Chicken Rice Recipe: అన్నం మిగిలిపోతే చికెన్ రైస్ చేసుకోండిలాా
చికెన్ రైస్ కోసం చైనీస్ సెంటర్ల చుట్టూ తిరగకుండా ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చు.
అన్నం మిగిలిపోతే అందరూ చేసే పని నిమ్మకాయ పులిహోర చేసుకోవడం. కేవలం అదొక్కటే కాదు చికెన్ రైస్ కూడా చేసుకోవచ్చు. అది కూడా పదినిమిషాల్లో రెడీ అయిపోతుంది. కాకపోతే చికెన్ ముక్కలు ముందుగా ఉడకబెట్టి ఉంచుకోవాలి. పిల్లలు అడిగినప్పుడు వెంటనే చేసి ఇచ్చేయవచ్చు. దీనిలో ఎలాంటి సాస్ లు కలపక్కర్లేదు. ఇందులో వాడేవన్నీ ఆరోగ్యకరమైనవే. మసాలా కూడా వాడక్కర్లేదు కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఎక్కువ సార్లు తిన్నా బలమే కానీ, అనర్థం ఏమీ లేదు.
కావలసిన పదార్థాలు:
అన్నం - ఒకటిన్నర కప్పు
చికెన్ - వందగ్రాములు
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
కారం - అరస్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూనులు
మిరియాల పొడి - ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
క్యారెట్ - ఒకటి
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - రెండు స్పూనులు
పచ్చి బఠాణీలు - పావు కప్పు
తయారీ ఇలా
1. ముందుగా చికెన్‌ను చిన్న ముక్కలుగా చేసుకుని ఉడికించి పెట్టుకోవాలి. కాస్త పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, దంచిన వెల్లుల్లి ముక్కులు వేయించాలి.
3. ఉల్లిపాయ ముక్కలు వేగాక క్యారెట్ ముక్కలు, పచ్చిబఠాణీలు వేసుకోవాలి.
4. ఇవి వేగాక చికెన్ ముక్కలు వేసి వేయించాలి.
5. ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.
6. ఇది కాస్త కూరలా దగ్గరగ అయ్యాక అన్నం, కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
7. అయిదు నిమిషాలు తరువాత స్టవ్ కట్టేయాలి. అంతే చికెన్ రైస్ రెడీ.
చికెన్ తినాల్సిందేనా?
మాంసాహారులైతే మితంగా చికెన్ తినడం వల్ల లాభమే. దీనిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి మటన్ కన్నా చికెన్ తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మధుమేహం ఉన్నవారికి ప్రోటీన్లు చాలా అవసరం. అందుకే వారు చికెన్ తింటే మంచిది. ఈ మాంసంలో విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె వంటివి అధికంగా లభిస్తాయి. రక్తహీనతతో బాధపడే వారికి చికెన్ మేలు చేస్తుంది. కోడి లివర్ తినడం వల్ల సమస్య తగ్గుతుంది. ఇందులో విటమిన్ బి లభిస్తుంది. కాబట్టి మానసిక సమస్యలు తగ్గుతాయి. వారానికి రెండు సార్లయిన తక్కువ మొత్తం చికెన్ తినడం చాలా అవసరం.
Also read: పదిరూపాయలకే టేస్టీ బిర్యానీ, తినాలంటే ఆ ప్రాంతానికి వెళ్లాల్సిందే
Also read: వంటసోడా కేవలం పకోడీలు, కేకుల్లో వేయడానికే కాదు, వీటితో ఇంకా ఎన్నో ఉపయోగాలు