్టకు ఉపశమనం కలిగిస్తుంది.
పెరుగు: పెరుగు లేదంటే ప్రోబయోటిక్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఫుడ్ పాయిజనింగ్ నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది.
ఫుడ్ పాయిజనింగ్ రాకూడదంటే?
1. భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడగాలి. వంట చేసే పాత్రలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
2. ఆహార పదార్థాలు చక్కగా ఉడికించి తినాలి.
3. చెడిపోయిన ఆహారపదార్థాలను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు.
4. పచ్చి, తక్కువగా వండిన మాంసం, గుడ్లు, సీఫుడ్స్ తినకూడదు.
5. అపరిశుభ్ర ఆహారాలను, పానీయాలకు దూరంగా ఉండాలి.