Hair Care: కరివేపాకులతో ఇలా చేస్తే జుట్టు సమస్యలు దూరం
జుట్టు సంరక్షణ కోసం ఏవేవో ప్రయత్నాలు చేసే బదులు సింపుల్ గా వంటింట్లో దొరికే వాటితోనే జుట్టు పొడవు పెంచుకోవచ్చు.
ఆధునిక జీవనశైలి, పేలవమైన ఆహారపు అలవాట్లు కారణంగా జుట్టు ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అందరూ జుట్టు రాలిపోయే సమస్యని ఎదుర్కొనే వాళ్ళే ఉంటున్నారు. జుట్టు మంచిగా లేకపోతే ఎంత అందంగా రెడీ అయినా ప్రయోజనం ఉండదు. అందుకే జుట్టు మీద అదనపు శ్రద్ధ చూపించడం చాలా అవసరం. మార్కెట్లో దొరికే వాటితో జుట్టు పెంచుకోవాలని ప్రయత్నిస్తారు కానీ అవి ఎంతవరకి మేలు చేస్తాయనే విషయం మాత్రం చెప్పడం చాలా కష్టం. ఒక్కోసారి ఉన్న జుట్టు కూడా ఊడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్ గా జుట్టు పెంచుకునేందుకు ట్రై చెయ్యొచ్చు. వాటిలో ముందుగా వినిపించే పేరు కరివేపాకు.
ప్రతి ఒక్కరి ఇంట్లో కరివేపాకు తప్పనిసరిగా ఉంటుంది. కూరలకి అద్భుతమైన వాసన, రుచి అందిస్తుంది. కానీ తినేతప్పుడు మాత్రం కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తారు. అలా చేయడం వల్ల మీ జుట్టు ఎదుగుదల మీరే అడ్డుకుంటున్నట్టు అవుతుంది. కరివేపాకు జుట్టుకి మంచి పోషణ ఇస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ని అడ్డుకుంటాయి. చుండ్రు, స్కాల్ఫ్ దురదని దూరం చేయడంతో పాటు జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అంతే కాదు తెల్ల జుట్టు రాకుండా పోషణ ఇచ్చే విటమిన్ బి ఇందులో లభిస్తుంది. దీన్ని తినడం వల్ల సిల్కీ, పొడవాటి జుట్టు మీ సొంతం అవుతుంది.
పొడవాటి జుట్టు కోసం
జుట్టు పొడవు పెంచాలని అనుకుంటే కరివేపాకుని వీటితో కలిపి తీసుకుంటే చాలా మంచిది. అరకప్పు కరివేపాకు, మెంతి ఆకులు, ఒక ఉసిరికాయని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని తల మొత్తం పట్టించాలి. ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు దాన్ని బాగా తలకి పట్టించిన తర్వాత చల్లని నీటితో కడిగేయొచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు బాగా పొడవుగా అవుతుంది. ఉసిరి జుట్టుకి మంచి పోషణ అందిస్తుంది.
కొబ్బరి నూనె కరివేపాకు
తక్కువ మంట మీద కొబ్బరి నూనె వేడి చేసుకోవాలి. అందులో కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుని చితపటలాడనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిక్స్ చల్లారిన తర్వాత ఒక బాటిల్ లోకి వడకట్టుకోవాలి. తరచుగా లేదా వారానికి ఒకసారి ఈ నూనె తలకి పట్టిస్తే జుట్టు మృదువుగా నిగనిగలాడుతుంది. హెల్తీ హెయిర్ కోసం ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు, అనేక విటమిన్లు ఉంటాయి. ఇవి జుట్టుకి పోషణ అందిస్తాయి.
ఉల్లిపాయ, కరివేపాకు
ప్రతి పది మందిలో ఏడుగురు మహిళలు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఉల్లిపాయ, కరివేపాకు జుట్టుకి పెట్టడం వల్ల జుట్టు రాలే సమస్యని అధిగమించవచ్చు. ఉల్లిపాయ రసంలో మంచి మొత్తంలో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు క్యూటికల్స్ ని బలపరుస్తుంది. ఉల్లిపాయ, కరివేపాకు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక క్లాత్ తీసుకుని దాన్ని వడకట్టుకోవాలి. అందులో కాటన్ బాల్ ముంచి జుట్టు కుదుళ్ళకి అప్లై చేసుకోవాలి. ఒక 30నిమిషాల పాటు తలకు అలాగే ఉంచుకోవాలి. ఉల్లిపాయ వాసన జుట్టుకు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా షాంపూ చెయ్యాలి. మెరిసే జుట్టు కోసం పెరుగు కరివేపాకు మిశ్రమం కలిపి కూడా పెట్టుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.