Corona Virus: మళ్లీ పుట్టుకొచ్చిన రెండు కొత్త కోవిడ్ వేరియంట్లు, పలు దేశాల్లో బయటపడుతున్న కేసులు, అవి ప్రాణాంతకమే అంటున్న నిపుణులు
Corona Virus: కోవిడ్ కథ ముగిసిందని అనుకునేలోపే మరో రెండు కొత్త వేరియంట్లను కనుగొన్నారు.
Corona Virus: కరోనా ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టి మూడున్నరేళ్లు దాటేస్తోంది. ఇక దీనితో ప్రమాదం లేదు, అన్ని దేశాలు తేరుకున్నాయనుకున్న సమయంలో మరో రెండు కొత్త వేరియంట్లను కనుగొన్నారు చైనాలో. ఇప్పుడక్కడ ఈ రెండు కరోనా రకాల కారణంగా చాలా మంది వైరస్ బారిన పడుతున్నట్టు కనుగొన్నారు. మొదట ఆ దేశంలోనే ఈ కొత్త కరోనా రకాలు బయటపడ్డాయి. వాటికి BF.7, BA.5.1.7 అని పేర్లు పెట్టారు. ఇవి ఒమిక్రాన్ వేరియంట్లుగా గుర్తించారు. చైనాలోని ఇన్నర్ మంగోలియా, అటానమస్ రీజియన్లలో వీటిని తొలిసారి గుర్తించారు.
శరవేగంగా వ్యాపిస్తూ...
చైనా మీడియా చెబుతున్న దాని ప్రకారం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన BF.7 మన రోగనిరోధక శక్తిపై చాలా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అంటే మన వ్యాక్సిన్ల ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తిని కూడా తట్టుకుని శరీరంలో చేరగలుగుతోంది. అందుకే ఇది వస్తే ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.ఈ సబ్ వేరియంట్ ప్రస్తుతం చైనాతో పాటూ బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్, ఇంగ్లాండ్ దేశాల్లోనూ వ్యాపిస్తోంది. త్వరలో మనదేశానికి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ప్రపంచంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాపిస్తోందని ఈ మధ్యనే ప్రకటించింది. ఏడాదిగా ఒమిక్రాన్ రూపాంతరాలు చెందుతూ వ్యాపిస్తూ వచ్చింది. ఇప్పుడు దాని కొత్త వేరియంట్లు రావడం కాస్త కలవరానికి గురిచేస్తున్నాయి. కొత్త వేరియంట్ అయిన BF.7 చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు కలిగి ఉందని చెబుతున్నారు నిపుణులు. అమెరికాలో ఇది సోకిన వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. చైనాలో ప్రస్తుతం 1,700 కన్నా ఎక్కువ మందికి ఈ కొత్త వేరియంట్ సోకినట్టు గుర్తించారు.
అందుకే కరోనా అంతం అయిపోయిందని భావిస్తున్న చాలా మందికి ఈ కొత్త వేరియంట్ సవాలు విసురుతోంది. అందరూ ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని చెబుతోంది. ఆహారం విషయంలో కూడా రోగనిరోధక శక్తిని పెంచే వాటిని ఏరికోరి తినమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే అందరూ బూస్టర్ డోస్ కూడా వేసుకోవడం ఉత్తమం. రెండు డోసుల తరువాత మూడో డోసుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదు. కానీ ఈ పరిస్థితుల్లో బూస్టర్ డోసు వేసుకుంటే మంచిది.
Also read: వాదనలో గెలిచేందుకు టాప్ టెన్ మానిప్యులేటివ్ ట్రిక్స్ ఇవే, వాడి చూడండి మీరే విజేత
Also read: మీ ఆడబిడ్డని ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు ఇవే, వీటిని కచ్చితంగా తినిపించాలి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.