kidney Health: ఈ అలవాట్లు మానుకోండి... లేకుంటే కిడ్నీలకు ప్రమాదం తప్పదు
శరీరంలో కిడ్నీలది ముఖ్యపాత్ర. శరీరం నుంచి వ్యర్థాలను బయటికి పంపే వీటికి మీ అలవాట్లతోనే ముప్పు పొంచి ఉంది.
ఒక్కసారి ఆలోచించుకోండి... కిడ్నీలు పాడైతే ఎంత కష్టమో. అవి బాగున్నంత కాలం వాటి గురించి ఆలోచించం. వాటికి హానిచేసే ఆహారపు అలవాట్లను కూడా కొనసాగిస్తాము. కానీ ఒక్కసారి కిడ్నీల్లో సమస్య వస్తే ఆ ప్రభావం శరీరం మొత్తమ్మీద పడుతుంది. అందుకే మూత్రపిండాలను దెబ్బతీసే కొన్ని అలవాట్లను వదులకోవాలి. వాటిలో ముఖ్యమైనవి ఇవే.
1. పెయిన్ కిల్లర్స్... శరీరంలో నొప్పిని వెంటనే తగ్గించే ఈ ట్యాబ్లెట్లు తరచూ వాడుతుంటే కిడ్నీలకు సమస్య మొదలవ్వచ్చు. ముఖ్యంగా ఆల్రెడీ కిడ్నీ సమస్యలున్న వాళ్లకి ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల సమస్య పెరుగుతుంది. తరచూ వాడుతుంటే వైద్యుల సలహా తప్పకుండా తీసుకోవాలి.
2. ఉప్పు వాడకం చాలా తగ్గించుకోవాలి. ఉప్పుకు బదులు మిగతా ఫ్లేవర్లు ఏవైనా మీ ఆహారానికి జోడించుకోండి. ఉప్పు రక్తపోటును పెంచుతుంది. రక్తపోటు పెరగడం వల్ల కిడ్నీల పనితీరులో మార్పులు వస్తాయి.
3. చిప్స్ వంటి ప్రాసెస్ట్ ఆహారాన్ని దూరంగా పెట్టాలి. వీటిలో సోడియం, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. ప్యాకేజ్డ్ ఆహారాన్ని కూడా తినడం చాలా మేరకు తగ్గించాలి. ఫాస్పరస్ అధికంగా తినడం వల్ల కిడ్నీలకు, ఎముకలకు నష్టం వాటిల్లుతుంది.
4. నీరు తక్కువ తాగే వారిలో కూడా కిడ్నీల్లో సమస్య తలెత్తవచ్చు. నీరు అధికంగా తాగితే కిడ్నీలు శరీరంలోని హానికర సోడియం, టాక్సిన్లను బయటికి పంపేస్తాయి. అలాగే నీరు ఎక్కువగా తాగితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే సమస్య కూడా ఎదురవ్వదు. అందుకే రోజుకు కనీసం మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి.
5. రాత్రి నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం. చాలా మంది అర్థరాత్రి వరకు సినిమాలు చూసి కేవలం అయిదారు గంటలే నిద్రపోతారు. కిడ్నీలకు రాత్రి నిద్ర వల్ల వర్క్ లోడ్ తగ్గుతుంది.
6. పంచదార వాడకం తగ్గించాలి. దీని వల్ల ఊబకాయం, హైబీపీ, మధుమేహం వంటి సమస్యలు పెరుగుతాయి. అవన్నీ కిడ్నీ సమస్యలకు దారితీస్తాయి. కనుక తీపి పదార్థాల వాడకాన్ని తగ్గించాలి.
7. ధూమపానం, ఆల్కహాల్... ఈ రెండూ కిడ్నీలకే కాదు, ఏ శరీరా అవయవాలకూ మంచివి కాదు. వీరి యూరిన్ నుంచి ప్రోటీన్లు బయటికిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ రెండు అలవాట్లను మానేయాలి.
8. వ్యాయామాలకు, శారీరక శ్రమకు దూరంగా ఉండకండి. రోజులో కనీసం గంటైన ఎక్సర్ సైజులు చేయండి. కనీసం నడవండి. ఫిజికల్ యాక్టివిటీ వల్ల రక్తపోటు మెరుగవుతుంది, జీవక్రియలు మెరుగుపడతాయి. ఇది మూత్రపిండాలకు మంచిది.
9. అధికంగా మాంసాహారం తినే అలవాటు ఉంటే, వదులుకోవాలి. మాంసంలోని ప్రోటీన్ అధికమొత్తంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మూత్ర పిండాలకు హానికరం.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.