Oral Cancer: షాకింగ్, ఇండియాలో నోటి క్యాన్సర్‌కు ప్రధాన సమస్య ఇదేనట!
పురుషుల్లో క్యాన్సర్ అవకాశాలు తక్కువే. కానీ, కొన్ని చెడు అలవాట్లతో డబ్బులిచ్చి మరీ ‘క్యాన్సర్’ను కొనితెచ్చుకుంటున్నారు. వాటిలో ఇది ప్రధానమైనది.
క్యాన్సర్ జీవితాన్ని చిధ్రం చేస్తుంది. ముందుగా గుర్తిస్తే.. చికిత్స ఉంటుంది. ఆలస్యమైతే మాత్రం ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవల్సిందే. అది ఎలాంటి క్యాన్సరైనే సరే.. నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. అది మానసికంగానే కాదు, ఆర్థికంగా కూడా కుంగదీస్తుంది. అయితే, కొందరు తమ అలవాట్ల వల్ల క్యాన్సర్ వస్తుందని తెలిసినా సరే.. వెనక్కి తగ్గరు. పరిస్థితి చేయిదాటిపోయిన తర్వాత కుమిలిపోతారు. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మన దేశంలో అత్యధిక ప్రజలు నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, వాటికి కారణం పొగాకు ఉత్పత్తులేనని వెల్లడించారు.
పురుషుల్లోనే అధికం: పాట్నాలోని AIIMSలో రేడియేషన్ ఆంకాలజీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అభిషేక్ శంకర్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఇండియాలో అత్యధిక పురుషులు నోటి క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది ప్రధానంగా పొగలేని పొగాకు వాడకం వల్లే ఏర్పడుతుంది. మన దేశంలో మొత్తం పొగాకు ఉత్పత్తుల్లో సిగరెట్లు 5 శాతం, బీడీ 10 శాతం, పొగలేని పొగాకు 85 శాతం వరకు వినియోగంలో ఉన్నాయి’’ అని తెలిపారు.
పొగాకు నమలడం మరింత ప్రమాదకరం: ‘‘చాలామంది సిగరెట్లు తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని భావిస్తున్నారు. పొగాకు నమలడం అంతకంటే ప్రమాదకరమైనదనే విషయాన్ని విస్మరిస్తున్నారు. ఇండియాలో నోటి క్యాన్సర్లు అదుపులోకి రావాలంటే.. పొగాకు ఉత్పత్తుల నివారణ ఒక్కటే మార్గం’’ అని వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణంకాల ప్రకారం.. పొగాకు ప్రతి సంవత్సరం 8 మిలియన్ల మంది ప్రాణాలు తీసుకుంటోంది. వీటిలో 7 మిలియన్లకు పైగా మరణాలు ప్రత్యక్షంగా పొగాకు వాడకం వల్ల చోటుచేసుకున్నాయి. చిత్రం ఏమిటంటే.. వీరిలో 1.2 మిలియన్ల మంది పొగ తాగకుండానే దాని ప్రభావానికి లోనై చనిపోయారు. అంటే, పొగాకు పొగ తాగేవారికే కాదు, పీల్చేవారికి కూడా ప్రమాదమే.
జీవితానికి ‘పొగ’ పెట్టొద్దు: పొగాకు ఉత్పత్తులు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో పొగాకు అనేక రూపాల్లో లభిస్తోంది. సిగరెట్లు, బీడీలు, గుట్కా, ఖైనీ, అరేకా (బీటల్ క్విడ్) తినేవారు ఎక్కువగా నోటి క్యాన్సర్లకు గురవ్వుతున్నారు. మద్యం సేవించేవారు ఇతరాత్ర క్యాన్సర్లతో బాధపడుతున్నారు. పొగాకు వల్ల నోటిలో ఏ ప్రాంతమైనా ప్రభావితం కావచ్చు. నోటి కింది భాగం, పై భాగం లేదా పెదాలు, నాలుక, చిగుళ్లు, బుగ్గలు ఇలా ఎక్కడైనా క్యాన్సర్ ఏర్పడవచ్చు. నోటి క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే చికిత్స చేయొచ్చు. ముదిరితే మాత్రం పూర్తిగా నోటినే తొలగిస్తారు. కాబట్టి, ఇప్పటికైనా ఈ అలవాటు నుంచి బయటపడండి. వీలైతే డాక్టర్‌ను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోండి.
Also Read: కక్కుర్తి పడితే ఇంతే, ఆ ఫుడ్ కోసం తమ పేర్లను ఫన్నీగా మార్చుకున్న జనం, షాకిచ్చిన ప్రభుత్వం
Also Read: నా భార్య రోజూ మ్యాగీ పెట్టి చంపేస్తోంది - కోర్టుకు భర్త మొర, చివరికి..
గమనిక: వివిధ హెల్త్ ఆర్టికల్స్, అధ్యయనాలు, నిపుణులు తెలిపిన వివరాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదు.