Skin Care: జిడ్డు చర్మం వాళ్ళు మాయిశ్చరైజర్ రాసుకోవచ్చా? ఎటువంటివి ఎంపిక చేసుకోవాలి?
జిడ్డు చర్మంతో ఇబ్బంది పడే వాళ్ళు మాయిశ్చరైజర్ రాసుకోవడానికి భయపడతారు. ఇన్నా జిడ్డు చాలదా ఇంకా అది రాసుకుని ఎక్కడ జిడ్డుగా కనిపిస్తామో అని అనుకుంటారు. కానీ మాయిశ్చరైజర్ రాసుకోవడం అవసరమే.
చర్మ సంరక్షణ అంత తేలికైనది ఏమి కాదు. ఒక్కొక్కళ్ళ స్కిన్ ఒక్కోలా ఉంటుంది. ఇక జిడ్డు చర్మం ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే మామూలుగా ఉండదు. స్నానం చేసిన కొన్ని గంటలకే మొహం మీద నూనె వచ్చేసి జిడ్డుగా కనిపిస్తారు. అలాంటి వాళ్ళు మాయిశ్చరైజర్ రాసుకోవడానికి అసలు ఇష్టపడరు. కారణం అసలే నూనె కారుతున్న మొహానికి మళ్ళీ ఆ క్రీమ్ రాసుకోవడం వల్ల మరింత ఆయిల్ రూపం కనిపిస్తుందేమో అని రాసుకోవడానికి భయపడతారు. అందువల్లే మాయిశ్చరైజర్ రాసుకోవడానికి వెనుకాడతారు.
ఆయిల్ స్కిన్ వల్ల ఇబ్బందులు
చర్మం శుభ్రపరిచిన గంటలోనే ఆయిల్ బయటకి వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితి పీరియడ్స్ సమయంలో ఎక్కువగా ఎదుర్కొంటారు. ముక్కుపై బ్లాక్స్ హెడ్స్ రావడం జరుగుతుంది. ఎప్పుడు నూనె కారుతూ ఉండటం వల్ల స్కిన్ ఇరిటేషన్ గా అనిపిస్తుంది. మనసు కూడా కాస్త చికాకుగా ఉంటుంది. అందుకే ప్రతిసారి మొహం నీళ్ళతో కడుక్కోవాల్సి వస్తుంది.
జిడ్డు చర్మానికి మాయిశ్చరైజర్ ఎందుకు అవసరం?
చర్మం జిడ్డుగా ఉన్నప్పటికీ మాయిశ్చరైజర్ రాసుకోవడం చాలా అవసరం. మొటిమలు, జిడ్డు గల చర్మం రెండూ సెబమ్ ఉత్పత్తి అధికంగా ఉండటం వల్ల వస్తుంది. చర్మం నూనె ఉత్పత్తి చేయడం వల్ల నీరు లేక తేమని కోల్పోతుంది. ఇది స్కిన్ కి అనువైనది కాదు. మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. అందులోని పదార్థాలు మీ చర్మంలోకి చొచ్చుకుని వెళ్ళి నీటిని ఆకర్షిస్తాయి. జిడ్డు చర్మాన్ని వదిలించుకోవాలని అనుకుంటే మనం రాసుకునే ఉత్పత్తుల్లో అదనపు నూనె లేని వాటిని ఎంచుకోవడం ముఖ్యం. అప్పుడే చర్మం హైడ్రేట్ గా ఉంటుంది.
చర్మం మీద నూనె ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల స్కిన్ రంధ్రాలు మూసుకుపోతాయి. ఫలితంగా మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఎటువంటి మాయిశ్చరైజర్ వాడాలి?
మీరు జిడ్డుగల చర్మం ఉన్నట్లయితే స్కిన్ పొడిబారెలా చేసే సోడియం లారెత్ సల్ఫేట్, స్వరియం లారిల్ సల్ఫేట్ వంటి ఆల్కలీన్ సర్ఫ్యాక్టెంట్‌లతో కూడిన ఉత్పత్తులను ఉపయోగించడం మానేయాలి. వీటి వల్ల చర్మం మురికి, బ్యాక్టీరియా నుంచి రక్షించే యాసిడ్ పొరని దెబ్బతినేలా చేస్తుంది. ఇది చర్మాన్ని కలుషితం చేస్తుంది. క్రీములు, లోషన్లు చాలా మందంగా ఉండటం వల్ల చర్మం పైభాగంలోకి మాత్రమే వెళతాయి. వాటికి బదులుగా నాన్ కామెడోజెనిస్ మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి.
ఇది ఉపయోగించడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా చేసి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్యని తగ్గిస్తుంది. తేలికైన నూనె లేని మాయిశ్చరైజర్ ఎంచుకోవడం ముఖ్యం. మీరు ఎంచుకునే మాయిశ్చరైజర్ లో ఎటువంటి నూనెలు ఉంటున్నాయనేది గమనించుకుని కొనుగోలు చేసుకోండి. అలోవెరా జెల్, గ్లిజరిన్ లేదా హైలురోనిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్ ఎంచుకోవడం ఉత్తమం అని బ్యూటీషన్స్ పేర్కొన్నారు. వాటి వల్ల చర్మం తేమగా ఉంటూనే చర్మం మీద ఆయిల్ రాకుండా నివారించగలుగుతుంది. చర్మ సంరక్షణ కోసం తప్పకుండా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. లేదంటే స్కిన్ దెబ్బతిని నిర్జీవంగా కనిపిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: మందు తాగితే మెదడు మటాషే, ఇవిగో ఆధారాలు