ఈ ఆహార పదార్థాలు పొట్టలో సీక్రెట్‌గా ఎసిడిటీ పెంచేస్తాయ్
కారంగా ఉండే పదార్థాలు అతిగా తినడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. వాటిని తినడం తగ్గించకపోతే తీవ్ర సమస్యలకి దారి తీసే ప్రమాదం ఉంది.
ఎసిడిటీ చాలా ఇబ్బందికర సమస్య. గుండెల్లో మంట, అజీర్ణం వంటి పొట్ట సంబంధిత సమస్యలు వచ్చి చాలా అసౌకర్యంగా ఉంటుంది. పేగులు బలహీనంగా ఉంటే ఇటువంటి సమస్యలు పునరావృతం అవుతూనే ఉంటాయి. కాస్త కారం తగిలినా కూడా కడుపులో మంటగా ఉంటుంది. ఎసిడిటీ ఎక్కువగా భోజనం చేసిన వెంటనే లేదా రాత్రి సమయంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. మందులపై ఆధారపడి చికిత్స తీసుకునే కంటే ఎసిడిటీ కలిగించే ఆహారాన్ని దూరం పెట్టడం మంచిది. కడుపులో మంట, గ్యాస్ కలిగించే కొన్ని సాధారణ ఆహారాల జాబితా ఇది.
స్పైసీ ఫుడ్
కొంతమంది కారంగా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారు. పచ్చి మిరపకాయలు, హాట్ సాస్, చిల్లీ ఫ్లేక్స్ వంటి ఘాటు ఎక్కువగా ఉండే పదార్థాలు జోడించుకుని తినడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ఎసిడిటీ సమస్య ఉన్న వాళ్ళు వీటికి దూరంగా ఉండటమే మంచిది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆమ్లత్వం, గుండెల్లో మంట ఏర్పడుతుంది. దీన్ని తగ్గించుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది.
కాఫీ
పరిమిత కాఫీ ఆరోగ్యానికి మంచిదని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. కానీ కొన్ని సందర్భాల్లో కాఫీ కూడా ఎసిడిటీకి ముఖ్యంగా యాసిడ్ రిఫ్లక్స్ కలిగిస్తాయి. ఒక కప్పు కాఫీ తాగడం వల్ల ఎటువంటి హాని కలిగించకపోయినా దాన్ని ఎక్కువగా తీసుకుంటే మాత్రం అనేక ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది. కాఫీ అతిగా తాగితే నిద్రలేమి, తలనొప్పి, గుండె దడ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎసిడిటీతో బాధపడే వాళ్ళు కాఫీ కి బదులు డికాఫ్ కి మారడం ఉత్తమం.
చక్కెర
ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. చక్కెర కూడా ఎసిడిటీ వచ్చే అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి. చాలా మంది టీ లేదా కాఫీ లేదా డెజర్ట్ లో తియ్యదనం కోసం చక్కెర ఉపయోగిస్తారు. చక్కెరలో అధిక ఆమ్లత్వం ఉంటుంది. రక్తంలో చక్కెర పెరుగుదలకి కారణమవుతుంది. వేగంగా బరువు పెరుగుతారు. తెల్ల చక్కెరకి బదులుగా స్టెవియా తీసుకోవచ్చు ఇది ఆరోగ్యకరమైన సహజ స్వీటేనర్లలో ఒకటి.
ఊరగాయలు
భోజనంతో పాటు కొంతమంది క్రమం తప్పకుండా పచ్చళ్లని తీసుకుంటారు. ఊరగాయల్లో వెనిగర్ ఉంటుంది. ఇది చాలా ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. కొన్ని ఊరగాయల్లో మసాలా, నూనె అధికంగా ఉంటాయి. ఇవి కూడా ఎసిడిటీకి కారణమవుతాయి.
చల్లని పానీయాలు
శీతల పానీయాలు కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి బరువుని పెంచడమే కాకుండా ఎసిడిటీ వంటి పొట్ట సంబంధిత సమస్యలు తీసుకొస్తాయి. దీర్ఘకాలంలో దీని ప్రభావం చూపిస్తుంది. శీతల పానీయాలు, సోడాలకి బదులుగా తాజా పండ్లు, కూరగాయల రసాలు, కొబ్బరి నీళ్ళతో భర్తీ చేసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: చల్లని vs వేడి నీళ్ళు - ఏ నీటితో తలస్నానం చేస్తే మంచిది?