Body Odor : వర్షాకాలంలో శరీరం నుంచి దుర్వాసన వస్తోందా? కారణాలు, సమస్యను తగ్గించే ఇంటిచిట్కాలు ఇవే
Rainy Season Tips : వర్షాకాలంలో చెమట వల్ల శరీర దుర్వాసన వస్తుంది. కొన్ని ఇంటి చిట్కాలతో సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

Body Odor in Rainy Season : వర్షాకాలంలో గాలిలో తేమ పెరగడం వల్ల బట్టలు, గోడలు తేమతో నిండిపోతాయి. అంతేనా శరీర శుభ్రత కూడా సవాలుగా మారి చెమట వాసన లేదా శరీర నుంచి ఏదైనా వాసన వస్తుంది. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వేసవి కాలంతో పోలిస్తే వర్షాకాలంలో చెమట త్వరగా ఆరదు. తేమ కారణంగా శరీరంలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. అందుకే ఈ సీజన్‌లో చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే.. కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవ్వండి. ఇవి మీ శరీరాన్ని తాజాగా, ఎలాంటి దుర్వాసన లేకుండా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి.
శరీరం నుంచి దుర్వాసన ఎందుకు వస్తుంది?
చాలామంది సమ్మర్లోనే ఎక్కువ చెమట పడుతుంది అనుకుంటారు కానీ.. వర్షాకాలంలోనే అది ఎక్కువగా ఉంటుంది. పైగా వాసన వచ్చే అవకాశం ఎక్కువ. శరీరం నుంచి వచ్చే దుర్వాసనకు కేవలం చెమట మాత్రమే కారణం కాదు. బ్యాక్టీరియా కూడా ఓ కారణమే. శరీరంలో రెండు రకాల స్వేద గ్రంథులు ఉంటాయి. వాటిలో ఒకటి ఎక్రైన్, మరొకటి అపోక్రైన్. శరీరాన్ని చల్లగా ఉంచే ఎక్రైన్ గ్రంథులు నేరుగా చర్మం ఉపరితలంపై వాసన లేని చెమటను విడుదల చేస్తాయి. అదే సమయంలో అపోక్రైన్ గ్రంథులు వెంట్రుకల మూలాలతో అనుసంధానమై ఉంటాయి. ఇవి దుర్వాసన కలిగించే చెమటకు కారణమవుతాయి. ఈ గ్రంథులు ప్రధానంగా చంకలలో ఉంటాయి.
వర్షాకాలంలోనే ఎక్కువ
వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఉంటుంది. దీని కారణంగా శరీరం నుంచి విడుదలైన చెమట త్వరగా ఆరదు. దీనివల్ల చర్మంపై బ్యాక్టీరియా పెరగుతుంది. ఈ బ్యాక్టీరియా చెమటతో కలిసి దుర్వాసనను కలిగిస్తుంది. అదే సమయంలో వర్షాకాలంలో చాలామంది స్నానం చేయడంలో లేదా శరీరాన్ని శుభ్రపరచడంలో నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల కూడా ఈ సమస్య మరింత పెరుగుతుంది.
దుర్వాసనను తగ్గించే ఇంటి చిట్కాలు
పటికతో : పటికలో బ్యాక్టీరియాను చంపే గుణాలు ఉన్నాయి. కాబట్టి దానిని కొద్దిగా తీసుకుని నీటిలో నానబెట్టి చంకలలో లేదా దుర్వాసన వచ్చే భాగాలపై రాయండి. దీనిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల దుర్వాసన తగ్గడమే కాకుండా చెమట కూడా తగ్గుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ : యాపిల్ సైడర్ వెనిగర్ శరీరంలోని pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కాటన్ బాల్ సహాయంతో.. చంకలలో దీనిని అప్లై చేసి.. 10 నిమిషాల తర్వాత కడిగేయండి. దీనివల్ల వాసనలో వెంటనే మార్పు కనిపిస్తుంది.
నిమ్మరసం, బేకింగ్ సోడా మిశ్రమం: నిమ్మకాయలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. బేకింగ్ సోడా చెమటను పీల్చుకుంటుంది. కాబట్టి ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి చంకలలో రాయవచ్చు. 10 నిమిషాల తర్వాత కడగాలి. వారానికి రెండుసార్లు ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల మీ శరీరం దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం పొందుతుంది.
అలాగే వీటి శరీరానికి అప్లై చేయడం కాకుండా.. స్నానం చేసేప్పుడు ఆ నీటిలో కూడా కలిపి స్నానం చేయవచ్చు. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ శరీరంపై ఎలాంటి గాట్లు అయినా ఉంటే అప్లై చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి నొప్పి పెంచుతాయి. కాబట్టి గాయాలు లేని ప్రాంతంలో అప్లై చేసుకోవాలి. అలాగే శరీరంపై ఉండే దుస్తులు తడిగా లేకుండా చూసుకోవాలి. ఇవి కూడా దుర్వాసనను కలిగిస్తాయి.






















