Blood Washing: ‘బ్లడ్ వాషింగ్’ ట్రీట్మెంట్: కోవిడ్ భయంతో ఒంట్లో రక్తాన్ని కడిగేస్తున్నారు, ఈ చికిత్స సేఫేనా?
మీకు తెలుసా? కోవిడ్ వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యలను వదిలించుకోడానికి జనాలు తమ రక్తాన్ని కడిగేస్తున్నారు. అదెలా అనుకుంటున్నారా? మీరే చూడండి.
కోవిడ్-19.. ఈ వైరస్ గురించి మొన్నటి వరకు ప్రజల్లో భయం ఉండేది. కానీ, ఈ వైరస్ వ్యాప్తి, మరణాలు ఇప్పుడు ప్రజలకు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. లెక్కలు వేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ప్రస్తుతం కోవిడ్-19 సోకితే వారం లేదా రెండు వారాల్లో వదిలించుకోవచ్చు. కానీ, అది శరీరంలో మనకు తెలియకుండా చేసే డ్యామేజ్ వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అంటే, కోవిడ్ ఇప్పుడు స్లో పాయిజన్‌గా పనిచేయడం మొదలుపెట్టింది. వైరస్ తగ్గిందని మనం భావిస్తున్నా.. అది ఆకస్మిక దాడి చేయకుండా అదనుచూసి ఎటాక్ చేయడానికి శరీరంలో తిష్ట వేస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామం కోవిడ్-19 సెకండ్ వేవ్ కంటే ప్రమాదకరమైనదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కొత్త రకం చికిత్సల వైపుకు మొగ్గు చూపిస్తున్నారు. భవిష్యత్తులో కోవిడ్-19 ప్రభావం తమ ఆరోగ్యంపై చూపకూడదనే భయంతో ‘బ్లడ్ వాషింగ్’ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇంతకీ ‘బ్లడ్ వాషింగ్’ అంటే ఏమిటీ? ఈ చికిత్సలో ఏం చేస్తారు? అది సురక్షితమా కాదా?
గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్(GBD), వివిధ యూనివర్శిటీల పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మంది ప్రజలు సుదీర్ఘ కోవిడ్ లక్షణాలను అనుభవిస్తున్నారు. వారిలో భారతీయులే 4 కోట్ల మంది ఉన్నారు. శ్వాసకోశ ఇబ్బంది, పోస్ట్ అక్యూట్ ఫెటీగ్స్ సిండ్రోమ్, కాగ్నిటివ్ సిండ్రోమ్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ దీర్ఘకాలిక సమస్యలు పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉందట.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం 10-20% మంది వ్యక్తులు కోవిడ్-19 సంక్రమణ తర్వాత కనీసం రెండు నెలల వరకు లక్షణాలను అనుభవిస్తారు. ఈ సమస్యను ఎదుర్కోడానికి ఔషదాలేవీ అందుబాటులో లేవు. దానివల్ల ప్రజలు ప్రయోగాత్మక చికిత్సలను ఆశ్రయిస్తున్నారు. ఈ చికిత్సలు చాలా ఖరీదైనవి. పైగా వీటికి చట్టపరమైన మద్దతు కూడా లేదు. ప్రస్తుతం ఇది ఇండియాలో మొదలైందా లేదా అనే స్పష్టత లేదు. కానీ, బ్రిటన్‌కు చెందిన మీడియా సంస్థ ITV న్యూస్, The BMJ నిర్వహించిన పరిశోధనాత్మక కథనంలో పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు.
స్విట్జర్లాండ్, జర్మనీ, సైప్రస్ తదితర దేశాల్లోని వేలాది మంది దీర్ఘకాల కోవిడ్ రోగులు తమ రక్తాన్ని శుద్ధి చేసుకొనేందుకు ప్రైవేట్ క్లినిక్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రక్రియనే ‘బ్లడ్ వాష్’ లేదా ‘బ్లడ్ ఫిల్టరింగ్’ అని అంటారు. అయితే, ఈ చికిత్సతో దీర్ఘకాలిక కోవిడ్-19 లక్షణాలను తొలగించవచ్చనేది ప్రూవ్ కాలేదు.
‘బ్లడ్ వాషింగ్’ అంటే ఏమిటి?
‘బ్లడ్ వాషింగ్’ లేదా ‘అఫెరిసిస్’ అనేది సాధారణంగా లిపిడ్ డిజార్డర్‌లకు ఉపయోగించే చికిత్స. అంటే రక్తంలో ఉండే అసాధారణ కొవ్వు కణాలను తొలగించేందుకు చేసే ట్రీట్మెంట్. ఇది సికిల్ సెల్ డిసీజ్(ఆక్సిజన్‌ను తీసుకెళ్లే ఎర్ర రక్త కణాలు వడ్ల గింజల్లా మారిపోవడం వల్ల ఏర్పడే సమస్య)కు ఈ చికిత్స బాగా ఉపయోగపడుతోంది. ఈ ప్రక్రియలో అసాధారణ ఎర్ర రక్త కణాలు(వడ్ల గింజల్లాంటి కణాలు), లుకేమియా వంటి క్యాన్సర్లకు కారణమయ్యే కణాలను ఈ చికిత్సతో తొలగిస్తారు. అయితే, ఇది చాలా బాధకరమైన ప్రక్రియ. రెండు చేతుల్లో పెద్ద పెద్ద సూదులను నరాల్లోకి పంపిస్తారు. శరీరం నుంచి గ్రహించే రక్తాన్ని ఫిల్టర్ మీదుగా పంపి ఎర్ర రక్త కణాలను ప్లాస్మ నుంచి వేరు చేస్తారు. ఫిల్టరై వచ్చిన కణాలను మళ్లీ ప్లాస్మతో కలిపి వేరే రక్త నాళం ద్వారా శరీరంలోకి పంపింగ్ చేస్తారు. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. అందుకే, అంత ఖరీదు.
దీర్ఘకాల COVID రోగులకు ఇది పనిచేస్తుందా? సురక్షితమేనా?
BMJ పరిశోధనల పర్యవేక్షకుడు, ఎడిటర్ మాడ్లెన్ పేర్కొన్న వివరాల ప్రకారం.. సుదీర్ఘ కోవిడ్ సమస్యలు ఎదుర్కొనే రోగులకు బ్లడ్ ఫిల్టరింగ్ నిర్వహిస్తున్నారు. కోవిడ్ ప్రభావంతో రక్తంలో ఏర్పడే చిన్న గడ్డలు ఆక్సిజన్ ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. వాటిని తొలగించడం కోసమే క్లినిక్‌లు ‘బ్లడ్ వాషింగ్’ చికిత్సను అందిస్తున్నాయి. అయితే, ఆ గడ్డలను బ్లడ్ వాషింగ్ చికిత్స నిజంగానే ఫిల్టర్ చేస్తున్నాయా అని నిరూపించేందుకు బలమైన ఆధారాలేవీ లేవు. అయితే, ఇది వేరే రకం సమస్యలకు ఉపయోగించే చికిత్స. పైగా, ఈ చికిత్సతో దీర్ఘకాలిక కోవిడ్ రోగులకు ఉపశమనం కలిగిస్తుందనేది కూడా తేలలేదు. అలాంటి ఆధారాల్లేని చికిత్సను నమ్ముకుని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దని మాత్రమే నిపుణులు సూచిస్తున్నారు. వైద్యుల సలహా తీసుకోకుండా ఆరోగ్యంతో ప్రయోగాలు వద్దని అంటున్నారు. అది అవసరమైతే డాక్టర్లే మీకు సూచిస్తారు. కాబట్టి, ఆరోగ్యం విషయంలో రిస్క్ చేయొద్దు.
Also Read: ఈ వయస్సు వచ్చాక మగాళ్ల లైంగిక శక్తి మటాష్, ఇలా చేస్తే సేఫ్!
Also Read: ఎలోన్ మస్క్ తండ్రి వీర్యానికి అంత డిమాండా? 76 ఏళ్ల వయస్సులోనూ అదేపని!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.