Heart Disease : ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ గుండె పదిలంగా ఉంటుంది
Healthy Heart : జీవనశైలిలో కొన్ని మార్పులు చేస్తే మీ ఆరోగ్యంతో పాటు గుండె కూడా పదిలంగా ఉంటుంది. ఇంతకీ ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Tips For Healthy Heart : గుండె జబ్బులు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. మారుతున్న జీవనశైలి, స్ట్రెస్, అనారోగ్యకరమైన అలవాట్లు గుండె సమస్యలను పెంచుతున్నాయి. అందువల్ల చిన్నవయసులోనే చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. ఒకప్పుడు గుండెనొప్పి అంటే వయసు పైబడిన వారికి వస్తుందేమో అనుకునేవాళ్లం. కానీ టీనేజ్‌లో ఉన్నవాళ్లు కూడా గుండెనొప్పితో మరణిస్తున్నారు. అందుకే మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇది కేవలం గుండె సంరక్షణకే కాకుండా.. మీ మొత్తం ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది.
ఆహారంలో
ఆరోగ్యంగా ఉండడంలో ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. సమతుల్యమైన ఆహారం గుండె వ్యాధులను దూరం చేస్తుందని మీకు తెలుసా? వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు ఆరోగ్యానికి మంచివి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయడానికి సంతృప్త, ట్రాన్స్ కొవ్వులను తగ్గించండి. చేపలు, అవిసెగింజలు, వాల్నట్లలోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి మంచివి.
వ్యాయామం
శారీరక శ్రమ లేకపోవడం గుండె సమస్యలకు ప్రధాన కారణం. కాబ్టటి మీ గుండెను కాపాడుకోవడానికి రెగ్యూలర్‌గా వ్యాయామాలు చేయండి. ఏరోబిక్, డ్యాన్స్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాపకాలను మీ రోటీన్లో చేర్చుకోండి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అయితే మంచిది కదా అని వ్యాయామాలు ఎక్కువగా చేయడం కూడా అంత మంచిది కాదు.
బరువు
బరువు ఎక్కువగా ఉండడం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం బరువును కంట్రోల్ చేసుకోవాలి. అధిక బరువు గుండె జబ్బులను పెంచుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన బరువు కోసం క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ.. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.
కొలెస్ట్రాల్
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువైతే.. గుండెకు ప్రమాదం ఎక్కువ అవుతుంది. కొలెస్ట్రాల్ అనేది కేవలం బరువు ఎక్కువ ఉన్నవారికే ఉంటుంది అనుకుంటే పొరపాటే. సన్నగా ఉండేవారిలో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు వైద్యుల సలహా తీసుకోండి. వారు సూచించిన మందులు, డైట్ ఫాలో అవ్వండి. రెగ్యూలర్ చెకప్స్ చేయించుకుంటే ప్రమాద కారకాలను ముందుగానే గుర్తించవచ్చు.
ఒత్తిడి
మనకి సగం పైగా జబ్బులు ఒత్తిడి వల్లే వస్తున్నాయని మీకు తెలుసా? గుండె సమస్యలను పెంచడంలో కూడా ఒత్తిడి ప్రమేయం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని తగ్గించుకునేందుకు మీరు ధ్యానం, యోగా, డీప్ బ్రీత్ వ్యాయామాలు చేయొచ్చు. ఇవి మీలో ఒత్తిడిని తగ్గించి.. పాజిటివ్ థింకింగ్ పెంచుతాయి. లేదంటే మీకు ఇష్టమైన పాటలు వినొచ్చు. ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడపవచ్చు. మీరు ఎంత ఒత్తిడి తగ్గించుకుంటే మీ ఆరోగ్యం అంత మంచిగా ఉంటుంది. గుండె పదిలంగా ఉంటుంది.
స్మోకింగ్, డ్రింకింగ్
ధూమపానం గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం. ఇది రక్తనాళాలను దెబ్బతీసి.. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి ధూమపానం మానేస్తే ఆరోగ్యానికి మంచిది. మితమైన ఆల్కహాల్‌తో మంచి ప్రయోజనాలు ఉండొచ్చు కానీ.. అధిక మధ్యపానం అధిక రక్తపోటు, గుండె వైఫల్యం వంటి సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి మధ్యాన్ని అమితంగా కాకుండా మితంగా తీసుకోండి. పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది.
Also Read : బరువు తగ్గాలనుకుంటే పాలు తాగండి.. కానీ ఇవి ఫాలో అవ్వండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.