(Source: ECI/ABP News/ABP Majha)
మందార పువ్వులతో ఇలా చేయండి చాలు, మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేస్తుంది
జుట్టు రాలిపోయే సమస్య ఆధునిక కాలంలో ఎక్కువైపోయింది. అలాంటి వారి కోసమే ఈ మందార పువ్వుల చిట్కాలు.
ఒత్తిడి, మానసిక ఆందోళన, వాతావరణంలోని కాలుష్యం, ఆహారంలో మార్పులు ఇవన్నీ జుట్టు పెరుగుదలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వెంట్రుకలు పలుచగా మారడం, పొడవు పెరగకపోవడం, ఎండిపోయినట్టు పొడిబారడం ఈ సమస్యలన్నీ జుట్టుని తద్వారా అందాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అందుకే జుట్టను కాపాకుకునేందుకు ఖర్చులేని మందు మందార పూలు, ఆకులు. ఇవి జుట్టుపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో, ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయో తెలుసుకోండి.
మందారలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఈ అమైనో ఆమ్లాలు మీ జుట్టుకు కెరాటిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచుతాయి. కెరాటిన్ వల్ల వెంట్రుకలు విరగకుండా, పొడవుగా, బలంగా పెరుగుతాయి. అందుకే మందార జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని చెబుతోంది ఆయుర్వేదం.
చుండ్రు
చిన్నా, పెద్ద తేడా లేకుండా చుండ్రు బారిన పడుతున్నారు. దానికి కారణం వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యమే. కంటికి కనిపించని ధూళి రేణువులు తలపైన మాడుకు అతుక్కుని, అక్కడే ఉండి చుండ్రుగా మారుతాయి. అలాగే పొడిబారి పోవడం వల్ల కూడా చుండ్రు సమస్యలు రావచ్చు. తల వెంట్రుకల విషయంలో సరైన PH సమతుల్యతను నిర్వహించడానికి, మందారలోని గుణాలు సహకరిస్తాయి.
కండిషనింగ్
కండిషనర్లను వందల రూపాయలు ఖర్చుపెట్టి కొంటుంటారు. అంత అవసరం లేకుండా మందార పువ్వులనే కండిషనింగ్‌కు వాడుకోవచ్చు. ఈ ఆకుల్లో అధిక మొత్తంలో శ్లేష్మం కలిగి ఉంటుంది. ఇది సహజ కండిషనర్‌గా ఉపయోగపడుతుంది. మీ జుట్టులో ఉన్న సహజ నూనెలను మందార పువ్వులోని కండిషనింగ్ లక్షణాలు కాపాడతాయి. జుట్టుకు పోషణ అందించడంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మందార ఆకులను రుబ్బి చూడండి. జిగటగా వస్తుంది. ఈ జిగటైన పదార్థమే సహజ కండిషనర్‌గా ఉపయోగపడుతుంది.
హెయిర్ ఆయిల్
మందార పువ్వులతో తయారు చేసిన నూనెను మాడుకు రాయడం వల్ల, వెంట్రుకలు బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. హై బిస్కస్ హెయిర్ ఆయిల్ పేరుతో మార్కెట్లో మందార పూల నూనె దొరుకుతుంది. ఇది జుట్టు పెరుగుదలను సహకరిస్తుంది. ఇంట్లో కూడా ఈ మందార పూల ఆయిల్‌ను తయారు చేసుకోవచ్చు.
షాంపూ
మందార పువ్వు ఆకులలో నురగను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి దీని షాంపూగా ఉపయోగించవచ్చు. పువ్వు, ఆకులను కలిపి మిక్సీలో వేసి తలకు పట్టించి చూడండి. ఇది జుట్టును శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
హెయిర్ మాస్క్
మందార పువ్వులు, ఆకులను మిక్సీలో పేస్ట్‌లా చేసి హెయిర్ మాస్క్‌గా వేసుకోండి. ఇవి మీ జుట్టుకు మెరుపును అందిస్తాయి. ఉసిరి, పెరుగు, కలబంద వంటివి కూడా ఈ మిశ్రమానికి కలిపితే మరీ మంచిది.
మందార పూలను, ఆకులను ఎండబెట్టి మీరు వాడే హెయిర్ ఆయిల్ లో కలుపుకొని, ఆ నూనెను రాసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి.
Also read: ఈమె స్లీపింగ్ బ్యూటీ, రోజులో 22 గంటలు నిద్రపోతూనే ఉంటుంది -కారణం ఆ రోగమే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.