ముడతలున్న డ్రెస్‌తోనే ఆఫీస్‌కి రండి, ఐరన్ చేసుకోవద్దు - ఉద్యోగులకు వింత కండీషన్ పెట్టిన కంపెనీ
Wrinkled Clothes: ప్రతి సోమవారం ఇస్త్రీ లేని దుస్తులతోనే ఆఫీస్‌కి రావాలంటూ CSIR సంస్థ తమ ఉద్యోగులకు సూచించింది.
Benefits of No Iron: ఆఫీస్‌కి వెళ్లాలంటే చాలా నీట్‌గా రెడీ అయిపోతాం. బట్టలకు ఇస్త్రీ చేసుకుని చక్కగా ఇన్‌షర్ట్ వేసుకుని బయల్దేరిపోతాం. కానీ...Council of Scientific and Industrial Research (CSIR) కంపెనీ మాత్రం ఇస్త్రీ బట్టలు వేసుకుని ఆఫీస్‌కి రావద్దంటూ ఉద్యోగులకు ఆర్డర్ వేసింది. ముడతలు పడ్డ దుస్తులతోనే రావాలని చెప్పింది. అయితే అన్ని రోజులూ కాదు. ప్రతి సోమవారం ఈ రూల్ ఫాలో అవ్వాలని సూచించింది. ఈ రూల్‌కి ‘WAH Mondays’ అనే పేరు పెట్టింది. WAH అంటే ‘Wrinkles Acche Hai’ అని. ముడతలున్నా మంచిదే అని అర్థం. CSIR తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ ఎన్ కాళైసెల్వి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కూడా వివరించారామె. దుస్తులను ఇస్త్రీ చేయడం వల్ల వాతావరణంలోకి 200 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. అలా రోజూ ఇస్త్రీ చేస్తే వాతావరణం కలుషితమైపోతుందన్నది CSIR చెబుతున్న విషయం.
కనీసం వారంలో ఒక్కరోజైనా అలా ఇస్త్రీ చేయకుండా ఉంటే ఆ రోజుకి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించినట్టవుతుందని వివరిస్తోందీ సంస్థ. ఇస్త్రీ దుస్తులతో పర్యావరణం కలుషితం అవుతుందని మరి కొందరు నిపుణులూ స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు ఏడాది పాటు వారానికి 5 షర్ట్స్ ఇస్త్రీ చేశారనుకుంటే...7 కిలోమీటర్ల దూరం వరకూ ఓ కార్‌ని డ్రైవ్ చేస్తే వాతావరణంలోకి ఎంత CO2 విడుదలవుతుందో...ఈ ఇస్త్రీ వల్ల కూడా అంతే కర్బన ఉద్గారాలు విడుదలవుతాయి. ఇది క్రమంగా ప్రపంచసమస్యగా మారుతుంది.
ఇస్త్రీ చేయకుంటే బోలెడన్ని లాభాలు..
దుస్తులు తడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇస్త్రీ చేసుకుని, మిగతా రోజుల్లో అలా వదిలేయాలని చెబుతున్నారు పర్యావరణ నిపుణులు. ఇది అలవాటు చేసుకుంటే చాలా వరకు కాలుష్యం తగ్గిపోతుందని అంటున్నారు. ఇలా ఇస్త్రీ చేయడం మానేస్తే పర్యావరణపరంగా మనకు ఎన్నో లాభాలుంటాయట. ఇస్త్రీ మానేయడం వల్ల ఆ మేరకు విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఇదొక్కటే కాదు. ఇస్త్రీ బట్టలు వేసుకున్న వాళ్లకు మాత్రం గౌరవం ఉంటుందన్న మన ఆలోచనా ధోరణినీ ఇది మార్చుతుంది. అందరూ అలా ముడతలు పడ్డ బట్టలు వేసుకుని వస్తే అంతా సమానమే అన్న భావన ఉంటుంది. కాస్త తడిగా అనిపించగానే చాలా మంది ఇస్త్రీ చేసేస్తుంటారు. అలా కాకుండా కాసేపు గాల్లో ఆరేస్తే వాటంతట అవే ఆరిపోతాయి. ఆ విధంగా కొంతైనా విద్యుత్ వినియోగాన్ని తగ్గించినట్టవుతుంది.
ఎక్స్‌పర్స్ట్ ఇస్తున్న మరో సలహా ఏంటంటే..కనీసం రెండుసార్లైనా వాడిన తరవాతే ఆ దుస్తులను వాషింగ్‌కి వేయాలి. మనకు సరిపోని దుస్తుల్ని ఊరికే పారేయకుండా ఎవరికైనా దానం చేస్తే వ్యర్థాలు తగ్గిపోతాయి. అందుకే అన్ని చోట్లా cloth donation drives చేపట్టాలని కొంత మంది సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ డ్రైవ్స్ కొనసాగుతున్నాయి. కాకపోతే అవి చాలా పరిమితంగా ఉంటున్నాయని..వాటిని విస్తరించాల్సిన అవసరముందని అంటున్నారు.
Also Read: UP News: లిఫ్ట్‌లో ఉండగా దాడి చేసిన కుక్క, చేతికి గాయమై విలవిలలాడిపోయిన బాలిక