జేడీఎస్‌లో చిచ్చు, తనదే అసలైన పార్టీ అంటున్న ఇబ్రహీం
పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పార్టీతో పొత్తు వ్యవహారం జనతా దళ్ సెక్యులర్ పార్టీలో చిచ్చు రాజేసింది. పార్టీ చీఫ్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ తీసుకున్న పార్టీలో సంక్షోభం సృష్టించే అవకాశం ఉంది.
పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పార్టీతో పొత్తు వ్యవహారం జనతా దళ్ సెక్యులర్ పార్టీలో చిచ్చు రాజేసింది. పార్టీ చీఫ్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ తీసుకున్న పార్టీలో సంక్షోభం సృష్టించే అవకాశం ఉంది. ఎన్డీయే కూటమిలో జేడీఎస్ చేరికను కర్ణాటక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధిష్ఠానం తీరుకు నిరసనగా కొంత మంది పార్టీ నేతలతో రహస్య సమావేశం నిర్వహించారు. బీజేపీతో కలిసి వెళ్లొద్దని దేవెగౌడను కోరిన రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం, సెక్యులర్‌గా ఉన్న తన వర్గమే అసలైన జేడీఎస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలతో కలిసి పని చేయలేమన్న ఇబ్రహీం, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎవరు, ఎలా, ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో చూద్దామన్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ తెలియజేస్తానన్నారు. ఇబ్రహీం ప్రకటనపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రుడన్న ఆయన, ఇబ్రహీం నిర్ణయం కోసం తామంటా వేచి చూస్తున్నామని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్ణయం ప్రకారం నడుచుకుంటామన్నారు.
ఆ అధికారం నాదే
జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడిగా రాష్ట్రంలో పార్టీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, తనకే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ సుప్రీం హెచ్ డీ దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిలు, బీజేపీతో వెళ్లాలనుకొంటే వెళ్లొచ్చని, తాము మాత్రం కలిసి నడిచేది లేదని హెచ్చరించారు. కమలం పార్టీతో కలిసి నడిచేది లేదని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఇబ్రహీం తెలిపారు. తనతో చాలా మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న ఆయన, పేర్లు చెప్పేందుకు మాత్రం నిరాకరించారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో సమావేశం అవుతానని, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.ఎన్డీఏలో జేడీఎస్ చేరదంటూ పార్టీ అధినేత దేవెగౌడ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడారు. పార్టీలో చీలిక ఏర్పడ్డట్లు పరోక్షంగా సంకేతాలిచ్చారు. తమదే అసలైన సెక్యులర్ వర్గమని ప్రకటించేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని ఆ పార్టీ అధినేత దేవెగౌడకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ- జేడీఎస్ పొత్తు తర్వాత కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో పలువురు జేడీఎస్ నేతలు పార్టీని వీడారని గుర్తు చేశారు.
గత నెలలోనే ఎన్డీఏలో చేరిన జేడీఎస్
జేడీఎస్ పార్టీ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో సెప్టెంబరు 22న అధికారికంగా చేరింది. కమలం పార్టీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఎన్డీయేలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు పొడుపులపై ఊహాగానాలకు తెరపడింది. కర్ణాటకలో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపులకు సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న జేడీఎస్, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని కుమారస్వామి ప్రకటించారు. ఆ పార్టీకి మాండ్యతో పాటు మరో మూడు లోక్‌సభ సీట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, జేడీెస్ లు సీట్లపై అధికారికంగా ప్రకటించాల్సింది.