Azerbaijan Travel Guide : ఇంటర్నేషనల్ ట్రిప్‌కోసం అజర్‌బైజాన్ బెస్ట్.. 5 రోజుల ప్రణాళికతో ఇలా ఎక్స్ప్లోర్ చేయండి
Azerbaijan : ఇయర్ ఎండ్ లేదా 2026లో ఇంటర్నేషనల్ ట్రిప్‌కి వెళ్లాలనుకుంటే అజర్‌బైజాన్ దేశం బెస్ట్. ఇక్కడ 5 రోజుల ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకుంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీ సొంతమవుతుందో చూసేద్దాం.

Azerbaijan 5 Days Trip Plan : ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే పురాతన చరిత్ర, ఆధునిక వాస్తుశిల్పం, సహజ సౌందర్యంతో నిండి ఉంటాయి. అలాంటి వాటిలో అజర్‌బైజాన్ ఒకటి. ఈ దేశం వారసత్వ సంపదతో పాటు సమకాలీన ఆకర్షణలు అందిస్తుంది. ఫ్లేమ్ టవర్స్ నుంచి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. వందల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలు చూడవచ్చు. అద్భుతమైన ప్రదేశాలు, ఆహారం, విశ్రాంతి, నూతన ఉత్తేజం ఆస్వాదించాలంటే.. ఈసారి అజర్‌బైజాన్ చూడాల్సిందే. 5 రోజుల ట్రిప్ ప్లానింగ్ ఉంటే.. ఈ దేశాన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయవచ్చో.. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే అంశాలు ఏంటో చూసేద్దాం.
Day - 1 : నగర విహార యాత్ర
అజర్‌బైజాన్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్‌కు వెళ్లండి. రెస్ట్ తీసుకుని సాయంత్రం నగర పర్యటన చేస్తే బెస్ట్. బకూలో అల్లే ఆఫ్ మార్టిర్స్, నేషనల్ అసెంబ్లీ (మిల్లి మజ్లిస్), బకూ స్కైలైన్, ఫ్లేమ్ టవర్స్ చూడవచ్చు. ఈ ఎత్తైన ప్రదేశం నుంచి నగరం అత్యంత అందంగా కనిపిస్తుంది. కాస్పియన్ సముద్రం ఒకవైపు, ఆధునిక స్కై షోలు మరోవైపు జరుగుతూ ఉంటాయి. ఈ పర్యటన తర్వాత రాత్రి విశ్రాంతి కోసం హోటల్‌కు వెళ్లిపోండి.
Day - 2 : అర్బన్ ఎక్స్‌ప్లోరేషన్ టూర్
అజర్‌బైజాన్ సంస్కృతి, చరిత్రను అన్వేషించాలనుకుంటే.. మీ రోజును రుచికరమైన అల్పాహారంతో ప్రారంభించండి. తర్వాత టూర్లో భాగంగా బకూలోని ఇచెరి షెహెర్ (పాత నగరం)కి వెళ్లండి. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటి. నగరంలో అత్యంత పురాతన పట్టణ ప్రాంతం. ఎత్తైన గోడల శ్రేణి ఇప్పటికీ దృఢంగా మంచి స్థితిలో ఉన్నాయి. షిర్వాన్షా ప్యాలెస్, 'మెయిడెన్ టవర్' (గిజ్ గలాసి) వంటి మధ్యయుగ నిర్మాణాలు కనిపిస్తాయి.
ఆ తర్వాత బకూలోని తాజా ఆధునిక భవనాలకు వెళ్లండి. ఇక్కడ అవార్డు-విజేత హైదర్ అలియేవ్ సెంటర్ కూడా ఉంది. నగరంలో అత్యధికంగా ఫోటోలు తీసిన భవనాలలో ఇది ఒకటి. ఈ నిర్మాణం వాస్తుశిల్ప రూపకల్పనలో తాజాదనాన్ని సూచిస్తుంది. పాత, కొత్త కలయిక అజర్‌బైజాన్ సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబిస్తుంది.
Day - 3 : అటెష్‌గా, యనార్ డాగ్, గంజ్లిక్ మాల్‌లో షాపింగ్
అగ్ని దేవాలయమైన అటెష్‌గా విజిట్ చేయండి. ఈ టెంపుల్ 1700-1800లలో హిందూ, జొరాస్ట్రియన్ మతాలకు ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రంగా నిర్మించారు. ఇది పంచకోణ నిర్మాణం. దేవాలయంలోని కాలాతీత మంటలు, వాటి చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం ఈ ప్రదేశాన్ని అజర్‌బైజాన్‌లోని అత్యంత ఆసక్తికరమైన వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా చేసింది.
తర్వాత ప్రయాణం యనార్ డాగ్ (బర్నింగ్ మౌంటెన్). ఇక్కడ మీరు అరుదైన దృశ్యాలు చూస్తారు. ఎందుకంటే ఇక్కడ సహజ వాయువు స్వయంచాలకంగా మండుతుంది. పర్వతాల వాలుపై నిరంతర మంటలు ఉంటాయి. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న పురాణాలు పర్వతం వలె పురాతనమైనవి.
రోజును ముగించేప్పుడు బకూలోని అతిపెద్ద మాల్ అయిన గంజ్లిక్ మాల్‌కు వెళ్లండి. ఇక్కడ 80కి పైగా రిటైల్ దుకాణాలు, అనేక సినిమా థియేటర్లు, బౌలింగ్ అల్లే, వివిధ రకాల రెస్టారెంట్లతో నిండి ఉంటుంది. ఇలా మూడో రోజు ముగించవచ్చు.
Day - 4 : గోబుస్తాన్ టూర్
గోబుస్తాన్ నేషనల్ పార్క్‌లో మీ రోజును ప్రారంభించండి. ఇది వేలాది పురావస్తు రాతి చెక్కడాలు, చిత్రలేఖనాలకు నిలయం. క్రీ.పూ. 8000 నాటి రాళ్లతో నిండిన ఈ పురావస్తు ప్రదేశం 2007లో ఐక్యరాజ్యసమితిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. గోబుస్తాన్ తర్వాత.. అదే ప్రాంతంలో ఉన్న మడ్ అగ్నిపర్వతాలను సందర్శించండి. ప్రపంచంలోని మడ్ అగ్నిపర్వతాలలో సుమారు 50% అజర్‌బైజాన్‌లో ఉన్నాయి. అవి ఎలా పనిచేస్తాయో చూస్తే నిజంగా షాక్ అవుతారు.
Day - 5 : షాపింగ్, సంస్కృతి, డిజెర్ట్స్
మీ చివరి రోజును ఇంటరాక్టివ్ సెన్సరీ అనుభవంతో నింపుకోండి. ఇక్కడ అత్యంత ప్రజాదరణ పొందిన డెజర్ట్ అయిన బక్లావాను తినండి. ప్రతి ప్రాంతానికి దాని స్వంత వెర్షన్ ఉంటుంది. విభిన్న పదార్థాలతో తయారు చేసే ఈ డిజెర్ట్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. కుంకుమపువ్వు, నట్స్, యాలకులు, తేనె వంటి అత్యంత సాధారణంగా ఉపయోగించే వాటితో దీనిని తయారు చేస్తారు. అంతేకాకుండా కొన్ని అద్భుతమైన సాంప్రదాయ వంటకాలు ట్రై చేయవచ్చు.
షాపింగ్ చేయడానికి ఉత్తమమైన ప్రదేశాలలో నిజామి స్ట్రీట్ ఒకటి. ఇది బోటిక్‌లు, కాఫీ షాపులు, అందమైన యూరోపియన్-శైలి వాస్తుశిల్పంతో నిండి ఉంది. మీరు హై-ఎండ్ బ్రాండ్‌ల నుంచి హ్యాండ్ క్రాఫ్ట్స్ వరకు ప్రతిదీ ఇక్కడ చూస్తారు. తర్వాత ఫౌంటెన్స్ స్క్వేర్‌కు వెళ్లండి. ఇది ఒక శక్తివంతమైన స్థలం. బకూలోని అత్యంత ప్రజాదరణ పొందిన ప్రదేశాలలో ఒకటి. చివరి నిమిషంలో కాఫీ తాగడానికి లేదా నగర వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఇది గొప్ప ప్రదేశం. అజర్‌బైజాన్‌లో మీ చివరి రాత్రిని గడపడానికి హోటల్‌కు వెళ్లిపోండి. ఇలా మీరు 5 రోజుల ట్రిప్ ప్లాన్ చేసుకోండి. అజర్‌బైజాన్‌ను పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లాన్.






















