Kidney Disease : కిడ్నీ వ్యాధి లక్షణాలు, సంకేతాలు విస్మరించవద్దు.. మూత్రంలో నురుగు నుంచి శ్వాస ఆడకపోవడం వరకు
Early Kidney Diseases : మూత్రంలో నురుగు, రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనా ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఇవి నార్మల్ అస్సలు కాదు. కిడ్నీలు హెచ్చరికలు. వీటిని ఎలా గుర్తించి జాగ్రత్త తీసుకోవాలంటే..

Silent Signs of Kidney Disease : మూత్రంలో నురుగు కనిపిస్తే అది సాధారణ విషయం కాకపోవచ్చు కానీ.. మూత్రవిసర్జన తర్వాత నీళ్లు పోస్తే నురుగు దానంతట అదే పోవాలి. అలా పోకుండా నురుగు అలాగే ఉంటే.. అది మూత్రంలో ప్రోటీన్ లీక్ అవ్వడానికి (ప్రోటీన్యూరియా) సంకేతం కావచ్చు. అలాగే తగినంత నీరు తాగినా మూత్రం తక్కువగా వస్తుంటే.. కిడ్నీలు సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోతున్నాయని అర్థం. పగటిపూట ఎక్కువగా మూత్రవిసర్జన చేయడం కూడా కిడ్నీ వ్యాధి లక్షణం కావచ్చు. ఇలాంటి సమస్యలని చిన్నవే, నార్మలే అనుకుని పట్టించుకోకపోవడం వల్ల కిడ్నీ సమస్యలు పెరిగి ప్రాణంతకమవుతాయంటున్నారు నిపుణులు.
రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనకు లేవడం
ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీలో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్గా చేస్తోన్న డాక్టర్ నవీన్ రెడ్డి అవుల ప్రకారం.. రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనకు లేవడం అస్సలు సాధారణం కాదట. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాలి అంటున్నారు. అదేవిధంగా మూత్రంలో రక్తం రావడం కిడ్నీ స్టోన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్ లేదా మూత్ర మార్గం, కిడ్నీలకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చని చెప్తున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు.
శరీరం మొత్తం నిరంతరం దురదగా ఉంటే అది యూరిమియాకు సంకేతం కావచ్చు. రక్తంలో యూరియా, ఇతర వ్యర్థ పదార్థాలు పెరిగినప్పుడు యూరిమియా పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి దురదను తేలికగా తీసుకోకూడదు. దీంతో పాటు ఎక్కువ శ్రమ లేకుండా నడిచేటప్పుడు ఆయాసం రావడం లేదా మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది పడటం కూడా కిడ్నీ సమస్యతో ముడిపడి ఉండవచ్చు. శరీరంలో అదనపు నీరు చేరడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడి పడి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. చాలాసార్లు తినే ఆహార పదార్థాల రుచి వింతగా లేదా లోహపు రుచిలా అనిపిస్తుంది. లేదంటే నోటి నుంచి నిరంతరం దుర్వాసన రావచ్చు. రుచిలో ఇలాంటి మార్పు కూడా కిడ్నీ వ్యాధికి సంకేతం కావచ్చు. దీనిని తేలికగా తీసుకోకూడదని చెప్తున్నారు నవీన్.
కిడ్నీ వ్యాధులను ఎలా నివారించవచ్చు?
కిడ్నీ వ్యాధులను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది చికిత్స, తదుపరి పరిస్థితి రెండింటినీ మెరుగుపరుస్తుంది. శుభవార్త ఏమిటంటే.. కిడ్నీలను కొన్ని సులభమైన పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. అవేంటంటే..
- రక్త పరీక్ష (సీరం క్రియేటినిన్)
- మూత్ర పరీక్ష (యూరిన్ అనాలిసిస్, ఆల్బుమిన్-టు-క్రియేటినిన్ రేషియో)
కొంతమంది క్రమం తప్పకుండా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. వీరిలో డయాబెటిస్ ఉన్నవారు, అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు, కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ వ్యాధి ఉన్నవారు, లేదా ఎక్కువ కాలం పాటు నొప్పి నివారణ మందులు లేదా కొన్ని ప్రత్యేక మందులను ఎక్కువగా వాడినవారు కచ్చితంగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం వీరికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగా టెస్ట్లు చేయించుకుని.. సమస్యను గుర్తిస్తే.. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















