Periods: ఆ మూడు రోజులు పెరుగు తినకూడదా? ఆ వాదనలో నిజమెంత?
పీరియడ్స్ విషయంలో ఎన్నో అపోహలు, సందేహాలు. వాటిలో ఒకటి పెరుగు తినకూడదనేది కూడా.
మహిళలకు నెలానెలా పీరియడ్స్ సమయంలో ఎన్నో సమస్యలు. కొందరికి పొత్తికడుపు నొప్పి, మరికొందరికి మూడ్ స్వింగ్స్, వికారం, కొందరిలో అధికంగా రుతుస్రావం కావడం వంటివి కనిపిస్తుంటాయి. నెలసరుల్లో ఏం తినాలన్నా కూడా ఆడవాళ్లు ఆలోచిస్తారు.అంతే కాదు కొన్ని పదార్థాలు తినకూడదనే వాదన కూడా ఉంది. అందులో ఒకటి పెరుగు. పీరియడ్స్ సమయంలో పెరుగు తినకూడదనే అపోహ ఎలా పుట్టిందో తెలియదు కానీ, చాలా మంది మహిళలు ఆ మూడు రోజులు పెరుగును దూరం పెడతారు. నిజంగానే పీరియడ్స్ సమయంలో పెరుగు తినకూడదా?
అంతా అపోహే...
పెరుగు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు సాధారణ రోజుల్లోనే కాదు పీరియడ్స్ వేళల్లో కూడా కలుగుతాయి. పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటుంది. ప్రొబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టిరియా. ఇది పొట్ట, పేగుల ఆరోగ్యానికే కాదు, మహిళల జననాంగాల శుభ్రతకు కూడా చాలా అవసరం. అక్కడ వచ్చే ఇన్ఫెక్షన్లను అడ్డుకునే శక్తి పెరుగులోని మంచి బ్యాక్టిరియాకే ఉంది. అందుకే పీరియడ్స్ సమయంలో కచ్చితంగా పెరుగు తినాలి. ఇందులో క్యాల్షియం, మెగ్నిషయం కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు పెరుగు తినడం వల్ల ఆ సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్ కూడా తగ్గుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. చికాకు తగ్గుతుంది. నిద్ర కూడా చక్కగా పడుతుంది. కాబట్టి పెరుగు తినకూడదనే అపోహలను మాని ఆ మూడు రోజులు ఓ కప్పు పెరుగు కచ్చితంగా తినండి. మీకే తేడా తెలుస్తుంది.
ఐరన్ అవసరం..
ఆ మూడు రోజులు రక్తస్రావం జరగడం వల్ల, శరీరంలోంచి కొంత రక్తం బయటికి పోయినట్టే. అందుకే రక్తహీనత సమస్య ఆడవాళ్లకే అధికంగా వస్తుంది. ఆ మూడు రోజులు ఐరన్ అధికంగా ఉండే ఆహారం తప్పకుండా తీసుకోవాలి. అలాగే నీటితో నిండిన పండ్లను కూడా తినాలి. ఆకుకూరలను అధికంగా తినడం వల్ల ఐరన్ లభిస్తుంది. పాలకూర, బచ్చలికూర, మెంతి కూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు కచ్చితంగా తినాలి. బీన్స్, బఠాణీలు, చికెన్ లివర్, కిస్మిస్లు, ఆప్రికాట్లు, గుమ్మడి గింజలు, అన్నిరకాల పండ్లు... ఇలాంటివన్నీ ఆ మూడు రోజుల్లో తింటే ఎంతో మంచిది. రక్తం పోవడం వల్ల కలిగే నీరసం, చిరాకు వంటివి పెరుగు వల్ల పోతాయి. పెరుగును మజ్జిగ్గా మార్చుకుని తాగితే ఆ మూడురోజుల్లో కలిగే డీహైడ్రేషన్ సమస్య కూడా దరిచేరదు.ఆ మూడు రోజులు అధికంగా నీళ్లు తాగడం వల్ల తలనొప్పి వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
Also read: పిల్లల్ని కనేందుకు సిద్ధపడుతున్నారా, చేపలు తినడం ఆపేయండి, కొత్త అధ్యయనంలో షాకింగ్ ఫలితాలు