Mattress: పాత పరుపులను ఇంకా వాడుతున్నారా? వాటిపై ఏమేమి ఉంటాయో తెలిస్తే, వణికిపోతారు!
పరుపు కనీసం ఆరేళ్ళకి ఒకసారైన మార్చుకుని కొత్తది తెచ్చుకోవాలని అంటున్నారు నిపుణులు. లేదంటే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడిపోవడం ఖాయం.
కొంతమంది ఇళ్లలో బెడ్ గుంటలు పడి, కొబ్బరి పీచు గుచ్చుకుంటున్నా కూడా దాని మీద పడుకుని నిద్రపోతారు. మీరు కూడా అదే కోవకి చెందిన వాళ్ళా? అయితే జాగ్రత్త మీకు అనేక రోగాలు ఎక్కడ నుంచో కాదు మీరు పడుకునే బెడ్ నుంచే వ్యాపిస్తాయి. ఏళ్ల తరబడి బెడ్ మార్చకుండా దాన్ని ఉపయోగిస్తూ ఉంటే గొంతు నొప్పి, కళ్ళు దురద, అతిసారం, వాంతులు, తీవ్రమైన అంటువ్యాధులు, న్యూమోనియాకు కారణమవుతుంది. ఇవే కాదండోయ్ బాగా అరిగిపోయిన పరుపు మీద పడుకోవడం వల్ల వెన్ను నొప్పి, ఒళ్ళు నొప్పులు, నిద్ర సమస్యలకి దారితీస్తుంది. అందుకే ప్రతి ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలకి ఒక సారి పరుపు మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే నాణ్యమైన నిద్రతో పాటు రోగాలు రాకుండా ఉంటాయి.
సరైన పరుపు మీద పడుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలగడమే కాదు నిద్రలేవగానే ఒళ్ళు నొప్పులు లేకుండ ప్రశాంతంగా ఉంటారు. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే శిశువులు బెడ్ తడిపేస్తూ ఉంటారు. ఎండలో ఆరబెట్టుకుని మళ్ళీ దాన్ని వినియోగిస్తూ ఉంటారు. అలా బెడ్ తడవడం, దుమ్ము, ధూళి చేరడం వల్ల బ్యాక్టీరియా చేరిపోయి చర్మ సమస్యలతో పాటు అనారోగ్యం కలిగిస్తుంది. మీ బెడ్ ఎందుకు మార్చాలో అందుకు కారణాలు ఇవి..
బ్యాక్టీరియా
చిరిగిన పరుపు బ్యాక్టీరియా సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. స్టెఫిలోకాకస్, లాక్టోబాసిల్లస్, స్ట్రెప్టోకోకస్, ఇ కోలి వంటి బ్యాక్టీరియాలు పరుపులో ఉంటాయని పరిశోధనలు వెల్లడించాయి. ఇవి చర్మ ఇన్ఫెక్షన్లు, కడుపు నొప్పి కీళ్ల సమస్యలు, న్యుమోనియాకి కారణమవుతాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, గుండె, ఎముక, కంటి ఇన్ఫెక్షన్లు కూడా కలిగిస్తాయి.
దుమ్ము పురుగులు
ఎప్పుడైనా మీరు పరుపు కర్రతో లేదా ఏదైనా బలమైన వస్తువుతో కొట్టి చూడండి. అందులో నుంచి భయంకరంగా దుమ్ము వస్తుంది. దానిలో దుమ్ము పురుగులు చెరిపోతాయి. ఇవి తామర వంటి చర్మ సమస్యలు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలు కలిగించడం చేస్తాయి. సాధారణంగా ఎనిమిదేళ్ళలో సగటున 11 lb(5 కేజీ) ల మృత చర్మ కణాలు తొలగిస్తాం. అదే మీరు బెడ్ మీద పెంపుడు జంతువులతో కలిసి పడుకుంటే దాని సంఖ్య రెట్టింపు అవుతుంది.
చెమట
శరీరం నుంచి వచ్చే చెమట, లాలాజలం, చర్మ నూనె మొత్తం పరుపులోకి చెరిపోతాయి. ఈ ద్రవాలు షీట్ నుంచి బయటకి వెళ్ళి పరుపులో ఉంటాయి. కొన్ని సంవత్సరాలుగా అలాగే అతుక్కుని ఉండిపోతాయి. పరుపు జీవితకాలంలో ఈ ద్రవాలు రెండు బాత్ టబ్ లని నింపగలవని నిపుణులు చెబుతున్నారు. సగటున ఒక వ్యక్తి ఏడాదికి 26 గ్యాలన్ల చెమటని బెడ్ మీదకి వదులుతాడట. అది తేమకి నిలయంగా మారి ఫంగస్ కి చోటు కల్పిస్తుంది. ఈస్ట్, బూజు, స్టెఫిలోకాకస్ ఆరియస్ వంటి బాక్టీరియా పరుపులోకి ప్రవేశించి పుండ్లు, బొబ్బలు, కళ్ళు మంట, కనురెప్పలపై బాధకరమైన ఎర్రటి దద్దుర్లు ఏర్పడేలా చేస్తాయి.
ఫంగస్
దుప్పట్లు, బెడ్ మార్చకపోతే ఫంగస్ చేరిపోతుంది. ఇవి స్వల్ప, దీర్ఘకాలిక ఆరోగ్యానికి హాని చేస్తాయి. పడకగది తేమగా లేదంటే వెంటిలేషన్ సరిగా లేకపోతే ఇది మరింతగా వ్యాపిస్తుంది. దీని వల్ల ముక్కు కారడం, తుమ్ములు, కళ్ళు, చర్మం ఎర్రగా మారిపోతుంది.
నిద్ర
పాత పరుపులు నిద్రని నాశనం చేస్తాయి. పరుపు సరిగా లేకపోతే ఒళ్ళు నొప్పులు వస్తాయి. నిద్ర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అది రోజువారీ కార్యకలాపాల మీద ప్రభావం చూపిస్తుంది. స్లీపింగ్ పొజిషన్ కూడా ఇబ్బంది పెడుతుంది. నాణ్యమైన నిద్ర పొందాలని అనుకుంటే తప్పనిసరిగా పరుపు మారుస్తూ ఉండాలి. ఇవే కాదు ఎప్పటికప్పుడు పరుపులు వ్యాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేసుకోవాలి. అందులోని దుమ్ము, ధూళి బయటకి పోయే విధంగా చూసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పులియబెట్టిన అన్నం తినడం ఆరోగ్యానికి మంచిదట, ప్రయోజనాలేమిటో తెలుసా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial