తొక్కే కదా అని తీసిపారేయకండి, వాటిలోనే పోషకాలన్నీ
ఏ కూరగాయకైనా తొక్క కామన్ గా ఉంటుంది. ఒకవేళ లేకపోయినా కూడా చెక్కులా తీస్తాం.
ఏ కూరగాయైనా వండే ముందు మనం చేసే పని పైన పొట్టు లేదా చెక్కు తీసేయడం. కూరగాయలే కాదు పండ్లు కూడా. అరటి పండు నుంచి యాపిల్ వరకు అన్ని రకాల పళ్లకు తొక్కుల తీసి పడేస్తాం. దానికి కారణం చాలా ఉన్నాయి. వాటి మీద ప్రిజర్వేటివ్స్, పురుగుల మందులు వంటివి చల్లారేమో అన్న అనుమానం, అలాగే అవి సరిగా ఉడకవని, జీర్ణం కావని అనుకుంటాం. కాకపోతే మనకు తెలియని విషయం ఏమంటూ కూరగాయ లోపల ఎన్ని పోషకాలుంటాయో, తొక్కలో కూడా అంత పోషకాలు ఉంటాయి. పండ్ల తొక్కలు రుచికి కూడా బాగోవు, కాబట్టి వాటిని తినలేం. కాబట్టి పడేయాల్సిందే. మరి కూరగాయల పొట్టు ఎందుకు పడేయాలి. బాగా నీళ్లలో నానేసి కడిగి వండుకోవచ్చు. కూరగాయలపైన మురికిని తొలగించే క్లీనర్లు కూడా మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. వాటిని తీసుకుని నీళ్లల్లో క్లీనర్ వేసి కొన్ని డ్రాప్స్ వేసి, ఈ కూరగాయలను ఓ పావుగంట సేపు వదిలేస్తే చక్కగా శుభ్రం అయిపోతాయి. నీటిలో కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఏ కూరగాయ, పండ్లలో తొక్కల్లో ఏఏ పోషకాలు ఉంటాయో తెలుసుకోండి.
నారింజ
నారింజ తొక్కను ఎలా తింటాం, వామ్మో ఆ చేదును భరించలేం అనుకుంటారు. నిజమే కానీ ఆ తొక్కలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. పండులో కన్నా తొక్కలోనే ఎక్కువ. తొక్క నేరుగా తినలేరు, మిక్నీలో వేసి కొబ్బరి కోరులా మెత్తని పొడిలా చేసుకోవచ్చు. వాటిని సలాడ్ల మీద చల్లుకుని తినవచ్చు.
వంకాయ...
చాలా చోట్ల వంకాయను ఉడకబెట్టి తొక్కతీసి పచ్చడి, కూరలు చేసుకుంటారు. ఆ తొక్కలోనే పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముదురు రంగు ఉండే వంకాయల్లో మరింత యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు కణాల పైపొర దెబ్బతినకుండా కాపాడుతుంది. అందుకే వంకాయను బాగా కడిగి తొక్క తీయకుండానే తినాలి.
మామిడి
మామిడి పండు తొక్కని తినలేం. రుచికి బాగోదు. మామిడి కాయ పచ్చిగా ఉన్నప్పుడు కూడా తొక్కని తీసేసి తింటారు. పచ్చగా ఉండే తొక్కతో సహా తింటేనే ఆరోగ్యం. ఆ తొక్కలో పీచు పదార్థం ఉంటుంది. విటమిన్ ఇ,సి, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీ ఫెనాల్స్, కెరోటినాయిడ్లు ఉంటాయి. అలాగే ఒమేగా 3, ఒమెగా 6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.
కీరాదోస
సలాడ్‌లలో ఎక్కువగా కనిపించే కీరాదోసను కూడా తొక్క తీసి తింటారు, కానీ సరైన పద్ధతి కాదు. దీన్ని పొట్టుతో పాటూ తింటేనే లాభం. ముదిరిన రంగులో ఆకుపచ్చగా ఉండే కీరా తొక్కలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్ కె కూడా అధికంగా ఉంటుంది.
ఆపిల్
ప్రిజర్వేటివ్స్, పురుగుల మందుల భయంతో ఆపిల్ పండ్లను తొక్క తీసి తింటున్నారు ఇప్పుడంతా. వాటిని నీటిలో నానబెట్టి, బాగా క్లీన్ చేసుకుని తింటే మంచిది. ఆపిల్ తొక్కలో విటమిన్ ఎ, విటమిణ్ సి, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ కె అధికంగా ఉంటుంది.
బంగాళా దుంపలు
బంగాళా దుంపలు కూడా బాగా కడిగి పొట్టుతో సహా వండుకోవాలి. ఈ పొట్టు చాలా పలచగా ఉంటుంది, కాబట్టి ఉడకదు లేదా అరగదు అనే సందేహం అవసరం లేదు. ఈ తొక్కల్లో విటమిన్ సి, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటివి ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు పొట్టుతోనే తినేందుకు ప్రయత్నించారు.
Also read: పాల ఉత్పత్తులతో మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవచ్చు, ఏం తినాలంటే?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.