ABP Desam Health Conclave 2025 : రాత్రి మంచిగా నిద్రపోవాలంటే ఫాలో అవ్వాల్సిన గోల్డెన్ రూల్స్.. ఏబీపీ హెల్త్ కాన్క్లేవ్లో డాక్టర్ హర్షిణి ఎర్రబెల్లి
Dr Harshini Errabelli Speech : రాత్రి నిద్ర కనీసం 6 గంటలు కూడా ఉండట్లేదా? మరి మంచి నిద్రకోసం చేయాల్సిన మార్పులు ఏంటి? వంటి విషయాలపై డాక్టర్ హర్షిణి ఏబీపీ హెల్త్ కాన్క్లేవ్లో వివరించారు.

Dr Harshini Errabelli About Good Principles of Sleep : ఈ మధ్యకాలంలో చాలామంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. కనీస నిద్ర 6 గంటలు కూడా ఉండట్లేదు. స్లీపింగ్ను ట్రాక్ చేసేందు యాప్స్ వాడుతున్నారు. అసలు నిద్రను దూరం చేసే అంశాలు ఏంటి? మళ్లీ మెరుగైన నిద్రను పొందేందుకు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో వివరించారు డాక్టర్ హర్షిణి ఎర్రబెల్లి. ABP Desam Health Conclave 2025లో పాల్గొన్న హర్షిణి నిద్ర, గురక వంటి అంశాలపై ఎన్నో ఇన్పుట్స్ ఇచ్చారు.
నిద్రకోసం గోల్డెన్ రూల్స్
చాలామంది నిద్ర కోసం.. మంచి సూత్రాలను పాటించరని అది తప్పని తెలిపారు హర్షిణి. కానీ మంచి నిద్ర కావాలనుకున్నవారు కచ్చితంగా కొన్ని గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వాలని అంటున్నారు. " రాత్రి నిద్రకోసం ఉదయాన్నే ఓ రూల్ ఫాలో అవ్వాలి. నిద్ర అనేది రాత్రి గురించి కదా పగలు ఫాలో అయ్యేది ఏంటి అనుకుంటున్నారా? కానీ నిద్రకోసం ఫాలో అవ్వాల్సిన ప్రధాన సూత్రం ఉదయం ప్రారంభమవుతుంది. అదేంటంటే నిద్రలేచిన తర్వాత 10 నుంచి 15 నిమిషాలు సూర్యకాంతి ఉండేలా చూసుకోవాలి. పదిలోపే ఈ ప్రక్రియ పూర్తి అవ్వాలి. ఇలా చేయడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మధ్యాహ్నానికి కాస్త పెంచి.. రాత్రికి మరింత పెంచి నిద్రను ప్రేరేపిస్తుంది." అని తెలిపారు.
సెకండ్ రూల్ ఏంటి అంటే..
" ఒత్తిడిని తగ్గించుకునేందుకు బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. విశ్రాంతిని ప్రేరేపించే టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. సగం నిద్ర సమస్యలకు ఒత్తిడే ప్రధాన కారణంగా మారుతుంది కాబట్టి దానిని కంట్రోల్ చేసుకోవాలి. మూడో రూల్ కచ్చితంగా డైట్. అలాగే డిన్నర్‌ను నిద్రకు గంట నుంచి రెండు గంటల ముందే ముగించేయాలి. ఎందుకంటే మీ జీర్ణవ్యవస్థ కూడా కాస్త ముందుగా పని ముగించుకోగలిగితే అది కూడా రిలాక్స్ అయ్యే సమయం దొరుకుతుంది." అని సూచించారు హర్షిణి.
అతి ముఖ్యమైన రూల్
రాత్రి మంచి నిద్ర కావాలనుకున్నవారు ఫాలో అవ్వాల్సిన గోల్డ్ రూల్‌లో అతి ప్రధానమైన రూల్ స్క్రీన్స్‌కి దూరంగా ఉండడం. " నిద్రకు కనీసం గంట ముందే స్క్రీన్ చూడడాన్ని మానేయాలి. ఎందుకంటే స్క్రీన్స్ బ్లూ లైట్ విడుదల చేస్తాయి. ఇది మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. స్క్రీన్ ఎక్కువగా చూసేవారు సరిగ్గా నిద్రపోలేరు. అలాగే నిద్రకు ముందు కూడా డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తే మంచిది. దీనివల్ల రోజు మొత్తంలో జరిగిన పనులు నిద్రకు ముందు గుర్తురాకుండా ఉంటాయి." వీటిని ఫాలో అయితే మంచి నిద్ర మీ సొంతమవుతుందని తెలిపారు.
అలాగే గురక, అతి నిద్రకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలపై డాక్టర్ హర్షిణి ఎర్రబెల్లి ఏబీపీ దేశం హెల్త్ కాంక్లేవ్ 2025లో వివరించారు. ఆ లింక్ ఇక్కడుంది. క్లిక్ చేసి చూసేయండి.






















