ఇలాంటి పాత్రల్లో వంట చేస్తే ఎంత డేంజరో తెలుసా? ఈ రోగాలన్నీ రావడానికి సిద్ధం
ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. మీరు ఎలాంటి వంట పాత్రల్లో వంట చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి
మీ ఇంట్లో ఒకసారి చూడండి.. అల్యూమినియంతో తయారైన వంట పాత్రలు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా ఇది చదవాల్సిందే. అల్యూమినియం కళాయిలు, గిన్నెలు, బాటిళ్లు వాడుతున్నవారు, అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టిన ఆహారం తింటున్నవారికి తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మన దైనందిన జీవితంలో అల్యూమినియం వంటసామాను ఉపయోగించడం భాగమైపోయింది. కానీ వీటిల్లో వండిన ఆహారం అధికంగా తినడం వల్ల చాలా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అధ్యయనం ప్రకారం. అల్యూమినియం పాత్రల్లో లేదా వాటి ఫాయిల్ పేపర్లలో చుట్టిన ఆహారాన్ని తినడం వల్ల 1 లేదా 2 మిల్లీగ్రాముల లోహం మన శరీరంలోకి చేరిపోతుంది. ఇలా చేరడం వల్ల శరీరానికి ఎంతో హాని కలుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక సగటు వ్యక్తి రోజుకు ఆహారం నుంచి 5 మిల్లీగ్రాముల వరకు అల్యూమినియాన్ని తినవచ్చు. కానీ అంతకుమించి శరీరంలో చేరడం వల్ల హాని కలుగుతుంది. ఆహారం ద్వారానే కాదు ఇలా వంటపాత్రలు ద్వారా కూడా అల్యూమినియం శరీరంలో అధికంగా చేరితో కొన్ని రోగాలు వచ్చే అవకాశం ఉంది.
మెదడుపై ప్రభావం
కొన్ని అధ్యయనాల ప్రకారం అల్యూమినియం వంటపాత్రల్లో రోజూ వంట చేసి తినడం వల్ల అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అల్జీమర్స్ వ్యాధి , చిత్తవైకల్యంతో బాధపడుతున్న కొంతమంది రోగుల మెదడు కణజాలంలో అల్యూమినియం స్థాయిలను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ అంశంపై మరిన్ని అధ్యయనాలు అవసరం. అంతేకాదు అల్యూమినియం వంట పాత్రాల్లో వండిన ఆహారాన్ని తిన్నవారిలో తరచూ తలనొప్పి రావడాన్ని కూడా గుర్తించారు పరిశోధకులు.
ఎసిడిటీ
అల్యూమినియం పాత్రల్లో వెనిగర్, టోమాటో వంటివి ఉడికించినప్పుడు అవి ఎసిడిక్ రియాక్షన్లను చూపుతాయి. దీనివల్ల అల్యూమినియం అయాన్లు ఆ పాత్రల్లోని ఆహారంలో కరిగిపోతాయి. ఇది ఆహారంలో అల్యూమినియం అధికంగా ఉండటానికి దారితీస్తుంది. దీని వల్ల శరీరంలో అనారోగ్యం సూచనలు ఎక్కువైపోతాయి. అందుకే కొన్ని రకాల వంటలు అల్యూమినియం పాత్రల్లో వండకూడదు.
క్యాన్సర్ ప్రమాదం
అల్యూమినియం పాత్రల్లో వండిన వంటలు దీర్ఘకాలంగా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కచ్చితంగా ఇది నిజం అని చెప్పలేము కానీ, వచ్చే అవకాశాలు ఉన్నట్టు మాత్రం శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ ఆహారం శరీరంలో విషాన్ని పెంచుతుందని, క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేస్తుందని అంటున్నారు.
కిడ్నీ వ్యాధులు
ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్న వారు అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారాన్ని దూరం పెట్టాలి. శరీరంలో అధికంగా అల్యూమినియం చేరితే అది మూత్రపిండాల వ్యాధులకు కారణం అవుతుందని అధ్యయనాల కూడా ఇప్పటికే నిరూపించాయి. అధికంగా చేరిన అల్యూమినియం మూత్రపిండ వైఫల్యానికి కారణం అవుతుంది.
Also read: పిల్లలతో బంధం మరింత బలపడాలంటే ఇంట్లో ఇలాంటి పనులు చేయాల్సిందే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.