Cracked Heels: పాదాలు పగిలి అసహ్యంగా ఉన్నాయా? ఈ చిట్కాలు మీకోసమే
మృదువైన అందమైన పాదాలు కావాలంటే ఈ చిట్కాలు పాటించి చూడండి. పగిలిన మడమల సమస్యే ఉండదు.
పగిలిన మడమలు చూసేందుకు చాలా అసహ్యంగా అనిపిస్తాయి. మహిళలు తరచుగా ఈ సమస్య బారిన పడుతుంటారు. పాదాలు రఫ్ గా మారిపోయి పడుకున్నప్పుడు బెడ్ షీట్స్ కి పగుళ్లు రాసుకుంటూ చాలా ఇబ్బంది కరంగా అనిపిస్తుంది. నలుగురిలో తిరిగేటప్పుడు కూడా పాదాలు దాచుకుని నడుస్తారు. పగుళ్లు పోగొట్టుకోకపోతే వాటిలో మట్టి చేరిపోయి ఇన్ఫెక్షన్ కి దారి తీసే ప్రమాదం ఉంది. అందుకే వాటిని నయం చేసుకోవడం అవసరం. పగిలిన మడమలకు చికిత్స చేయడంలో సహాయపడే కొన్ని ఇంటింటి చిట్కాలు ఇవి.
పాదాలు నానబెట్టాలి: చర్మాన్ని మృదువుగా చేయడానికి పాదాలను గోరు వెచ్చని నీటిలో సుమారు 15-20 నిమిషాల పాటు నానబెట్టాలి. అలా చేయడం వల్ల పాదాలు మృదువుగా మారతాయి. కాళ్ళ మీద పేరుకుపోయిన మట్టి, దుమ్ము, ధూళి కూడా పోతుంది. మరిన్ని ప్రయోజనాలు పొందటం కోసం అందులో కొద్దిగా ఉప్పు లేదా కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇవి పాదాల మీద ఉన్న మృతకణాలను తొలగిస్తుంది.
ఎక్స్ ఫోలియేట్: నానబెట్టిన తర్వాత ఎక్స్ ఫోలియేట్ చేయడం చాలా ముఖ్యం. ఫూట్ స్క్రబ్ తో మెత్తగా రుద్దుకోవాలి. గట్టిగా మాత్రం స్క్రబ్ చేయకూడదు. అది చర్మాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఇలా ఎక్స్ ఫోలియేషన్ చేయడం వల్ల పాదాలు పొడి బారిపోకుండా చేస్తుంది. గరుకుదనాన్ని తగ్గిస్తుంది.
మాయిశ్చరైజర్: చర్మానికి మాయిశ్చరైజర్ ఎలా రాస్తామో అలాగే పాదాలకు క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేయడం అవసరం. పాదాలు శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత వాటిని కాసేపు ఆరనిచ్చి అప్పుడ మాయిశ్చరైజింగ్ క్రీమ్ లేదా పాదాల సంరక్షణ క్రీమ్ ఏదైనా రాసుకోవచ్చు. షియా బటర్, కొబ్బరి నూనె లేదా పెట్రోలియం జెల్లీ వంటి పదార్థాలు కలిగిన ఉత్పత్తులు రాసుకుంటే మంచిది. ఇవి తేమని లాక్ చేసి చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడతాయి. ఉత్తమ ఫలితాల కోసం ఉదయం, పడుకునే ముందు పాదాలు మాయిశ్చరైజ్ చేయడం మంచిది.
చెప్పులు: అందం, స్టైల్ కోసం కాకుండా సౌకర్యవంతంగా ఉండే పాదరక్షలు ధరించాలి. పాదాలు ఊపిరి పీల్చుకోవడానికి అనువుగా ఉండే వనెల బ్యాక్డ్ బూట్లు లేదా చెప్పులు ఎంచుకోవడం మంచిది. సరిగా సరిపోని లేదా బిగుతైన బూట్లు, సింథటిక్ పదార్థాలతో తయారు చేసిన వాటిని ధరించడం వల్ల పాదాల చర్మం దెబ్బతింటుంది. పగిలిన మడమల పరిస్థితిని ఇవి మరింత దిగజారే విధంగా చేస్తాయి.
హీల్ బామ్: పగిలిన మాడమలు నయం చేసుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన హీల్ బాల లేదా ఆయింట్ మెంట్లు ఉపయోగించాలి. సాలిసిలిక్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు లేదా లాక్టిక్ యాసిడ్ వంటి పదార్థాలని కలిగి ఉన్న ఉత్పత్తులు మేలు చేస్తాయి. చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడతాయి.
హైడ్రేట్ గా ఉండాలి: శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు నీటిని తాగాలి. హైడ్రేట్ గా ఉండటం వల్ల చర్మం పొడి బారిపోకుండా ఉంటుంది. అలాగే పగుళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది.
సాక్స్ వేసుకోవాలి: మడమల మీద మాయిశ్చరైజర్ లేదా పెట్రోలియం జెల్లీ రాసుకుని పడుకునే ముందు కాటన్ సాక్స్ ధరించాలి. ఇది తేమని సీల్ చేయడంలో సహాయపడుతుంది.
నీటిలో ఎక్కువ సేపు ఉండొద్దు: గంటల తరబడి నీటిలో ఉండటం, ముఖ్యంగా వేడి నీరు చర్మాన్ని పొడి బారిపోయేలా చేస్తుంది. వీలైతే ఎక్కువ సేపు ఈత కొట్టడం వంటి కార్యకలాపాలు తగ్గించాలి.
ఆరోగ్యకరమైన ఆహారం: ఆహారంలో విటమిన్లు ఏ, సి, ఇ, జింక్, ఐరన్ వంటి ఖనిజాలు అధికంగా ఉండేవి ఎంచుకోవాలి. ఈ పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. తాజా పండ్లు, కూరగయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు తీసుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఆకలిగా ఉండటం లేదా? ప్రమాదకరమైన వ్యాధికి ఇది ముందస్తు లక్షణం