Papaya: బొప్పాయిని తిన్నాక ఈ ఆహారాలను తినకండి, మంచిది కాదు
Papaya: బొప్పాయి పండు ఆరోగ్యానికి మంచిదే కానీ అది తిన్నాక కొన్ని ఆహారాలు తినకూడదు.
Papaya: బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనది. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కె, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల అన్ని రకాలుగా ఆరోగ్యకరం. దీన్ని తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. బొప్పాయిలో ఉండే లైకోపీన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. మెదడు ఆరోగ్యానికి కూడా బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుండి మెదడును కాపాడుతుంది. విటమిన్ కే లోపంతో బాధపడే వ్యక్తులు బొప్పాయిని తినడం వల్ల ఆ పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చు. వారి ఎముకలను బలోపాతం చేసుకోవచ్చు. అలాగే మగవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా బొప్పాయి చాలా వరకు తగ్గిస్తుంది. దీనిలో పపైన్ అనే ఎంజైము ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో సహాయపడుతుంది. దీనిలో ఫైబర్, నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి బొప్పాయి తిన్నవారికి మలబద్ధకం వచ్చే అవకాశం చాలా తక్కువ. కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఇది ముందుంటుంది. బొప్పాయి తినడం వల్ల చర్మం మెరుపు సంతరించుకుంటుంది. జుట్టు కూడా పట్టుకురుల్లా మారుతుంది. అందుకే బొప్పాయిని కచ్చితంగా తినమని చెబుతారు వైద్యులు. అయితే బొప్పాయి తిన్నాక లేదా తినడానికి ముందు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి.
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుందని చెప్పుకున్నాము. ఇది శరీరంలో చేరాక అక్కడి ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. బొప్పాయి తిన్నాక ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తింటే ఈ ఎంజైము ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. అందుకే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. బొప్పాయి తినడానికి గంట ముందు లేదా గంట తర్వాతే ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తినకూడదు. పెరుగు, చీజ్, పాలు వంటి వాటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి బొప్పాయి తిన్న తర్వాత పాలు, పెరుగు వంటివి తినకూడదు. అలాగే బొప్పాయి తినడానికి ముందు కూడా పాల ఉత్పత్తులను తినకూడదు. తింటే మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
బొప్పాయి పండు తిన్నాక కోడిగుడ్లతో వండిన ఆహారాలను కూడా దూరంగా ఉంచాలి. ఆమ్లెట్లు, ఉడికించిన గుడ్లు తినకూడదు. బొప్పాయి, గుడ్లు కలగలిసి అజీర్ణానికి కారణం అవుతాయి. వికారంగా అనిపిస్తుంది. వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర పండ్లతో బొప్పాయిని కలిపి ఫ్రూట్ సలాడ్ గా తయారు చేయకూడదు. బొప్పాయిని మాత్రమే ఉత్తిగా తినాలి. ఇతర పండ్లలో ఉండే పోషకాలు బొప్పాయితో కలిసి గ్యాస్టిక్ సమస్యకు కారణం అవుతాయి. అలాగే బొప్పాయి తిన్నాక చల్లటి నీరు తాగవద్దు. ఇవి జీర్ణ సమస్యలను పెంచేస్తాయి. బొప్పాయి తిన్నాక దాహంగా అనిపిస్తే గోరువెచ్చని నీరు తాగేందుకు ప్రయత్నించండి. అలాగే నారింజ పండ్లు ,బొప్పాయిలు కలిపి తినడానికి ప్రయత్నించవద్దు. ఈ రెండు కూడా వ్యతిరేక లక్షణాలు కలిగి ఉన్న పండ్లు. ఈ రెండూ కలిపి తినడం వల్ల విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. లేదా కడుపునొప్పి రావచ్చు. మలబద్ధకం వంటి సమస్యలు వేధించొచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.