Custard Apple: కచ్చితంగా తినాల్సిన పండ్లలో సీతాఫలాలు ఒకటి , ఈ పండ్లతో క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు
సీతాఫలం పండ్ల కోసం ఎదురు చూసే వారు ఎంతో మంది. వీటిని తింటే మంచి రుచితో పాలూ, ఆరోగ్యమూ అందుతుంది.
సీతాఫలాలు అంటే ఎంతో మందికి ఇష్టం. తీపి రుచితో నోరూరించేలా ఉంటాయి. ఈ పళ్ళను షుగర్ యాపిల్, కస్టర్డ్ యాపిల్ ఇలా రక రకాల పేర్లతో పిలుస్తారు. మన దేశంలో ప్రాచుర్యం పొందిన పండ్లలో ఇది ఒకటి. దీని రుచికి ఎంతోమంది దాసోహం అయిపోతారు. ఈ పండ్లు తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
సీతాఫలాలు తినడం వల్ల శరీరంపై పడే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే క్యాన్సర్, గుండె వ్యాధులు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది. ఈ పండులో కౌరెనాయిక్ యాసిడ్, విటమిన్ సి వంటి శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదం వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. ఈ పండ్లలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ పండ్లు తిన్నాక శరీరంలో డోపమైన్ ఉత్పత్తి అవుతుంది. డోపమైన్ అనేది ఒక సంతోషకరమైన హార్మోను. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలతో బాధపడే వారికి ఈ పండు మంచి ఫలితాన్ని ఇస్తుంది.
సీతాఫలాలలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. అధిక రక్తపోటును తగ్గించడానికి ఇవి చాలా సాయపడతాయి. కాబట్టి హై బీపీతో బాధపడుతున్న వారు, గుండె సమస్యల బారిన పడిన వారు సీతాఫలాలను కచ్చితంగా తినాలి. ఇది అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. స్ట్రోక్, గుండెపోటు మొదలైన హృదయ సంబంధ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.
సీతాఫలంలో ఉండే సమ్మేళనాలు క్యాన్సర్ తో పోరాడే శక్తిని ఇస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం సీతాఫలంలో ఉండే క్యాటచిన్, ఎపిక్యాటచిన్, ఎపిగాల్లో క్యాటెచిన్ వంటివి ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. సీతాఫలాలు అధికంగా తింటే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం దాదాపు తగ్గిపోతుంది. కాబట్టి సీతాఫలాలను కచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాలి.
ఈ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల మలబద్ధకం, అతిసారం వంటి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ పండులో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు, జీర్ణాశయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇన్ఫ్లమేటరీ వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. సీతాఫలం అనేది సీజనల్ ఫ్రూట్. వాతావరణం చల్లబడే కొద్ది ఈ పండు కోతకొస్తుంది. వేసవిలో ఈ పండ్లు లభించవు. వానాకాలం, శీతాకాలంలో ఈ పండ్లు దొరుకుతాయి. దొరికిన సీజన్ లో కచ్చితంగా ఈ పండ్లను తినాలి. సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా కూడా ఆయా కాలాల్లో శరీరానికి కావాల్సిన పోషకాలను రోగనిరోధక శక్తిని అందిస్తాయి. కాబట్టి సీజనల్ ఫ్రూట్లను కచ్చితంగా తినమని చెబుతారు పోషకాహార నిపుణులు.
Also read: నా భర్త ఎవరూ లేనప్పుడు నా దుస్తులు వేసుకుంటున్నాడు, ఇదేం వింత రోగం
Also read: ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో HOG పదం ఎక్కడ ఉందో కనిపెట్టండి, అది కూడా పది సెకన్లలో...
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.