Spoiled Eggs : ఎగ్ తింటే కాలేయంలో చీము వస్తోందా? చెడిపోయిన గుడ్డును ఎలా గుర్తించాలో తెలుసా?
Egg Side Effects : చెడిపోయిన గుడ్లు ఆరోగ్యానికి హానికరమని కొన్నిసార్లు ప్రాణాంతకమవుతుందని చెప్తున్నారు నిపుణులు. అయితే చెడిపోయిన గుడ్లు ఎలా గుర్తించాలో ఇప్పుడు చూసేద్దాం.

Spoiled Eggs Can Lead to Liver Abscess : చలికాలంలో గుడ్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య రీత్యా, ఈజీగా ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చనే నేపథ్యంలో ఎక్కువమంది గుడ్డు వినియోగిస్తారు. గుడ్డు ప్రోటీన్కు మంచి మూలం. దీనిని ఆహారంలో అనేక విధాలుగా తీసుకోవచ్చు. కానీ గుడ్లు చెడిపోయినా లేదా కుళ్లిపోయినా అది మీ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది. చెడిపోయిన గుడ్లు తినడం వల్ల కాలేయంలో చీము వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి ప్రధానంగా పురుషులలో కనిపిస్తుందట. ఈ సమస్యకు సకాలంలో చికిత్స అందించకపోతే ప్రాణాంతకం అవుతుందని చెప్తున్నారు. కాబట్టి గుడ్డు తినే ముందు మంచిదా లేదా చెడ్డదా అని చెక్ చేసుకోవాలంటున్నారు. అయితే గుడ్డును ఎలా తనిఖీ చేయాలో.. చెడిపోయిన గుడ్డు తినడం వల్ల కాలేయంలో చీము సమస్య ఎలా వస్తుందో తెలుసుకుందాం.
గుడ్డుతో కాలేయ సమస్య
చెడిపోయిన గుడ్డు తినడం వల్ల కాలేయంలో చీము గడ్డ ఏర్పడుతుంది. ఈ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా, పరాన్నజీవి లేదా శిలీంధ్రాల వల్ల వస్తుంది. చెడిపోయిన గుడ్లు తినడం వల్ల సాల్మొనెల్లా లేదా ఎంటమీబా వంటి బ్యాక్టీరియా కడుపులో పెరుగుతాయి. ఇది కడుపులో ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. తరువాత రక్తం ద్వారా కాలేయానికి చేరుకుని అక్కడ చీమును పేరుస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఈ ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. కాలేయానికి ప్రమాదకరమైన నష్టం కలిగిస్తుంది. సమయానికి చికిత్స చేయకపోతే కాలేయంలో ఏర్పడిన గడ్డ పగిలిపోయి ఇన్ఫెక్షన్ మొత్తం శరీరానికి వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని సెప్సిస్ అంటారు. ఇది మరణ ప్రమాదాన్ని 10 నుంచి 20 శాతం వరకు పెంచుతుంది. అయితే సకాలంలో రోగ నిర్ధారణ చేసి.. చికిత్స అందిస్తే 90 శాతం మంది రోగులు నయం అవుతారు.
గుడ్డు చెడిపోయిందా లేదా ఇలా తెలుసుకోండి
వాసన చూడటం ద్వారా : గుడ్డు చెడిపోయిందా లేదా అని వాసన చూడటం ద్వారా తెలుసుకోవచ్చు. చెడిపోయిన గుడ్డు కుళ్ళిన లేదా సల్ఫర్ వంటి వాసన వస్తుంది. అయితే మంచి గుడ్డు నుండి ఎలాంటి వాసన రాదు.
నీటిలో వేసి : గుడ్డును నీటిలో వేయడం ద్వారా కూడా అది చెడిపోయిందా లేదా అని తెలుసుకోవచ్చు. నీటిలో వేసినప్పుడు గుడ్డు కిందకు మునిగితే అది తాజాగా ఉన్నట్లు.. తేలియాడితే గుడ్డు చెడిపోయినట్లు అర్థం చేసుకోవాలి.
చూసినప్పుడు : తాజాగా ఉన్న గుడ్డు పెంకు శుభ్రంగా, పగుళ్లు లేకుండా ఉంటుంది. పెంకుపై పొడి లేదా శిలీంధ్రాలు కనిపిస్తే లేదా జిగటగా ఉంటే ఆ గుడ్డు చెడిపోయిందని అర్థం చేసుకోవాలి .
పగలగొట్టి : గుడ్డును పగలగొట్టడం ద్వారా కూడా అది చెడిపోయిందా లేదా అని తెలుసుకోవచ్చు. వాస్తవానికి తాజాగా ఉన్న గుడ్డులోని తెల్లసొన స్పష్టంగా మరియు పచ్చసొన గుండ్రంగా ఉంటుంది. చెడిపోయిన గుడ్డు రంగు మారినట్లు లేదా పచ్చసొన చెల్లాచెదురుగా ఉంటుంది.
గడువు తేదీని చూడండి : గుడ్డు చెడిపోయిందా లేదా అని దాని గడువు తేదీని చూడటం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఎప్పుడూ ప్యాక్ చేసిన తేదీ నుంచి నాలుగు నుంచి ఐదు వారాలలోపు గుడ్డును ఉపయోగించడానికి ప్రయత్నించండి.






















